breaking news
Prescribe
-
Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకు సంజీవని ఔషధం ఇదేనంటూ తమ మాత్రను సూచించాలంటూ డోలో–650 ఎం.జీ. ట్యాబ్లెట్ల తయారీసంస్థ దేశవ్యాప్తంగా వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎం.జీ ఉత్పత్తిదారుల ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ సంస్థ ఔషధాలు రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. ఈ మేరకు సంస్థ తరఫు లాయర్లు సంజయ్ పారిఖ్, అపర్ణా భట్లు గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘ట్యాబ్లెట్ల 500 ఎం.జీ. పరిమాణం వరకు మార్కెట్ ధర నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకుమించిన ఎం.జీ అయితే ఆ ట్యాబ్లెట్ల తయారీదారుల ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారు. దీంతో అధిక లాభాలను మూటకట్టుకునేందుకు 650 ఎం.జీ డోస్ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారు’ అని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ డోస్ కాంబినేషన్ నిర్హేతుకమైనదని వాదించారు. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తూ పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. కోడ్ ఉన్నప్పటికీ దానికి స్వచ్ఛంద హోదా లేదా చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చట్టాలు రూపొందించాలని పార్లమెంటును ఆదేశించలేమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కోడ్‌కు చట్టబద్ధత వచ్చే వరకు ఔషధ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడానికి కోర్టు మార్గనిర్దేశనం చేయాలని పారిఖ్ కోరారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు పెరిగాయన్నారు. ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించిన ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని ధర్మాసనానికి తెలిపారు. ఫార్మా స్యూటికల్ రంగంలోని అవినీతి.. రోగుల ఆరోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపే ఘటనలు కోకొల్లలు ఉన్నాయని ఉదహరించారు. చదవండి: అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఇది తీవ్రమైన సమస్యే ఎఫ్ఎంఆర్ఏఐ లేవనెత్తిన అంశంపై జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించారు. ‘తనకు కోవిడ్ సోకినప్పుడు ఇదే సందర్భం ఎదురైంది. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పది రోజుల్లో స్పందన తెలపాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్‌ను కోర్టు ఆదేశించింది. తదనంతరం వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలన్న లాయర్ పారిఖ్‌కు సూచించింది. ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. మైక్రోల్యాబ్స్‌పై దాడులు కోవిడ్ కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన డోలో–650 ఎం.జీ ట్యాబ్లెట్ల తయారీదారు అయిన మైక్రో ల్యాబ్స్ సంబంధ కార్యాలయాల్లో ఇటీవల సీబీడీటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించారు. వైద్యులకు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు గుర్తించారు. -
జనరిక్ మందులనే వైద్యులు సూచించాలి
సాక్షి, హైదరాబాద్: తమ వద్దకు వచ్చే రోగులకు ప్రతి ఒక్క వైద్యుడు విధిగా జనరిక్ ఔషధాలనే రాసేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) సూచించింది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. కమిటీ సమావేశం శుక్రవారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పి. విష్ణుకుమార్‌రాజు, గద్దె రామ్మోహన్‌లతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. జనరిక్ మందులు ప్రజలకు తక్కువ ధరలకు లభ్యమౌతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల దృష్ట్యా వైద్యులు ఆ మందులనే రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాము రాసే మందుల పేర్లు రోగులకు సులభంగా అర్థమయ్యేలా వైద్యులు చూడాలని చెప్పారు. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకోవాలని స్పష్టం చేశారు. మానసిక రోగులకు చికిత్సకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను విజయనగరం జిల్లాలో నిర్ధేశించిన గడువులోగా ఖర్చు చేయకపోవటంతో ఆ తరువాత నిధులను కేంద్రం విడుదల చేయకపోవటాన్ని గుర్తించిన పీఏసీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలులో జరిగిన జాప్యం పట్ల పీఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.