breaking news
prepaid mobile
-
కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు షురూ
జమ్మూ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలనూ పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్లపై 2జీ ఇంటర్నెట్ సేవలను కశ్మీర్‌లోని బండిపోరా, కుప్వారా జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతోపాటు కొన్ని పరిమితులతో సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే కంపెనీలకు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ పొందే అవకాశాన్ని కల్పించినట్లు జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు. ‘ ఆంక్షల పాక్షిక సడలింపు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని టెలికం సంస్థలకు సూచించాం. అన్ని భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పాం’ అని ఆయన అన్నారు. ఈ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు టెలికం సంస్థలు వినియోగదారుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి జమ్మూ కశ్మీర్లో టెలికామ్ సేవలను ఆపేయగా.. సుప్రీంకోర్టు వారం క్రితం వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తాజాగా ఆంక్షల తగ్గింపు మొదలైంది. ‘శనివారం నుంచి వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ మొత్తమ్మీద ప్రీపెయిడ్ సిమ్‌కార్డుల్లో ఇకపై ఈ సేవలు అందుబాటులోకొస్తాయి’ అని రోహిత్ వివరించారు. -
బీఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీడమ్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్ఎన్ఎల్’ తాజాగా తన ప్రి-పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ‘ఫ్రీడమ్ ప్లాన్’ను ఆవిష్కరించింది. ప్లాన్ ధర రూ.136గా, వాలిడిటీ 730 రోజలుగా ఉంది. యూజర్లు ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్/ఎస్టీడీ కాల్స్‌ను హోమ్/రోమింగ్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా తొలి నెల రోజులపాటు నిమిషానికి కేవలం 25 పైసలతో కాల్ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. దీంతోపాటు 1 జీబీ వరకు డేటాను ఉచితంగా పొందొచ్చని (నెల రోజుల వాలిడిటీ) పేర్కొంది. నెల రోజుల తర్వాత కాల్ చార్జీలు సెకన్‌కు 1.3 పైసలుగా ఉంటాయని వివరించింది. ఫ్రీడమ్ ప్లాన్‌ను ఎంచుకున్న కస్టమర్లకు రూ.577, రూ.377, రూ.178 ధరల్లో మూడు రకాల ప్రత్యేకమైన టాప్-అప్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంటే రూ.577తో రీచార్జ్ చేసుకుంటే కస్టమర్‌కు రూ.577 పూర్తి టాక్‌టైమ్‌తోపాటు 1 జీబీ డేటా (నెల రోజుల వాలిడిటీ) వస్తుంది. అదే రూ.377తో రీచార్జ్‌తో చేసుకుంటే 300 ఎంబీ (20 రోజుల వాలిడిటీ), రూ.178తో రీచార్జ్ చేసుకుంటే 200 ఎంబీ డేటా (10 రోజలు వాలిడిటీ) వస్తుంది.