breaking news
Potti Veeraiah
-
పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం
ఒకప్పుడు యాంకర్‌గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రముఖ యాంకర్ ఉదయభాను. ఇక సినిమాల్లో సైతం పలు పాత్రల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారామె. తన గలగల మాటలతో ప్రేక్షకదారణ పొందిన ఆమె అప్పట్లో యాంకర్‌గా బుల్లితెరను ఏలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచిన ఆమె ఆ తర్వాత యాంకరింగ్‌కు, నటనకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం కొంతకాలానికి ఓ ఛానల్లో ప్రసారమైన పిల్లలు పిడుగులు అనే షో ద్వారా ఉదయభాను మళ్లీ యాంకర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్లారు. ఇక ఈ షోను నుంచి కూడా తప్పుకున్న ఆమె అప్పటి నుంచి బుల్లితెరపై కనిపించడం తగ్గించారు. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్న అఘాయిత్యాలపై అప్పడప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఉదయభాను ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంతో మరోసారి తెరపైకి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పొట్టి వీరయ్య నిన్న(ఆదివారం) గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఉదయభాను కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్‌తో అందరినీ కంటతడి పెట్టించారు.‘వీరయ్య అంకుల్ మరణవార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజమని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్. ఓ మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద అయిన కొంచెం దయచూపు’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత -
Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య(74) తనువు చాలించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరయ్య తుదిశ్వాస విడిచాడని వైద్యులు వెల్లడించారు. వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. హైస్కూల్లో ఉన్నప్పుడే నాటకాల్లో పాత్రలు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. సినిమాల్లోకి రావడానికి ముందు ఫ్లవర్ డెకరేషన్ షాపులో పని చేశాడు. ఒకసారి శోభన్‌బాబు కనిపిస్తే సినిమా అవకాశం కావాలని అర్థించాడు.ఆయన వెంటనే విఠలాచార్య, భావనారాయణ తప్ప ఎవరూ ఉపాధి కల్పించలేరని, వెంటనే వాళ్లకు కనిపించమని గోల్డెన్ సలహా ఇచ్చాడు. దీంతో జానపద దర్శకుడు విఠలాచార్య, నిర్మాత రామస్వామిగార్లను కలిశాడు. అలా కాంతారావు, భారతి హీరోహీరోయిన్లుగా నటించిన 'అగ్గిదొర' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. తాతామనవడు, రాధమ్మ పెళ్లి, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించాడు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ వరుణ్ ధావన్‌కి కరోనా పాజిటివ్.. జుగ్ జుగ్.. చిన్న బ్రేక్! -
కృష్ణగారు నాకోసమే రెండురోజులు షూటింగ్ ఆపేశారు!
