breaking news
Prakasam akshara vijayam
-
9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపు
ఒంగోలు టౌన్ : ప్రకాశం అక్షర విజయం ద్వారా జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని 9 నెలల్లో 25 శాతం పెంచినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా అక్షరాస్యతలో 16వ స్థానంలో ఉండగా, విభజన అనంతరం 13 జిల్లాల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. స్వల్ప కాలంలో అధిక అక్షరాస్యత సాధించిన జిల్లాగా ప్రకాశం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో దీనిని అధ్యయనం చేసేందుకు ముంబైలోని ఎస్ఎన్డీటీ మహిళా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ సోమవారం ఒంగోలు వచ్చారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంపై స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ ఆమెకు వివరించారు. అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో రెండు దశల్లో అమలు చేసినట్లు చెప్పారు. మొదటి దశలో 20 వేల 867 కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల 56 వేల 452 మందిని అక్షరాస్యులను చేయగా, రెండో దశలో 14 వేల 483 కేంద్రాలను ప్రారంభించి లక్షా 93 వేల 570 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినట్లు వివరించారు. రెండు దశల్లో అక్షరాస్యత 78 శాతం సాధించినట్లు తెలిపారు. అన్ని స్థాయిల్లో అధికారులను భాగస్వాములుగా చేర్చి అందరికీ బాధ్యతలు అప్పగించడం వల్ల సమష్టిగా విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 20 వేల మంది వరకు అధికారులు, సిబ్బంది ఎలాంటి నగదు తీసుకోకుండా స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు తెలిపారు. ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్ ప్రకాశం అక్షర విజయం ద్వారా అక్షరాస్యతలో సాధించిన పురోభివృద్ధిపై ముంబై నుంచి వచ్చిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ ఆశ్యర్యపోయారు. ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారి వరకు అకుంఠిత దీక్షతో ముందుకు సాగడంపై ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అంతటితో ఆగకుండా ఫలితాల సాధనకు జిల్లా స్థాయి అధికారులు తీసుకున్న చర్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ వీరభద్రయ్య, డ్వామా పీడీ పోలప్ప, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ భాస్కరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కమల, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, కార్మిక శాఖ డీసీఎల్ అఖిల్, ఒంగోలు డీఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు. -
అక్షరాస్యత కేంద్రాలన్నింటినీ ప్రారంభించండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 10 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు 34 వేల కేంద్రాల్లో అక్షర విజయం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కొన్ని మండలాల్లో 50 శాతానికి మించి కేంద్రాలు ప్రారంభం కాలేదని కలెక్టర్ విజయకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీలోపు అన్ని గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభించి మొదటిపాఠం పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్లతో స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని అంకితభావంతో నిర్వహించాలన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్లతోపాటు వారి పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఇతర పనులు పక్కనపెట్టి రానున్న రెండురోజులు గ్రామాల్లో బసచేయాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరించి కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదట చదువురాని వారిని గుర్తించి వారికి సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలన్నారు. చదువురానివారి సంఖ్య తెలిస్తేనే వలంటీర్ల లెక్క తేలుతుందన్నారు. వలంటీర్ల కష్టం వృథాగా పోదు... ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో పాలుపంచుకునే వలంటీర్ల నియామకంలో ఇందిరాక్రాంతి పథంలోని పొదుపు సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వలంటీర్ల కష్టం వృథాగాపోదన్నారు. వారి అర్హతలు, ఆసక్తిని బట్టి రానున్న రోజుల్లో స్వయం ఉపాధి పథకాలు, రాజీవ్ యువకిరణాల లబ్ధిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. వలంటీర్ల శిక్షణ, అవగాహన కార్యక్రమాలన్నింటినీ గ్రామస్థాయిలోనే నిర్వహించాలన్నారు. ప్రతి సోమవారం గ్రామ పంచాయతీ స్థాయిలో అక్షరాస్యత కేంద్రాల వలంటీర్లు, పర్యవేక్షణ అధికారులతో మండలస్థాయి అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏమైనా లోటుపాట్లుంటే సరిచేయాలని సూచించారు. ప్రతి మంగళవారం మండలస్థాయి సమావేశాలు నిర్వహించాలని, బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గస్థాయి కో ఆర్డినేటింగ్ ఆపీసర్లతో కూడిన సమన్వయ కమిటీలు సమావేశమై కార్యక్రమాన్ని సమీక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమం అమలు, పర్యవేక్షణ, మూల్యాంకన కచ్చితంగా జరిగినప్పుడే విజయవంతం అవుతుందన్నారు. పలకలు, బలపాలు, పుస్తకాల పంపిణీకి చర్యలు... అక్షరాస్యత కేంద్రాలకు అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పలకలు, బలపాల కోసం గ్రా మాల్లోని పెద్దలు, దాతల సహకారం తీ సుకోవాలన్నారు. వయోజన విద్యాశాఖ ద్వారా లక్ష పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని, మరో లక్ష పుస్తకాలు కూడా ఇస్తామని చెప్పారు. బ్లాక్ బోర్డు, చాక్‌పీసుల కొనుగోలుకు మండల పరిషత్ సాధారణ నిధులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నెలాఖరులోపు పచ్చతోరణం మొక్కలు నాటాలి... ఇందిరమ్మ పచ్చతోరణం పథకం కింద జిల్లాలోని 7,200 ఎకరాల్లో నెలాఖరులోపు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 2 లక్షల 4 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ప్రస్తుతం 51 వేలు నిర్మాణంలో ఉన్నాయని, 13 వేలు పూర్తయ్యాయని వివరించారు. లక్షాల మేరకు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.