breaking news
Pradipcandra
-
పీఆర్సీపై అడుగు ముందుకు
ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో హై పవర్ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో చైర్మన్‌గా ప్రదీప్‌చంద్రతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, సర్వీసెస్ కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది మే 29వ తేదీన పదో పీఆర్సీ కమిషనర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ తమ నివేదికను గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. రాష్ట్ర విభజన తరువాత గవర్నర్ ఆ నివేదికను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదికలోని సిఫారసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పీఆర్సీ నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతోపాటు ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, నివేదికలో పరిశీలించిన అంశాలతోపాటు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు, వారి డిమాండ్లతో కూడిన నివేదికను త్వరగా అందజేయాలని పేర్కొన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావులతో సమీక్ష నిర్వహించారు. ఎంత ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకే ఈ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చెప్పారని తెలుస్తోంది. కాగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు పట్ల ఉద్యోగ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువ ఫిట్‌మెంట్‌కు ఉద్యోగుల పట్టు పీఆర్సీలో 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వీలైన ప్రతి సందర్భంలో ఆ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. నగదు రూపంలో వర్తింపును కూడా 2013 జూలై 1 నుంచే ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే ఈ రెండు ప్రధాన విషయాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అధికారుల కమిటీతో ఈ అంశాలు తేలడం సాధ్యం కాదని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి. పైగా కపుడునిండా పీఆర్సీ ఇస్తానని.. ఈనెల మూడో వారంలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తమను ముఖ్యమంత్రే చర్చలకు పిలుస్తారని భావించారు. పీఆర్సీ కమిషనర్ 29 శాతం ఫిట్‌మెంట్‌నే సిఫారసు చేసినా, తాము సీఎం వద్ద పట్టుబట్టి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం ఫిట్మెంట్ పొందాలని భావించారు. ప్రస్తుతం కమిటీ స్థాయిలో చర్చల తరువాతే సీఎంతో చివరగా చర్చలు జరుగనున్నాయి. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
సంస్థ పేరు నిలబెట్టాలి హెచ్ఎండీఏ అధికారులకు ఇన్చార్జి కమిషనర్ సూచన ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్‌చంద్ర సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు అతిక్రమించకుండా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్ ప్రదీప్‌చంద్ర అధికారులకు సూచించారు. శనివారం ఆయన హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో కొత్తగా లక్ష్యాలుంటాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలకు నేరుగా సేవలందించాలన్నది కొత్త ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దని, తనను తప్పుదారి పట్టించొద్దని చెప్పారు. పనుల కోసం హెచ్ఎండీఏకు వచ్చిన వారంతా సంతోషంగా తిరిగి వెళ్లే విధంగా పరిస్థితులను కల్పించాలన్నారు. పరిపాలనాపరంగా ఏవైనా అనుమానాలుంటే వెంటనే సచివాలయానికి రావాలని, అవసరమైతే తానే తార్నాకకు వ చ్చి రెండు, మూడు గంటలు అదనంగా పనిచేస్తానని తెలిపారు. ఆయా విభాగాల పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ బడ్జెట్, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. ఐటీ బకాయిల కింద తక్షణం రూ.500 కోట్లు చెల్లించాల్సి విషయాన్ని ఈ సందర్భంగా సీఏఓ ఆయనకు వివరించారు. సంస్థకు నెలవారీ ఆదాయం, రుణాలకు చెల్లించే వడ్డీలు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల జాబితాను ఇన్చార్జి కమిషనర్‌కు అందించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. భూ సేకరణలో కోర్టు కేసులు తదితర సమస్యల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిన విషయాన్ని ఓఆర్ఆర్ అధికారులు ప్రదీప్‌చంద్రకు వివరించారు. ప్రధానంగా ప్లానింగ్ విభాగంలో ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా సోమవారం సమీక్ష జరుపుతానని ఇన్చార్జి కమిషనర్ ప్రదీప్‌చంద్ర తెలిపారు. హెచ్ఎండీఏకు వీడిన గ్రహణం కమిషనర్ నీరభ్‌కుమార్ బదిలీ కావడంతో హెచ్ఎండీఏకు గ్రహణం వీడింద ని, సంస్థకు మంచిరోజులు వచ్చినట్లేనని ఆ సంస్థ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి, ఆ మొత్తాన్ని చెల్లించాకే ఫైళ్లు పరుగెత్తించడం హెచ్ఎండీఏలో ప్రత్యేకత. కిందిస్థాయి సిబ్బంది ఏదైనా పొరపాటు చేస్తే... ఉన్నతాధికారి చర్య లు తీసుకొంటారు. అయితే... మహానగరాభివృద్ధి సంస్థలో మాత్రం కంచే చేను మేస్తుండటంతో రెండేళ్లుగా ఈ సంస్థ అక్రమాలు పుట్టగా మారిందన్న ఆపకీర్తిని మూటగట్టుకొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి బంధువు లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోగా అప్రూవల్ కోసం ఉన్నతాధికారి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, దీంతో ఆగ్రహించిన ఆ మంత్రి పట్టుబట్టి బదిలీ చేయించారని ప్రచారం జరిగింది. ఇటీవల అప్రెడా సమావేశంలో సదరు ఉన్నతాధికారిపై భారీగా ఫిర్యాదులందాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా సీఎం సలహాదారు ఒకరు కల్పించుకొని బదిలీని వాయిదా వేయించినట్టు సమాచారం. అయినా... సదరు ఉన్నతాధికారి వ్యవహార తీరులో మార్పు రాకపోగా... ఎలాగూ బదిలీ తప్పదన్న ఉద్దేశంతో వసూళ్ల పరంపరను కొనసాగించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో రెండ్రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారిపై పలువురు పారిశ్రామిక వేత్తలు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కేసీఆర్ అక్కడి నుంచే సీఎస్‌ను ఆదేశించి నీరభ్కుమార్పై వేటు వేయించిన విషయం తెల్సిందే.