breaking news
post recruitment
-
మనోళ్లేనా.. ఐతే సరే.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఇంటర్వ్యూలు రెండో రోజు మంగళవారమూ మొక్కుబడిగానే సాగాయి. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నిబంధనలు గాలికొదిలేసి, ఇస్టానుసారం మార్చేసుకుంది. కనీస అర్హత లేకున్నా వారికి నచ్చిన వారైతే అన్నింటినీ ఉల్లంఘించి అర్హత ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పోస్ట్‌కు కనీస అర్హత మూడు సంవత్సరాల కాలంలో సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. కానీ జెన్కోలో డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కార్పొరేషన్లో చేరిన ఓ అధికారికి నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ పోస్టుకు అర్హత కల్పించారు. ఆయన సహచరులు జెన్కోలో డీఈలుగానే ఉన్నారు. ఆయనకు హెచ్ఆర్ డైరెక్టర్ పోస్టుకు అవకాశమిచ్చారు.చిత్రమేమిటంటే ఇదే అభ్యర్ధిని థర్మల్, హైడల్ డైరెక్టర్ పోస్టులకు అనర్హుడిగా పేర్కొన్నారు. డైరెక్టర్ల పోస్టుల భర్తీలో అడ్డగోలు నిబంధనలకు ఇదో ఉదాహరణ. దాదాపు అన్ని పోస్టులకు తమ వారికి అనుగుణంగా ఇలా నిబంధనలు మార్చేశారు. బుధవారం ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.కాపు సంఘాల ‘సామాజిక’ ఉద్యమంవిద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు పైరవీల కారణంగా తమ సామాజిక వర్గం అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో గత ఎన్నికల్లో కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞులు, నిజాయితీపరులు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పని చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారందరూ డైరెక్టర్ పోస్టులకు అర్హులని, దామాషా పద్ధతిలోనైనా న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామాషా పద్థతిలో ఇస్తే 15 పోస్టుల్లో జెన్కోలో ఒకటి, ట్రాన్స్‌కోలో ఒకటి, డిస్కంలలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 5 పోస్టులు కాపులకు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ వాట్సప్ మెసేజ్‌లను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు, మంత్రి లోకేశ్‌కు చేరే వరకూ ఫార్వార్డ్ చేయాలని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. -
బీఈడీలకు షాక్
ఏలూరు సిటీ :ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు షాకిచ్చింది. పోస్టుల భర్తీకి సంబంధించి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా నామకర ణం చేసింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు, నిబంధనలతో కూడిన జీవో-38 జారీ చేసింది. భారీగా పోస్టులు భర్తీ చేస్తారని గంపెడాశతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రిక్తహస్తం చూపింది. మరోవైపు బీఈడీ అభ్యర్థుల ఆశలను ఆవిరిచేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో కేవలం డీఈడీ అభ్యర్థులకే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్ష రాసిన అభ్యర్థులూ మరోసారి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయాల్సి ఉంది. అయితే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకోనుండటం కాస్త ఊరటనిస్తోంది. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల సంగతి అటుంచితే.. డీఎస్సీలో 601 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ తారస్థాయికి చేరుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభు త్వ నిర్ణయం డీఈడీ చేసిన వారికి వరంగా మారగా, బీఈడీ అభ్యర్థులకు మాత్రం శాపంగా పరిణమించింది. ఉత్తీర్ణతలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60మార్కులు సాధిస్తే గానీ క్వాలిఫై అయ్యే అవకాశాలు లేవు. జిల్లాలో పోస్టులు ఇలా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మైదాన ప్రాంతం (ప్లెయిన్ ఏరియా)లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ), ఎస్జీటీ కలిపి మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక ఎల్పీ, 36 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం-17, బయోలాజికల్ సైన్స్-22, సోషల్ స్టడీస్-50, ఇంగ్లిష్-6, తెలుగు-19, హిందీ-4, ఉర్దూ-1, సంస్కృతం-3 పోస్టులు ఉన్నాయి. భాషా పండిట్ తెలుగు-25, భాషా పండిట్ హిందీ-43, భాషా పండిట్ సంస్కృతం-15 పోస్టులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఎస్జీటీ 358, ఏజెన్సీలో 36 వరకు ఉన్నాయి. అన్యాయం చేశారు ఎస్జీటీ పోస్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామం టూ ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం చివరకు నీరుగార్చింది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో సబ్జెక్టుల వారీగా పోస్టులైనా పెంచుతారని ఆశించి నా.. అదీలేదు. దీంతో బీఈడీ అభ్యర్థులు తీవ్ర ఆసంతృప్తికి లోనవుతున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 123 ఉంటే ఈ పోస్టులకు పోటీపడే వారి సంఖ్య భారీగా ఉంది. జిల్లాలో బీఈడీ అభ్యర్థులు సుమారు 30 వేల వరకు ఉంటారని అంచనా. వీరంతా డీఎస్సీ పరీక్షకు హాజరైతే ఒక్కో పోస్టుకు సుమారు 250 మంది అభ్యర్థులు పోటీపడే పరిస్థితి నెలకొంటుంది. పీఈటీ పోస్టు ఒక్కటీ లేదు జిల్లాలో పీఈటీ పోస్టు ఒక్కటీ లేకపోవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ-12లోనూ అన్యాయం జరగడంతో ఆవేదనకు గురైన పీఈటీలు ఈసారైనా అవకాశం వస్తుందని ఎదురుచూశారు. సర్కారు మరోసారి మొండిచేయి చూపడంతో డీలాపడ్డారు. జిల్లాలో 12 వరకు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు కావాలనే ఈ పోస్టులను డీఎస్సీ ప్రతిపాదిత జాబితాలో చూపించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరాశపరిచారు డీఎస్సీ ప్రకటిస్తారని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నిరాశ కలిగించింది. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు అవకాశం కల్పిస్తామని నమ్మించిన సర్కారు సరైన ప్రయత్నాలు చేయకుండా చేతులెత్తేసింది. బీఈడీ అభ్యర్థులు వేలల్లో ఉంటే పోస్టులు చాలా తక్కువగా ఉండటం దారుణం. - జి.పద్మమోహన, బీఈడీ అభ్యర్థి పోటీ పెరిగిపోతుంది జిల్లా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 123 పోస్టులు ఉంటే అభ్యర్థులు సుమారు 30వేల మంది ఉన్నారు. కనీసం రోస్టర్ ఆధారంగా అయినా పోస్టులు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. స్కూల్స్‌లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంటే పోస్టులు మాత్రం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కావాలంటే టీచర్లు ఉండాలి కదా. - జి.సత్యవాణి, బీఈడీ అభ్యర్థి