breaking news
PSLV C 37
-
ఇంతింతై వటుడింతై..
అంచెలంచెలుగా ఎదిగిన ఇస్రో – దేశీయ పరిజ్ఞానమే పెట్టుబడి జూన్ 19, 1981... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బాలారిష్టాలు దాటుకుని తొలి విజయాలు అందుకుంటున్న సమయం అది. దేశ వ్యాప్తంగా టెలివిజన్ ప్రసారాల కోసం ఉద్దేశించిన ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ (ఆపిల్) ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రానికి తరలించాలి. విమానం దాకా తీసుకెళ్లేందుకు లోహాలేవీ లేని వాహనం అవసరం. అత్యాధునికమైన వాటిని దిగుమతి చేసుకుని వాడేంత స్థోమత లేదు. సొంతంగా తయారు చేసుకుందామా అంటే... 1974 నాటి అణు పరీక్షల కారణంగా అగ్రరాజ్యాల ఆంక్షలు అనుమతించవు. ఆ సమయంలో సింపుల్‌గా ఓ ఎడ్ల బండిపై ఉపగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. సెప్టెంబరు 24, 2014... ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిన రోజిది. రెండు రోజుల ముందు అగ్రరాజ్యం అమెరికా ప్రయోగించిన మావెన్ కూడా కక్ష్యలోకి చేరింది. ఇస్రో నిర్మించిన మంగళ్యాన్ కేవలం రూ.450 కోట్లతో అంతదూరాన్ని అధిగమిస్తే... మావెన్ ఇందుకోసం తొమ్మిది రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారక గ్రహాన్ని అందుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది కూడా ఈరోజే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ పరంపరలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించడం తాజా ఘట్టం. ఇది అపురూపమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమితమైన వనరులు, కీలకమైన టెక్నాలజీపై ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాలను సుసాధ్యం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాది బడ్జెట్‌నే ఉదాహరణగా తీసుకుంటే భారత్ తన అంతరిక్ష కార్యక్రమాల కోసం పెట్టే ఖర్చు కేవలం వందకోట్ల డాలర్లు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా చేసే వ్యయం 1930 కోట్ల డాలర్లు! ఇంకోవైపు ఇస్రోలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. శాస్త్రవేత్తల వేతనాలు కూడా గొప్పగా ఏమీ లేవు. అయినా ఇస్రో ఇన్ని అద్భుతమైన విజయాలు సాధించగలుగుతోంది అంటే అందుకు కారణం దేశం కోసం ఏమైనా చేయాలి అన్న దృఢ సంకల్పం మాత్రమే. తెలివే పెట్టుబడి అంతరిక్ష ప్రయోగాల ఖర్చును వీలైనంత వరకూ తగ్గించేందుకు ఇస్రో తెలివినే పెట్టుబడిగా పెట్టింది. మంగళ్యాన్ ప్రయోగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. దీంట్లో ఇంధన ఖర్చును తగ్గించేందుకు ఎప్పుడో 1993లో వాడిన ఓ చిన్న రాకెట్‌ను ఇందులో ఉపయోగించింది. ఇతర దేశాల మాదిరిగా అనేక మోడళ్లను తయారు చేయకుండా ఒకే ఒక్క మోడల్‌ను తయారు చేసి దాన్నే ప్రయోగించింది. మునుపు ఎన్నడూ ఎవరూ ఉపయోగించని స్లింగ్ షాట్ పద్ధతిని ఉపయోగించింది. పొలాల్లో పక్షులను పారదోలేందుకు వాడే వడిసె గురించి తెలుసుగా... ఈ స్లింగ్ షాట్ పద్ధతి కూడా అలాంటిదే. ఎలాగైతే మనం వడిసెలో రాయిని పెట్టి గిర్రున తిప్పుతూ తగిన వేగం అందుకోగానే విసిరేస్తామో... అలాగే ఓ రాకెట్‌ను భూమిచుట్టూ కొన్నిసార్లు తిప్పి.. అంగారక గ్రహం మనకు అత్యంత దగ్గరగా వచ్చే సమయానికి దానివైపు విసిరేశామన్నమాట. తద్వారా అంగారకుడిపైకి నేరుగా వెళ్లేందుకు భారీ సైజున్న రాకెట్‌ను ఉపయోగించాల్సిన అవసరాన్ని తప్పించింది ఇస్రో. మంగళ్యాన్లో వాడిన విడిభాగాల్లో దాదాపు 60% లార్సెన్ అండ్ టూబ్రో, గోద్రేజ్ అండ్ బాయ్సీ వంటి దేశీయ కంపెనీలే తయారు చేశాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు బుధవారం ఇస్రో పీఎస్ఎల్వీ సీ– 37 ద్వారా ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడం భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయి. ఈ సంక్లిష్టమైన, కీలకమైన ప్రక్రియ మొత్తం ఎలా జరిగిందో కళ్లారా చూడాలనుకుంటే.. ఇస్రో వెబ్‌సైట్‌లోని ఆన్‌బోర్డ్ కెమెరా రికార్డింగ్‌ను (http://www.isro.gov.in/pslv&c37&cartosat&2&series&satellite/pslv&c37&lift&and&onboard&camera& video) చూడవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కార్టోశాట్–2డీతో భౌగోళిక సమాచారం
