రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చాపాడు: ప్రొద్దుటూరు–మైదుకూరు హైవే రోడ్డుపై గోడేరు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేతవరం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన నివాసం ఉంటున్న రైతు పందిటి ఏసన్న (66) రోజూ మాదిరిగానే రాత్రి 10 గంటలకు గోడేరు వద్దనున్న పొలం వద్దకు సాగునీరు పెట్టేందుకు వెళ్లాడు. పని ముగించుకుని 12 గంటల సమయంలో తన మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళ్లే వాహనదారులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు ఢీకొని ఉంటుందని, అక్కడ ఉన్న పలు సామగ్రిని బట్టి గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. ఏసన్నకు భార్యతోపాటు కుమారుడు పీటర్, కుమార్తె సౌజన్య ఉన్నారు.