breaking news
postmortem completed
-
పోస్టుమార్టం పూర్తి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ‘దిశ’కేసు నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్, మరో ఇద్దరు పీజీ విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందం.. ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం 4.51 గంటలకు ప్రారంభమైన శవపరీక్ష ప్రక్రియ రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఒక్కో మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. వారి బరువు, ఎత్తు కొలిచారు. ఏ భాగంలో బుల్లెట్ గాయమైంది? ఏ తుపాకీతో, ఎంత దూరం నుంచి కాల్చి చంపారు? అనే విషయాలను నిశితంగా పరిశీలించారు. ఒకరు ఫొటోలు, మరొకరు వీడియో ద్వారా ఈ ప్రక్రియను చిత్రీకరించారు. తొలుత ఆరిఫ్ మృతదేహానికి.. తర్వాత వరుసగా శివ, నవీన్, చెన్నకేశవుల మృతదేహాల పోస్టుమార్టం జరిగింది. అంతకు ముందు నిందితుల తల్లిదండ్రులకు వారి మృతదేహాలను చూపించారు. మృతదేహాల అప్పగింతకు బ్రేక్ ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందిం చింది. ఎన్‌కౌంటర్‌పై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంత వరకు మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించొద్దని శుక్రవారం రాత్రి జిల్లా పోలీసులను ఆదేశించింది. శనివారం ఉదయం కమిషన్ సభ్యులు మహబూబ్‌నగర్ వస్తున్నారని.. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫున వైద్యుల సమక్షంలో మరోసారి మృతదేహాలను పరిశీలిస్తామని పేర్కొంది. కాల్పులు దగ్గరి నుంచి జరిపారా? ఏ రివాల్వర్ వాడారు తదితర అంశాలపై కమిషన్ ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్చార్సీ ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ రూమ్‌లో భద్రపరిచారు. అయితే, ఎన్కౌంటర్ తర్వాత మీడియాతో మాట్లాడిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అక్కడే నిందితుల తల్లిదండ్రులకు మృతదేహాలు అప్పగిస్తామని వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితుల తల్లిదండ్రులు తమ కుమారుల మృతదేహాల కోసం అర్ధరాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉండిపోయారు. అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం? ‘దిశ’నిందితులకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వచ్చిన వైద్యబృందం, స్థానిక అధికారులపై షాద్‌నగర్ జడ్జి ఆశ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిబంధనల ప్రకారం పోస్టుమార్టానికి న్యాయమూర్తి అవసరం లేదు. కానీ ‘దిశ’ఉదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు కారణం కావడంతో జడ్జి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. అయితే, ఈ విషయం తెలియని అధికారులు.. పోస్టుమార్టం ప్రారంభించారు. ఆరిఫ్ మృతదేహానికి శవపరీక్ష పూర్తయిన తర్వాత జిల్లా ఆస్పత్రికి వచ్చిన న్యాయమూర్తి.. అధికారులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సారిక, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ నివేదిక వెల్లడైతే గానీ సారిక, పిల్లలది బలవన్మరణమో, ఆత్మహత్యోనన్న విషయం తెలిసే అవకాశం లేదు. ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ మరణాలు అనుమానాస్పదంగా ఉండటంతో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, మరోవైపు రాజయ్య కుటుంబ సభ్యులకు కూడా ఎంజీఎం ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండటంతో వాళ్లకు కూడా వైద్య పరీక్షలు చేశారు.