శ్రీహరికోట (సూళ్లూ రుపేట): దేశీయ అవసరాల కోసం , భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే ఇస్రో రూపొందించింది. దీనిని 2007 నాటికి రూపకల్పన చేసి అదే ఏడాది జనవరి 10న పీఎస్ఎల్వీ సీ7 ద్వారా కార్టోశాట్–2, 2008 ఏప్రిల్ 28న పీఎస్ఎల్వీ సీ9 ద్వారా కార్టోశాట్–2ఏ, 2010 జులై 12న పీఎస్ఎల్వీ సీ15 ద్వారా కార్టోశాట్–2బీ, 2016 జూన్ 22న పీఎస్ఎల్వీ సీ34 ద్వారా కార్టోశాట్–2సీని కక్ష్యలోకి పంపారు. ఈ 4 ఉపగ్రహాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. మరింత సమాచారాన్ని అందించేం దుకు బుధవారం 714 కిలోల బరువు ఉన్న కార్టోశాట్–2డీని పీఎస్ఎల్వీ సీ37 ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో పరిభ్రమిస్తూ భౌగోళిక పరమైన సమాచారాన్ని అందజేస్తుంది. అందులో అమర్చిన ఫ్రాంక్రో మాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుం ది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, తీర ప్రాంతాల నిర్వహణ, రహదా రుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయ డం, విపత్తుల విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధి తమై న సమాచారం దీని ద్వారా అందుబాటులోకి వస్తుంది. నిఘాలో తోడ్పాటుగా సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనికి రూ.350 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం. ఈ ఉపగ్రహం అయిదేళ్లపాటు సేవలు అందిస్తుంది. నానోశాటిలైట్స్ పనితీరు: ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ) ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగంలో కక్ష్యలోకి పంపారు. అహమ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ 2 చిన్న తరహా ఉపగ్ర హాలను తయారు చేసి ప్రయోగిస్తున్నారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్ట్రి బ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్సెట్ మానిటర్ పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఈ పేలోడ్ భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్ ఎనర్జీని మదింపు చేస్తుంది. ఇది 6 నెలలు మాత్రమే పని చేస్తుంది. డవ్ శాటిలైట్స్, లెమూర్ ఉపగ్రహాల పనితీరు అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహా లున్నాయి. ఇవి ప్రతిరోజూ వాణిజ్య, వాతావరణ సమాచారాన్నిస్తాయి. విదేశీ ఉపగ్రహాలు: నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబి–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్కు ఉపయోగించనున్నారు. -
సాహో.. ఇస్రో
ఒకేసారి 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్ ⇒ భారత పరిశోధనల్లో కీలకంగా మారనున్న కార్టోశాట్–2డీ ⇒ నమ్మకాన్ని వమ్ముచేయని పీఎస్ఎల్వీ–సీ37 ⇒ డబుల్ సెంచరీ దాటిన ఇస్రో ఉపగ్రహాలు ⇒ స్పేస్ లాంచ్ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యానికి భారత్ ప్రయత్నం ⇒ ఇస్రోతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ యవనికపై భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఒకే మిషన్ ద్వారా (ఒకేసారి) 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) దేశం మొత్తం గర్వపడేలా చేసింది. బుధవారం ఉదయం 9.28 గంటలకు 1378 కిలోలు బరువు కలిగిన 104 ఉపగ్రహాలను (పీఎస్ఎల్వీ సీ37 ద్వారా) రోదసీలోకి ప్రవేశపెట్టి అంతరిక్షంలో అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రయోగంలో 3 భారత ఉపగ్రహాలు, 101 విదేశీ నానో ఉపగ్రహాలున్నాయి. భారత వాతావరణ విభాగానికి సంబంధించిన కార్టోశాట్–2 భారత పరిశోధనల్లో కీలకం కానుంది. ఈ విజయంతో.. ఒకేసారి 37 ఉపగ్రహాలను పంపించిన రష్యా (2014లో) రికార్డును భారత్ తిరగరాసింది. నాసా 2013లో 29 ఉపగ్రహాలనే ప్రయోగించింది. విజయాల వేదిక శ్రీహరికోట శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఇస్రోకు అచ్చొచ్చిన పీఎస్ఎల్వీ–సీ37 ఉపగ్రహ వాహకనౌక.. 104 ఉపగ్రహాలను విజయవంతంగా మోసుకెళ్లి భూమికి 505 కిలోమీటర్లు నుంచి 524 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యాను వర్తన ధృవకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టింది. ప్రయో గం మొదలైన 28.42 నిమిషాల తర్వాత ఉపగ్రహా లన్నీ కక్ష్యలోకి ప్రవేశించాయి. అయితే.. అమెరికాకు సంబంధించిన ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరి అంటార్కిటికా గ్రౌండ్స్టేషన్కు (అమెరికా సెంటర్) సంకేతాలు అందించేందుకు మరో 3 నిమిషాలు పైగా సమయం పట్టింది. దీంతో మొత్తం ప్రయోగం పూర్తయ్యేందుకు 31.30 నిమిషాలు పట్టినట్లయింది. