breaking news
Portsmouth University
-
ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్‌న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్‌ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్‌పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్‌డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్‌తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్‌ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్‌లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
నిజమో.. అబద్ధమో... కళ్లు చెబుతాయి
లండన్: మాటలతో వర్ణించలేని అనేక భావాలను కళ్లు పలికిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కన్నుల కదలికలను బట్టి ఓ వ్యక్తి మాటలు నిజమా..? అబద్ధమా..? అన్నది కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తనకు తెలిసిన వ్యక్తుల గురించి ఎవరైనా తెలియదని చెప్పే సందర్భంలో అతని కనుల కదలికలను బట్టి అతడు అబద్ధం చెబుతున్నాడా లేదా అన్నది తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. యూకేలోని పోర్ట్స్మౌత్ యూనివర్సిటీకి చెందిన ఐ ట్రాకింగ్ సాంకేతికతను ఉపయోగించి కొందరు వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యక్తులకు తెలిసిన వారివి, సెలబ్రిటీలు, అపరిచితుల ఫొటోలు చూపించి తెలుసా అని అడిగారు. కొంతమంది తమకు తెలిసిన వారి ఫొటోలను కూడా తెలియదని చెప్పారు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ల కళ్ల కదలికలు మారుతున్నాయని, దీన్ని బట్టి వారు అబద్ధం చెబుతున్నట్లు అర్థమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఉగ్రవాదులు, నేరస్తుల విచారణలో ఈ పద్ధతి బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.