వీరయ్య ఎత్తు రెండడుగులకు కాస్త తక్కువ. ఆ ఎత్తుతోనే.. చరిత్ర సృష్టించాడాయన. శారీరక లోపాలు ఉన్నవాళ్లే కాదు... ఏ లోపాలూ లేనివారు కూడా వీరయ్యను చూసి నేర్చుకోవాల్సిందే. ‘స్ఫూర్తిప్రదాత’ అనే పదానికి రెండడుగుల నిదర్శనం ఆయన. ముల్లోకాలనీ మూడడుగులతో కొలిచి వామనుడు త్రివిక్రముడయ్యాడు. రెండడుగుల ఎత్తుతో 46ఏళ్ల నుంచీ సినీ నటప్రస్థానం సాగిస్తూ.. వీరయ్య విజేతయ్యాడు. చూపులకు మరుగుజ్జే అయినా... వ్యక్తిత్వం పరంగా ఆయన ఎత్తు ఆకాశమంత. పొట్టివీరయ్య జీవితంలోని ఎత్తుపల్లాలు తెలుసుకోవాలనుందా? అయితే... ఇక చదవండి. ఇంటర్వ్యూ పనిమీద వీరయ్య ఇంటికెళ్లినప్పుడు... పసిపిల్లలు నడిపే.. మూడు చక్రాల బండిని ఆధారంగా చేసుకొని... నడుస్తూ కనిపించాడాయన. ఆ పరిస్థితుల్లో ఆయన్ను చూడగానే... గుండె బరువెక్కింది. కానీ.. ఆయనతో కాసేపు మాట్లాడి బయటకొచ్చాక... సమాజాన్ని చూస్తే జాలేసింది. ఎవడి జీవితానికి వాడే హీరో అనిపించింది. ఇక ఇంటర్వ్యూలోకెళ్దాం. నమస్తే వీరయ్యగారూ...? బావున్నారా? నమస్తే.. సార్. గత ఏడాది పెద్ద పేగు ఆపరేషన్ జరిగింది. దాంతో నడవడానికి ఇబ్బందిగా ఉంది. అంతేతప్ప మిగిలిన విషయాల్లో బాగానే ఉన్నాను. మాయద్వీపం, అక్షయపాత్ర లాంటి టీవీ కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నా. మీ ఇంట్లో మీరు ఎవరు పోలిక? మా ఇంట్లో ఇలా పుట్టింది నేనొక్కడ్నే. మా అమ్మ పేరు గట్టు నరసమ్మ. నాన్న పేరు గట్టు సింహాద్రయ్య. వాళ్లకు నేను రెండో సంతానం. ఫస్ట్ మా అక్క పుట్టింది. తర్వాత నేను. పొత్తిళ్లలో నన్ను చూసి ఇలాంటి బిడ్డ పుట్టాడేంటని అమ్మానాన్నా చాలా బాధపడ్డారట. మరి మిమ్మల్ని బాగా చూసుకున్నారా? కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే... మా చిన్న అమ్మమ్మ మాత్రం చాలా దారుణంగా మాట్లాడేది. ‘చీపురుకట్టంతలేవు... దేనికి పనికొస్తావురా నువ్వు... నీకు తిండికూడా దండగే’ అనేది. అయితే... మా తాతయ్య మాత్రం ఎలా వుంటేనేం మగపిల్లాడు అంటూ అక్కున చేర్చుకునేవాడు. సమాజం ఎలా చూసేది? చిన్న పిల్లలే నాకు విలన్లు. వీధిలో నడుస్తుంటే... డిప్పకాయ్ కొట్టి పరిగెత్తేవాళ్ళు. కొంతమందైతే... రాళ్లతో కొట్టేవారు. పరిగెత్తుకెళ్లి వాళ్లను పట్టుకొని కొట్టాలనిపించేది. కానీ పరిగెత్తలేను. అందుకే బాధనంతా దిగమింగుకునేవాణ్ణి. నేను ఎస్.ఎస్.సి తప్పాను. ఉద్యోగం కోసం ట్రై చేశాను. అన్నీ ఓకే. కానీ కేవలం నా హైట్ చూసి నన్ను పక్కన పెట్టేశారు. అప్పుడే నాలో కసి మొదలైంది. ఏదైనా సాధించాలనే పట్టుదల నాలో పెరిగింది. నన్ను సినిమాలవైపు నడిపించింది ఆ పట్టుదలే. అసలు ఇండస్ట్రీలోకి ఎలా ఎంటరయ్యారు? మాది నల్గొండ జిల్లా సూర్యపేట తాలూకా పనిగిరి గ్రామం. మా ఊళ్లో మంగళ్గోపాల్ అని ఓ పెద్దాయన ఉండేవారు. పెళ్లిళ్లకు సినీ డెకరేషన్ చేయడం ఆయన వృత్తి. ఆయన ద్వారా 1967లో మద్రాసులో అడుగుపెట్టాను. అక్కడ ఓ ఫ్లవర్ షాప్‌లో నన్ను చేర్పించారాయన. ఆయన ద్వారానే శోభన్‌బాబుగారిని కలిశాను. ఆయన నన్ను తేరిపార చూసి, విఠలాచార్యగారిని కానీ, భావన్నారాయణగారిని కానీ కలవండి. మీలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చేది వాళ్లే అని సలహా ఇచ్చారు. ఆయన మాట ప్రకారం భావన్నారాయణగారిని కలిశాను. ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత విఠలాచార్యగారిని కలిశాను. ఫస్ట్‌లుక్‌లోనే ఆయనకు నేను బాగా నచ్చేశా. ‘మరి నాతో పని అంటే.. గుర్రాలు నడపాలి, ఎత్తు నుంచి దూకాలి, రిస్కీ ఫీట్స్ చేయాలి.. చేస్తావా’ అనడిగారు. ‘ఓ... చేస్తాను’ అని చెప్పాను. నా ధైర్యాన్ని చూసి వెంటనే అవకాశం ఇచ్చేశారాయన. వెయ్యి రూపాయలు అడ్వాన్సు కూడా ఇచ్చేశారు. ఆ సినిమానే ‘అగ్గివీరుడు’. ఆ సినిమా తర్వాత విఠలాచార్యగారి దాదాపు అన్ని సినిమాల్లోనూ నేను నటించాను. పరిశ్రమలో విఠలాచార్య తర్వాత నన్ను బాగా ప్రోత్సహించిన దర్శకుడు దాసరి నారాయణరావుగారు. ఆయన తొలి సినిమా ‘తాతామనవడు’లో గుమ్మడి కాంబినేషన్లో నటించాను. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘రాధమ్మపెళ్లి’ చిత్రంలో హిజ్రాగా నటించాను. నా కెరీర్లో మరచిపోలేని పాత్ర అది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించాను. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ లాంటి మహానటులతో కలిసి పనిచేశాను. కృష్ణగారైతే.. ఆయన 300వ చిత్రం ‘తెలుగువీర లేవరా’ సినిమా షూటింగ్‌ని కేవలం నాకోసమే రెండ్రోజులు ఆపారంటే... నాపై వారు ఎంత అభిమానాన్ని చూపించేవారో అర్థం చేసుకోండి. పరిశ్రమలో మీకు తగు గౌరవం లభించేదేనా? గుండెలపై చేయి వేసుకొని చెబుతున్నా. పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా సాకింది. హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు, హీరోయిన్లకు మాత్రమే లొకేషన్లో సపరేట్ చైర్ ఉంటుంది. కానీ... నేను విరివిగా సినిమాలు చేస్తున్న టైమ్‌లో నాక్కూడా స్పెషల్ చెయిర్ వేసేవారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మెంబర్ని నేను. నా ఆపరేషన్‌కు అసోసియేషన్‌తోపాటు దాసరిగారు కూడా ఎంతగానో తోడ్పడ్డారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా కాస్త సాయం అందింది. సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్న చిత్రపురికాలనీలో ఓ ఫ్లాట్ కోసం రెండు లక్షలు కట్టాను. ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి వికలాంగుల పింఛన్ రూ.500 వస్తుంది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుంచి వెయ్యి రూపాయలు, ఎన్ఎఫ్డీసీ నుంచి 750 రూపాయలు, జగదాంబ థియేటర్ యాజమాని నుంచివెయ్యిరూపాయలు.. ప్రస్తుతం నా ఆధారం ఇవే. బాధ్యతలైతే ఏమీ లేవు. నా భార్య ఇటీవలే గతించింది. ముగ్గురు పిల్లలకూ పెళ్లి చేశాను. మీది ప్రేమ వివాహమట... నిజమేనా? అవును... నా భార్య పేరు మల్లిక. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది తను. ఆ రోజుల్లోనే ‘ఐలవ్యూ’ అంటూ నాకు ప్రపోజ్ చేసింది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయేసరికి, పారిపోయి పెళ్లి చేసుకున్నాం. రెండడుగులు ఉన్నాడు... వీడు దేనికీ పనికిరాడు అని వాళ్ళల్లో కొందరు అంటే... చాలా బాధ అనిపించింది. నాకు కూతురు పుట్టింది. నా పోలికలతోనే పుట్టింది. దానికి నేను బాధపడలేదు. నేను దేనికీ పనికి రానన్నవాళ్లకు ‘ఇదిగో నా బిడ్డ’ అని గర్వంగా చూపించాను. ప్రస్తుతం జీవితం ఎలా ఉంది? చాలా సంతృప్తికరంగా ఉంది. కృష్ణానగర్‌లో ఏ అడ్రస్ కావాలన్నా ల్యాండ్ మార్క్ నా బంకే. ఇది నాకెంతో గర్వంగా అనిపించే అంశం.