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీ, 8.4 కిలో బరువు కలిగిన ఇండియన్ నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ), 9.7 కిలోలు బరువు కలిగిన ఐఎన్ఎస్–1బీ అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు ఆఖరులో ప్రవేశపెట్టిన అమెరికాకు చెందిన 96 డవ్ శాటిలైట్స్, లెమూర్ శాటిలైట్స్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, కజికిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక్కో నానో ఉపగ్రహాలున్నాయి. ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు వివిధ రంగాల ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో డబుల్ సెంచరీ పీస్ఎల్వీ రాకెట్లు ద్వారా ఇప్పటివరకు ఇస్రో 226 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 179 విదేశాలకు చెందినవే కావటం విశేషం. ఇందులో 37 స్వదేశీ ఉపగ్రహాలు, పలు యూనివర్శిటీలకు చెందిన 8 ఉపగ్రహాలున్నాయి. ఈ కఠినమైన ప్రయోగం విజయవంతం కావటంతో వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో సామర్థ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. పీఎస్ఎల్వీ ద్వారా ‘స్పేస్ లాంచ్ మార్కెట్’లో ఏకఛత్రాధిపత్యం కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది. ప్రయోగం ఇలా.. పీఎస్ఎల్వీ–సీ37 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన 104 ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తునుంచి 525 కిలో మీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన «ధృవ కక్ష్యలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా వివిధ రకాల కక్ష్యలలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 44.4 మీటర్లు పొడవు కలిగిన పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో నింగికి దూసుకెళ్లింది. 28.42 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. భూమికి 510.383 కిలోమీటర్లు ఎత్తులోని ఎస్ఎస్వోలోకి ముందుగా 17.41 నిమిషాలకు 714 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–2డీను ముందుగా ప్రవేశపెట్టారు. ఆ తరువాత 17.58 నిమిషాలకు 510.590 కిలోమీటర్లు ఎత్తులో ఇస్రో నానోశాటిలైట్స్ ఉపగ్రహాన్ని, 17.59 నిమిషాలకు 510.601 కిలో మీటర్లు ఎత్తులో ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత 18.32 నిమిషాలకు 511.719 కిలోమీటర్లు ఎత్తులో మొదటి బాక్సులో అమర్చిన నానోశాటిలైట్స్‌ను, అనంతరం 28.42 నిమిషాలకు 524.075 కిలో మీటర్లు ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో చివరి బాక్సులో అమర్చిన మరో 50 నానోశాటిలైట్స్‌ను ప్రవేశపెట్టి తిరుగులేని, మరపురాని విజయాన్ని నమోదు చేశారు. బ్రాండ్ ‘ఇస్రో’ ఇప్పటి వరకు 39 సార్లు ఇస్రో ప్రయోగాలు చేయగా.. మొదటిది (విఫలమైంది) మినహా 38 సార్లూ భారత అంతరిక్ష సంస్థ వేసిన ప్రతి అడుగూ విజయమే. చంద్రయాన్ ఘనవిజయం తర్వాత ఇస్రో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలకు ఓ బ్రాండ్‌గా మారింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 16వ ప్రయోగం కావడం విశేషం. ఇస్రో 55 సంవత్సరాల సుదీర్ఘ అంతరిక్షయానంలో ఇదొక సువర్ణ మజిలీ. 2013లో ఆమెరికా అంతరిక్ష సంస్థ నాసా 29ఉపగ్రహాలను , 2014లో రష్యా అంతరిక్ష సంస్థ 39 ఉపగ్రహాలను ఒకేసారి పంపించి రికార్డులు సృష్టిస్తే ఇపుడు ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించి అంతరిక్షంలో సెంచరీని అధిగమించి వినువీధిలో భారత కీర్తిని ఇనుమడింపజేసింది. 