breaking news
Prabhakar Chowdary |
-
గెటవుట్.. జేసీ దివాకర్‌రెడ్డి చిందులు
సాక్షి, అనంతపురం: బెదిరింపు రాజకీయాలతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రోజంతా పొలిటికల్ డ్రామాను రక్తి కట్టించారు. తనకు అలవాటైన విద్యను ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్‌లో మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ రచ్చ కెక్కారు. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చారు. పార్టీ విప్ జారీ చేసినా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లబోనంటూ నిన్నటి నుంచి ఊదరగొట్టారు. కానీ ఈరోజు సాయంత్రానికి ప్లేటు ఫిరాయించారు. రేపు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని, అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని ముక్తాయించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం లేదని చిర్రుబుర్రులాడారు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఓ మీడియా ప్రతినిధిని ‘గేటవుట్’ అంటూ కసిరారు. పనిలో పనిగా మరో ‘డ్రామా’కు తెరతీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాజీనామాపై తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. రోజంతా రాజకీయ డ్రామా... రెండో రోజూ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలిలో నాటకాన్ని రక్తి కట్టించారు. టీడీపీలో తన మాట చెల్లుబాటు కానందున పార్లమెంట్‌కు హాజరుకాబోనని లీకులు వదిలారు. సొంత పార్టీలో తన ప్రత్యర్థి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకు ఈ సందర్భాన్ని బాగా వాడుకున్నారు. జేసీని బుజ్జగించేందుకు ప్రభాకర్ చౌదరిని తన దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. వీరిద్దరి సమావేశం ముగియగానే జేసీ పట్టుసడలించారు. మరోవైపు అనంతపురంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై విడుదల చేయడంతో జేసీ పూర్తిగా దిగివచ్చారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడంతో రేపు పార్లమెంట్‌కు హాజరవుతానని ప్రకటించారు. అయితే రాజీనామా అస్త్రంతో రాజకీయ డ్రామాను ఆయన కొనసాగించడం కొసమెరుపు. -
'క్షమాపణ చెప్పాకే అనంతలో అడుగుపెట్టాలి'
అనంతపురం: రాష్ట్ర విభజనపై క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జిల్లాలో అడుగుపెట్టాలని అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కబ్జాలకు పాల్పడితే టీడీపీ నేతలను కూడా ఉపేక్షించమన్నారు. గోదావరి పుష్కరాలు బాగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారని తెలిపారు. పుష్కరాల విశిష్టతను చాటి చెప్పేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్‌లో తొక్కిసలాట సందర్భంగా మృతి చెందిన వారి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాహుల్ గాంధీ జులై 24వ తేదీన అనంతపురం జిల్లాలోని మడకశిర, ఓబులదేవరచెరువుల్లో పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. అదికాక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తున్న సంగతి తెలిసిందే.