breaking news
Railway gate works
-
మోక్షం కలిగేనా?
సాక్షి, రాజాపూర్: మండలంలోని రంగారెడ్డిగూడ శివారులో ఉన్న రైౖల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి లేక వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేట్లు ఉన్న స్థానంలో అండర్ వే నిర్మించి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. మండల కేంద్రం నుంచి మల్లేపల్లికి వెళ్లేదారిలో ఉన్నా రైల్వేగేట్‌ను తొలగించి దాని స్థానంలో అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇక్కడ నిర్మించినట్లుగానే రంగారెడ్డి గూడా వద్ద నిర్మిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పట్లో అండర్ బ్రిడ్జికి మోక్షం లేనట్లేనని అనిపిస్తుంది. గతంలో రైళ్లు చాలా తక్కువగా తిరిగేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తుండడంతో, ప్రతి సారి రంగారెడ్డిగూడ వద్ద ఉన్న గేట్‌ను వేయడంతో అటు నుంచి వెళ్లే కల్లేపల్లి, అగ్రహారం పొట్లపల్లి, గుండ్లపొట్లపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అదనంగా డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు చకచక పనులు సాగుతున్నాయి. డబుల్ లైన్ పూర్తయితే మరిన్ని రైళ్లు తిరిగే అవకాశం ఉంది. దీంతో రంగారెడ్డిగూడవద్ద అండర్‌బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉంది. గతంలో రైల్వేశాఖ అధికారులు సర్వే నిర్వహించి అండర్ వే నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులకు వినతులు ఇచ్చాం రైల్వే గేట్ స్థానంలో అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చిన అధికారులకు వినతులు ఇచ్చాం. అండర్ బ్రిడ్జి ఇక్కడ చాలా అవసరం. గ్రామసభలో కూడా తీర్మానం చేసి రైల్వేశాఖ అధికారులకు పంపిస్తాం. గొల్లపల్లి, రాజాపూర్, పెద్దాయపల్లి గ్రామాల వద్ద రైల్వేగేట్ల స్థానంలో నిర్మించినట్లుగానే రంగారెడ్డిగూడ వద్ద ఉన్న రైల్వేగేట్ స్థానంలో ఖచ్చితంగా అండర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి. – జనంపల్లి శశికళ, సర్పంచ్, రంగారెడ్డిగూడ -
నత్తనడకన రైల్వే గేటు పనులు
కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్న పోలీసులు వెల్దుర్తి : మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు మృత్యువాత పడినా, రైల్వే అధికారులు మాత్రం తమ మొద్దు నిద్ర వీడడం లేదు. 24వ తేదీ దుర్ఘటన జరిగిన వెంటనే దేశ వ్యాప్తంగా రైల్వే పనితీరుపై విమర్శలు వెల్లువెత్తగా, 25వ తేదీనే రైల్వే అధికారులు హుటాహుటీన గేటు ఏర్పాటు కోసం పనులు ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభమై వారం రోజులు గడిచినా పూర్తి కావడం లేదు. మరోవైపు ప్రమాదస్థలి నిజామాబాద్ - హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఈ దారి వెంట వెళుతున్న వారంతా వాహనాలు పక్కకు ఆపి ప్రమాద స్థలికి వెళ్లి మృతులకు నివాళులర్పిస్తున్నారు. ఇక చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, వివిధ పాఠశాలల చిన్నారులు పెద్దఎత్తున ప్రమాద స్థలికి తరలివస్తుండడంతో సంఘటన జరిగిన రైల్వే ట్రాక్ సమీపంలో రద్దీ బాగా పెరిగింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట సీఐ గంగాధర్ ఆదేశాల మేరకు చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు 24 గంటల పాటు కంటిమీద కనుకు లేకుండా రైల్వే గేటు వద్ద కాపలా కాస్తున్నారు. రైళ్లు వస్తున్న సమయంలో ప్రజలు రైలు పట్టాలవైపు రాకుండా చూడడంతో పాటు వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. రైలు వెళ్లిపోగానే రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. రైలు గేటు పనులు ఇంకా నాలుగు రోజులు పాటు జరిగే అవకాశం ఉండడంతో అంతవరకూ అక్కడే ఉండి విధులు నిర్వర్తించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.