breaking news
Queen of Hills
-
స్ఫూర్తి..:వెటకారం చేసిన నోళ్లే... వేనోళ్ల పొగిడాయి!
‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్‌ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు. తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్‌పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్‌నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది. ‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. బండి తెల్లముఖం వేసింది. వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది. ‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్‌తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి. హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది. ‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి. మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల. యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి! -
పచ్చబంగారు లోకం... మాకు కావాలి సొంతం...
చూసొద్దాం! ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న గిరులు... అబ్బురపరిచే లోయలు.. వీనుల విందుచేసే జలపాతాల గలగలలు.. మేనిని తాకే చల్లని గాలులు.. వేసవి విహారంలో పచ్చబంగారు లోకాన్ని చుట్టివచ్చేవారికి కనుల పండగ చేస్తుంది కూనూరు. ‘క్వీన్ ఆఫ్ హిల్స్’ అని అప్పట్లో ఆంగ్లేయులు ముద్దుగా పిలుచుకునే నీలగిరి పర్వత శ్రేణులవి. వేసవి రాగానే పర్యాటకుల మదిలో తొంగిచూసే ప్రాంతం అది. పేరు కూనూరు. పచ్చని దుప్పటి కప్పుకున్న కొండలు, లోయలను చూస్తూ జలపాతం గలగలలు వింటూ ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి ఆనందంగా విహరించాలంటే ఎంచుకోదగిన హిల్‌స్టేషన్ కూనూరు. తేయాకు పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఉదకమండలంగా పేరుగాంచిన ఊటి పచ్చదనం గురించి వినే ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం కోయంబత్తూరు నుంచి 80 కి.మీ దూరంలో ఉంది. ఊటీ నుంచి 18 కి.మీ.దూరంలో ఉంది కూనూరు. కూనూరులో చూడదగినవి: సిమ్స్ పార్క్: కూనూరులో తప్పక చూడదగినది సిమ్స్ పార్క్. ఇందులో 1,000 రకాల వృక్షజాతులు ఉన్నాయి. ఇక్కడి బొటానికల్ గార్డెన్‌ను పూర్తిగా జపాన్ స్టైల్లో అభివృద్ధి పరిచారు. ఇక్కడే ఏనుగు కాలును పోలిన చెట్టును చూడవచ్చు. ముగ్గురు మనుషులు వలయాకారంగా నిలబడితే ఉండేంత లావు ఉంటుందీ చెట్టు. పొమలాజికల్ స్టేషన్: రాష్ట్ర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఇది. దీనిలో దానిమ్మ, ఆప్రికాట్ తోటల పెంపకంపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్ నోస్: కూనూరుకు 10 కి.మీ దూరంలో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గర నిలబడితే నీలగిరి పర్వతశ్రేణుల అందచందాలను, జలపాతాల సొగసును కనులారా వీక్షించవచ్చు. లంబాస్ రాక్: కూనూరుకు అయిదున్నర కి.మీ దూరంలో లంబాస్ రాక్ మరొక వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే కాఫీ, తేయాకు తోటల పచ్చదనం అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది. డ్రూగ్ ఫోర్ట్: కూనూరుకు 13 కి.మీ దూరంలో ఉంది డ్రూగ్ కోట. 18వ శతాబ్దంలో టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈ కోట శిథిలాలు నేటికీ చూడవచ్చు. పాశ్చర్ ఇన్స్టిట్యూట్: పర్యాటకులు అనుమతి తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ను సందర్శించవచ్చు. కుక్కకాటు కారణంగా వచ్చే రేబిస్కి వ్యాక్సినేషన్‌ను శాస్త్రవేత్తలు ఇక్కడే అభివృద్ధి పరిచారు. జలపాతాల సొగసు: కూనూరుకు 5 కి.మీ దూరంలో మెట్టుపాలయం వెళ్లే దారిలో కటరి, లాస్ జలపాతాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలోనే ఉన్న సరస్సులో బోటు షికారు చేయవచ్చు. రకరకాల పువ్వుల అందాలను వీక్షించవచ్చు. ఊటీ నుంచి కూనూరుకు వెళ్లటానికి ఒక రైలు బండి ఉంటుంది. ఆంగ్లేయుల కాలంలో వేసిన పట్టాల మీద అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కి.మీ దూరాన్ని 2 గంటలలో తీసుకువెళుతుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్లటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను తాపీగా హ్యాపీగా ఆస్వాదించవచ్చు. మధ్యలో రెండు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమైన లోయలలో ప్రయాణిస్తున్నంతసేపు మంచి అనుభూతిని పొందవచ్చు. చుట్టుపక్కల చూడదగినవి: ఊటీలో ఉన్న రోజ్ గార్డెన్లో ఎన్నెన్నో రంగురంగుల గులాబీలు. నలుపు, ఆకుపచ్చ, 2-3 రంగులు కలగలిసిన గులాబీలు మరెన్నో.. పిల్లలు ఆడుకోవడానికి చక్కని ప్లేస్ ఇది. వేసవిలో కూడా ఇక్కడ వర్షం పడుతుండటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. డాల్ఫిన్ నోస్, ఊటీ లేక్, బోట్ హౌస్, బొటానికల్ గార్డెన్, దొడ్డబెట్ట..లను తిలకించాక బోట్ రైడింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు. దొడ్డబెట్టకు దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన శిఖరంగా పేరున్నది. ఇక్కడ మేఘాలు తరచుగా కలుస్తూ విశ్రాంతి తీసుకుంటాయా అనిపిస్తుంది. ఇక్కడ తమిళనాడు పర్యాటకశాఖ టెలీస్కోప్‌లు ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి టెలీస్కోప్‌ల ద్వారా చూస్తే కొండలు, లోయలు, ఆకుపచ్చ తివాచీ పరిచినట్టు ఉండే అటవీ ప్రాంతం అందంగా కనిపిస్తుంది. కూనూరు వెళ్లాలంటే... కోయంబత్తూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి కూనూరు 56 కి.మీ. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ తొమ్మిది గంటలకు మెట్టుపాలయం రైలు బయల్దేరుతుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం ఆరుంబావుకి మెట్టుపాలయం చేరుతుంది. మెట్టుపాలయం నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న కూనూరుకు ఊటీ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఘాట్‌రోడ్డులో బస్సు మలుపులు తిరుగుతూ కొండలపైకి ఎక్కడం ప్రారంభించాక... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన ప్రదేశం ఇది అనుకుంటా రు. పొడవాటి పైన్ వృక్షాలతో అలరారే ఈ పచ్చ బం గారు లోకం నిలువెల్లా అద్భుత దృశ్యకావ్యం. నవదంప తులు నుంచి వయోవృద్ధుల వరకు అంతా ఇష్టపడే ప్రాంతం ఇది. ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.