ఖరీఫ్ సాగుకు వేళాయె..
- 21 మండలాల్లో తొలకరి జల్లులు
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
- పొలాలు దుక్కి చేసుకోవడంలో నిమగ్నం
అనంతపురం అగ్రికల్చర్ : మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భానుడు తన ప్రతాపం చూపాడు. ఎండలు మండాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. గురువారం జిల్లాలో అక్కడక్కడ తొలకరి జల్లులు పడడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. అయితే కొన్ని మండలాల్లో వేసవి తాపం కొనసాగుతోంది. గాలులు కూడా అధికంగా వీస్తున్నాయి. శింగనమల మండలంలో అత్యధికంగా 40.7 డిగ్రీలు నమోదు కాగా, యల్లనూరు 40.4 డిగ్రీలు, పుట్టపర్తి 40.2 డిగ్రీలు, విడపనకల్ 40.1 డిగ్రీలు, యాడికి 40 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 39.4 డిగ్రీలు, గార్లదిన్నె 39.2 డిగ్రీలు, పెద్దవడుగూరు 39.1 డిగ్రీలు, తాడిపత్రి 39.1 డిగ్రీలు, అనంతపురం 38.4 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రత ఉండగా, 25 నుంచి 27 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 70 నుంచి 85, మధ్యాహ్నం 25 నుంచి 35 శాతం మధ్య రికార్డయ్యింది. గాలి వేగం సగటున 8 నుంచి 16 కిలో మీటర్లుగా నమోదైంది. అయితే బత్తలపల్లి, పుట్లూరు, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి, కంబదూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, బుక్కరాయసముద్రం, కనేకల్లు, బొమ్మనహాల్, డి.హీరేహాల్, కనగానపల్లి, తలుపుల, వజ్రకరూరు, యాడికి, అమడగూరు, గుడిబండ, పెనుకొండ, కదిరి, ముదిగుబ్బ, నల్లచెరువు మండలాల్లో 20 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో గాలి వీచింది.
ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ :
ఖరీఫ్ ఆరంభమైన తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో తొలకరి జల్లులు పలకరించాయి. తాడిమర్రి మండలంలో అత్యధికంగా 22 మి.మీ. వర్షం పడగా, కుందుర్పి 19.7 మి.మీ, బత్తలపల్లి 18.4 మి.మీ, నార్పల 15.2 మి.మీ, పుట్లూరు 14 మి.మీ, ముదిగుబ్బ 13.9 మి.మీ, ధర్మవరం 10.2 మి.మీ.కురిసింది. శెట్టూరు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి, గాండ్లపెంట, అమరాపురం, గుంతకల్లు, కంబదూరు, బెళుగుప్ప తదితర మండలాల్లో తుంపర్లు పడ్డాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా తొలిరోజు సగటున 2.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.