2015 జూన్‌లో ఇస్రో 20 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపించిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం నాటి ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి వ్రవేశించిన వెంటనే కర్ణాటకలోని హాసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్, మారిషస్‌లోని గ్రౌండ్‌స్టేషన్ సిగ్నల్స్‌కు అందాయి. ఆ తర్వాతే ఉపగ్రహాలన్నీ సరిగానే ఉన్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో అమెరికాకు చెందిన 96 డవ్ అండ్ లెమూర్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ అందడానికి మరో మూడు నిమిషాలు అదనంగా తీసుకుని ఉపగ్రహాలు అంతరిక్షంలో బాగానే వున్నాయని అమెరికా గ్రౌండ్ స్టేషన్ తెలియజేసింది. శభాష్! అంతర్జాతీయ మీడియా ప్రశంసల జల్లు వాషింగ్టన్/లండన్: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహా లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై అంతర్జాతీ యంగా భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష పోటీలో భారత్ కీలక దేశంగా ఆవిర్భవించిందంటూ విదేశీ మీడియా కీర్తించింది. ‘తక్కువ ఖర్చుతో ప్రయోగాలను విజయవంతంగా చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం’ అని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. అంతరిక్ష ఆధారిత నిఘా, సమాచార వ్యవస్థల్లో వాణిజ్య మార్కెట్ పెరుగుతున్న తరుణంలో భారత్ ‘కీలక దేశం’గా తనను తాను నిరూపించుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం: ఇస్రో చైర్మన్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భవిష్యత్తులో సరికొత్తగా భారీ ప్రయోగాలు చేయాల్సి వుంటుందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. పీఎస్ఎల్–సీ37 ఘనవిజయం చరిత్రాత్మకమై నదని అభివర్ణించారు. బుధవారం ప్రయోగం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుం దన్నారు. ప్రయోగాన్ని విజయవంతం చేసినందు కు ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కిరణ్ కుమార్ అభినందనలు తెలిపారు. రాకెట్ శిఖరభాగంలో స్వదేశీ ఉపగ్రహాలైన కార్టోశాట్ –2డీ, ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహా లను ముందుగా కక్ష్యలోకి చేర్చామని.. మిగిలిన 101 విదేశీ ఉపగ్రహాలను 4 పెట్టెల్లాగా తయారు చేసి ఒక్కోపెట్టెలో 25 ఉపగ్రహాలను అమర్చి ఒక్కొక్క పెట్టెను నాలుగైదు సెకన్ల తేడాతో విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. సార్క్‌దేశాలకు అనుకూలంగా సార్క్‌శాట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక ఉందని చెప్పారు. ఏ దేశమైనా ముందుకొస్తే వాణిజ్య పరంగా వారి ఉపగ్రహాలను పంపేం దుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈఏడాది జీఎస్ఎ ల్వీ మార్క్–3 ద్వారా జీశాట్–19, జీఎస్ఎల్వీ–ఎఫ్09 ద్వారా జీశాట్– 9ను ప్రయో గించేందుకు సర్వం సిద్ధం చేశామ న్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చంద్ర యాన్–2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని, ఇందుకు సంబం «ధించిన అన్ని ఏర్పాట్లును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, వీఎస్ఎల్సీ డైరెక్టర్ డాక్టర్ కే శివన్, శాటిలైట్ డైరెక్టర్ ఎంఏ సదానందరావు, వెహికల్ డైరెక్టర్ బీ జయకుమార్ పాల్గొ న్నారు. పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగం విజయవంతం కావడం జాతికే గర్వకారణం. ఈ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన ఇస్రో.. భారత అంతరిక్ష పరిశోధనా సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. – ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి పీఎస్ఎల్వీ–సీ37 ద్వారా కార్టోశాట్‌తో పాటు 103 నానో ఉపగ్రహాలను ఒకే సారి నింగిలోకి పంపం డంలో విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్తలకు యావత్ దేశం నమస్కరిస్తోంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, దేశ ఖ్యాతిని, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించడం గర్వకారణం. – కేసీఆర్,రాష్ట్ర ముఖ్యమంత్రి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు. ప్రపంచంలోనే తొలిసారిగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అభినంద నీయం. ఇందుకోసం అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలను యువత ఆదర్శంగా తీసుకోవాలి. – చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయోగం విజయవంతం కావడం చరిత్రాత్మకం. ఈ ఘనతతో భారత దేశ కీర్తి పతాక విశ్వంలో రెపరెప లాడింది. ఇస్రో శాస్త్రజ్ఞులకు అభినం దనలు. భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రయోగాలు సంపూర్ణంగా విజయవంతం కావాలి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు