breaking news
Prof. Satish Dhawan
-
గఘన విజయం
సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు పీఎస్ఎల్వీ సీ23 నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంతో భారత కీర్తి పతాకం గగన తలంలో రెపరెపలాడింది. అలాగే ఇస్రో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. - వాణిజ్య విజయాల్లో అగ్రస్థానం - ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా గుర్తింపు సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(పీఎస్ఎల్వీ) కీలకపాత్ర పోషిస్తోంది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బహుళప్రయోజనకారిగా ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది. శ్రీహరికోట నుంచి సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ23తో ఈ సిరీస్‌లో 27 ప్రయోగాలు పూర్తయ్యాయి. షార్ నుంచి జరిగిన 43 ప్రయోగాల్లో 27 పీఎస్‌ఎల్‌వీయే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో.... వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ ద్వారా 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో ఎక్కువగా జర్మనీకి చెందిన టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు ఉన్నాయి. కెనడాకు చెందిన క్యాన్ఎక్స్-2, ఎన్ఎల్ఎస్-5, ఎన్ఎల్ఎస్-1, షఫ్పైర్, నియోశాట్, ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్-7.2, సింగపూర్‌కు చెందిన ఎక్స్‌శాట్, వెలాక్సీ, జపాన్‌కు చెందిన క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్, డెన్మార్స్కు చెందిన ఆయుశాట్-2, ఎన్ఎల్ఎస్8.3, ఆస్ట్రియా ఎన్ఎల్ఎస్8.1, ఎన్ఎల్ఎస్ 8.2, ప్రాన్స్‌కు చెందిన స్పాట్-06, స్పాట్-07, స్విట్జర్లాండ్‌కు చెందిన క్యూబ్‌శాట్-4,టీశాట్-1 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇదే జాబితాలో అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్-24, ఇటలీకి చెందిన అజిల్, సౌత్‌కొరియాకు చెందిన కిట్‌శాట్, అర్జెంటినాకు చెందిన ఫ్యూహెన్‌శాట్, ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సార్, లక్సెంబర్గ్‌కు చెందిన వెజల్‌శాట్, టర్కీకి చెందిన క్యూబ్‌శాట్-3, బెల్జియంకు చెందిన ప్రోబా,ఇండోనేషియాకు చెందిన లాపాన్-టబ్‌శాట్, నెదర్లాండ్స్‌కు చెందిన డెల్ఫీ-సీ3, యునెటైడ్ కింగ్డమ్కు చెందిన స్ట్రాడ్-1 ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రధాని పర్యటనలో పదనిసలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోటలోని షార్కు చేరుకున్నారు. పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం అనంతరం సోమవారం ఉదయం 10.45 గంటలకు ఆయన తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విశేషాలు.. - సూళ్లూరుపేట షార్కు విచ్చేసిన ఐదో ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రధాని షెడ్యూల్ సమయం కన్నా గంట ఆలస్యంగా షార్కు వచ్చారు. ఒకే హెలికాఫ్టర్‌లో వచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3.30 గంటలకు షార్కు వస్తారని మొదట ప్రకటించినా, 3 గంటలకే చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను కొద్దిసేపు గేట్‌వద్ద ఆపారు. జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవడంతో నేరుగా వెళ్లి స్వాగతం పలికారు. మిషన్‌కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోవడంతో దూరదూరంగా ఉంటూ కనిపించారు. ప్రధానమంత్రి కూడా చంద్రబాబును దగ్గరకు రమ్మని పిలిచిన సందర్భం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చంద్రబాబుని పట్టించుకోలేదు. భాస్కర గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నరేంద్ర మోడీకి రాష్ట్ర రాజధాని నిర్మాణం, రుణమాఫీ తదితర అంశాలపై చంద్రబాబు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు మౌనంగా కనిపించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సమయంలోనూ చంద్రబాబు ముఖంలో చిరునవ్వు కూడా కనిపించలేదు. మిషన్ కంట్రోల్ రూంలో మోడీ 26 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీఆకట్టుకుంది. షార్కు విచ్చేసిన ప్రధానమంత్రుల్లో ఇప్పటి వరకు ఎవరూ మోడీలా శాస్త్రసాంకేతిక రంగాలను ఔపోసన పట్టినట్లు సుదీర్ఘంగా ప్రసంగించకపోవడం గమనార్హం. ప్రధానికి గుజరాతీ వంటకాలతోనే రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సరైన భోజనం, తలదాచుకునేందుకు విశ్రాంతి భవనం లేకపోవడంతో పోలీసులు చెట్ల కిందే గడిపారు. -
43వ ప్రయోగం సక్సెస్
- ఇస్రో విజయపరంపర - భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సన్నాహాలు సూళ్లూరుపేట: అరుదైన విజయాలతో వినీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఇస్రో రెపరెపలాడిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ23 సక్సెస్‌తో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో తన ఐదు దశాబ్దాల ప్రస్థానంలో షార్ నుంచి చేపట్టిన 43 ప్రయోగాలతో 71 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ విజయాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఉంది. వీరిలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్‌ధవన్ కృషి కీలకమైనది. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం రావడానికి విక్రమ్ సారాభాయ్ బీజం వేస్తే, దీనిని అభివృద్ధి చేయడంలో సతీష్ ధవన్ కీలకపాత్ర పోషించారు. 1962 నుంచి 1978 వరకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసుకుంటున్న ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి 1975 మే 19న ప్రయోగించింది. 1979 జూన్ 7న భాస్కర్-1 అనే ఉపగ్రహాన్ని కూడా రష్యానుంచే ప్రయోగించింది. ఈ లోపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వీ-3 ఇ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఈ అపజయంతో కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మన శాస్త్రవేత్తలు. 1980 జూలై 18న ఎస్ఎల్వీ-3 ఇ2 పేరుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో నూతనోత్సాహంతో ముందుకు సాగారు. అక్కడినుంచి ఎస్ఎల్వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు చేసి మూడింటిని విజయవంతం చేశారు. 1987 మార్చి 24 ఏఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్ లో నాలుగు ప్రయోగాలు చేసి రెండు విజ యం సాధించగా, రెండు ఫెయిల య్యాయి. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లలో చిన్న తరహా ఉపగ్రహాలను పంపారు. 1993 సెప్టెంబర్ 20న పీఎస్ఎల్వీ లాంటి భారీరాకెట్ ప్రయోగాలకు నడుం బిగించారు. ఇందులో ఇప్పటిదాకా 27 ప్రయోగాలు చేయగా మొదట చేసిన ప్రయోగం తప్ప మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపట్టారు. జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఎనిమిది ప్రయోగాలు చేయగా మూడు విఫలమయ్యాయి. షార్ నుంచి ఇప్పటివరకు మొత్తం 43 ప్రయోగాలు చేయగా ఏడు తప్ప మిగిలినవన్నీ విజయవంతమై అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో భారత్‌ను ఐదో స్థానంలో నిలిపాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజనిక్ దశను రష్యా సాంకేతిక సహకారం తీసుకుని ప్రయోగించేవారు. ఈ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకునే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగ విజయంతో సాంకేతిక నైపుణ్యం సాధించి మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తులో పీఎస్ఎల్వీ రాకెట్‌ను వాప్యారాభివృద్దికి వాడుకుంటూ జీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.