breaking news
Protocol violations
-
సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీజేఐ తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీసు కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్‌ని మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. సీఎస్, డీజీపీ, పోలీసు కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. ‘‘నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. సీజేఐ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సీఎస్, డీజీపీ ఆలోచించుకోవాలి. నేనేమీ ప్రొటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకోను. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రస్తావిస్తున్నా’’ అని వివరించారు. ‘‘ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142ను ప్రయోగించేవారు’’ అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారు.రాజ్యాంగమే అత్యున్నతం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అత్యున్నతమని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మాత్రం అది మార్చలేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం ఇదేనన్నారు. తాను వెలువరించిన 50 కీలక తీర్పులతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేరగాళ్ల ఇళ్లను కూల్చడం (బుల్డోజర్ న్యాయం) కూడదంటూ తానిచి్చన తీర్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆదిరెడ్డి ఆగ్రహం
రాజమండ్రి కార్పొరేషన్ : ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీనైన తనను కార్యక్రమానికి సరిగా ఆహ్వానించకపోవడంపై విద్యుత్ శాఖాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో తనను భాగస్వామిని చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరుకాకుండానే శంకుస్థాపన ప్రారంభించేశారు. విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. తాను రాకుండా సబ్‌స్టేషన్ శంకుస్థాపన ఎలా చేశారంటూ ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. తనకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ విద్యుత్ శాఖ అధికారులను నిలదీసి, అక్కడ బైఠాయించారు. వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీనైన తనను చిన్నచూపు చూడడం సబబుకాదంటూ దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తనకూ భాగస్వామ్యం ఉందని, ఇటువంటి చర్యలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మరోసారి పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణానికి కొబ్బరి కాయకొట్టి పనులు ప్రారంభించారు.