breaking news
prajadarbar programms
-
ప్రజాదర్బార్‌లో మంత్రి బాలినేనికి విన్నపాలు
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నివాసం ప్రజాదర్బార్ నిర్వహించారు. వీఐపీ రోడ్డు కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు సమర్పించారు. వాటిలో చేయదగిన పనులకు సంబంధించి అధికారులలో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. ఆంధ్రాబ్యాంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డీజీఎం పి.రామకృష్ణారావు, బ్యాంకు జోనల్ అధికారులు బాలినేనిని కలిసి అభినందించారు. ఏజీఎంలు పి.కృష్ణయ్య, ఎన్.గణేష్, చంద్రారెడ్డి, మెయిన్ బ్రాంచి ఏజీఎం, జోనల్ కార్యాలయం అధికారులు, మేనేజర్ పీకే రాజేశ్వరరావు తదితరులు బాలినేనిని కలిసిన వారిలో ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి బాలినేని పరామర్శించారు. అంజలి గ్రానైట్స్ అధినేత చల్లా శ్రీనివాసరావు తండ్రి చల్లా వెంకటస్వామి చికిత్స పొందుతుండంతో ఆయన్ను సంఘమిత్రలో పరామర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో 25 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్న పిల్లుట్ల సుబ్రహ్మణ్యం దేవాలయం గాలిగోపురం కోసం కంచికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన సంఘమిత్రలో చికిత్స పొందుతున్నారు. మంత్రి బాలినేని పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాలినేని స్వగ్రామం కొణిజేడులో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలువురు బాలినేనిని కలిసి అభినందించారు. ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాల గురించి సంభందిత అధికారులతో బాలినేని చర్చించారు. -
నేటి నుంచి యథావిధిగా ‘డయల్ యువర్ కలెక్టర్’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు సోమవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల సమయం కావడంతో జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించలేకపోయింది. అయితే ఈనెల 2వ తేదీ నుంచి డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్లు యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామని, ఫోన్ ద్వారా నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. 08518-277100 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే కలెక్టర్ వెంటనే స్పందిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజాదర్బార్ కూడా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.