breaking news
Police Sub Control Room
-
1984 పోలీస్ స్టోరీ!
సాక్షి,సిటీబ్యూరో: ఓ కుటుంబం తమ నివాసం కోసం పదేళ్ల క్రితం 300 గజాల్లో విశాలమైన గదులతో ఇల్లు కట్టుకుంది. ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు ఇల్లు విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉన్న దాంట్లోనే గదుల సంఖ్య పెంచుతూ అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటోంది. ఫలితంగా గదులు ఇరుకుగా మారిపోయి అందులో ఉండేందుకు ఇబ్బంది పడేపరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం నగర పోలీస్ వ్యవస్థలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దాదాపు 35 ఏళ్ల క్రితం.. అప్పుడున్నపరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా అప్పటికి ఉన్న ఠాణాలను పునర్వవస్థీకరిస్తూ 60 శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో సిటీలో జనాభా పెరగడంతో పాటు అనేక మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఠాణాల సంఖ్య మాత్రం ఏమాత్రం పెరగలేదు... సిబ్బందీ పెంపులేదు.ఫలితంగా ఉన్న స్టేషన్లపై భారీగా పని ఒత్తిడి పెరింగింది. రాజధాని నగరం భౌగోళికంగా కలిసే ఉన్నా పోలీసు పరిధులకు సంబంధించి ఇందులో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. మధ్య భాగంలో హైదరాబాద్ కమిషనరేట్, పశ్చిమాన సైబరాబాద్, తూర్పున రాచకొండ విస్తరించి ఉన్నాయి. మిగిలిన రెండు కమిషనరేట్లు విస్తరిస్తున్నప్పటికీ ప్రధాన సిటీకి మాత్రం ఆ అవకాశం లేదు. అయితే, కోర్ సిటీ కావడంతో జనాభా పెరుగుదల, విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడేవారి తాకిడి ఎక్కువగానే ఉంటోంది. దీనికి తగ్గట్టే నేరాలతో పాటు కేసులూ పెరుగుతున్నాయి. వీటన్నింటికీ మించి బోనాలు, బక్రీద్, గణేష్ ఉత్సవాలు వంటి మతపరమైన ఘట్టాలతో పాటు అసెంబ్లీ, వివిధ రకాలైన సభలు, సమావేశాలు ఇవన్నీ ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. వీటిన్నింటి నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి ఏడాదిలో కనీసం 100 నుంచి 150 రోజులు వివిధ రకాలైన బందోబస్తు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. వీటన్నింటికీ మించి ప్రముఖుల రాకపోకలు సైతం హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉంటాయి. ఆ రెండింటిలోనే కాస్త బెటర్ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ప్రాముఖ్యతతో పాటు పురాతన చరిత్ర గల హైదరాబాద్ కమిషనరేట్ పునర్వవస్థీకరణపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దాదాపు పదిహేడేళ్ల క్రితం ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మైలార్‌దేవ్‌పల్లి, బాచుపల్లి వంటి ఠాణాలు, దీని నుంచి విడిపోయి.. 2016లో రూపు సంతరించుకున్న రాచకొండలో ఆదిభట్ల, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి పోలీసుస్టేషన్లు కొత్తగా పుట్టుకువచ్చాయి. అయితే, దశాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ కమిషనరేట్‌లో మాత్రం జనాభా పెరుగుతున్నా, పోలీసింగ్ రూపురేఖలు మారుతున్నా, నానాటికీ కేసుల నమోదు అధికమవుతున్నా, బందోబస్తు–భద్రత విధుల భారం మోయలేకున్నా రీ ఆర్గనైజేషన్ మాత్రం జరగట్లేదు. కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఉండే హైదరాబాద్ ఈ కోణంలో మిగిలిన రెండు కమిషనరేట్ల కంటే ఎంతో కీలకమైన.. ముఖ్యమైన వ్యవస్థ. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న ఈ పోలీస్ కమిషనరేట్‌పై దాదాపు అన్ని నగరాల కళ్లు ఉంటాయి. నిత్యం ఇక్కడి పరిణామాలను వారు పరిశీలిస్తుంటారు. కేటగిరీలుగా విభజించిందీ అప్పట్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో 1984లో ఆఖరుసారి పోలీస్ స్టేషన్ల పునర్వవస్థీకరణ జరిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం నాటి పరిస్థితుల ఆధారంగా దీన్ని చేపడతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాలను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఈ ప్రాంతం పంజగుట్ట స్టేషన్‌కు ఔట్‌పోస్టుగా ఉండేది. ప్రస్తుతం ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ ఔట్‌పోస్టుగా కొనసాగుతున్న బోరబండకు ప్రత్యేక ఠాణా కావాలనే డిమాండ్ దాదాపు 20 ఏళ్లుగా ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అనేకసార్లు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినా అమలుకు మాత్రం నోచుకోలేదు. పరిపాలన సౌలభ్యంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో నగరంలోని పోలీస్ స్టేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు. దాని పరిధిలో నేరాల నమోదు, నివసిస్తున్న జనాభా తదితరాలను పరిగణలోకి తీసుకుని 35 ఏళ్ల క్రితం ఈ విభజన చేశారు. దీని ప్రకారం ‘ఎ’ కేటగిరీ పోలీస్ స్టేషన్లో 120కి పైన, ‘బి’ కేటగిరీలో 90 నుంచి 100 మధ్య, ‘సి’ కేటగిరీలో 60 నుంచి 80 మధ్య సిబ్బంది ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం ఈ కేటగిరీలను కూడా పునర్వవస్థీకరించలేదు. అప్పటి ప్రాధాన్యాలతోనే ఇప్పటికీ.. నగరంలో అప్పట్లో ఉన్న ప్రాధన్యం ప్రకారం ఠాణాల రూపకల్పన, అందులో సిబ్బంది కేటాయింపు జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రి నివాసం ఉన్న నేపథ్యంలో అబిడ్స్, సుల్తాన్‌బజార్ ఠాణాలను పెద్దవిగా భావించారు. దానికి తగ్గట్టే సిబ్బందిని కూడా కేటాయించారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. మరోపక్క ఆనాటి కమ్యూనల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కామాటిపురా, కాలాపత్తర్, శాలిబండతో పాటు షాహినాయత్‌గంజ్, బేగంబజార్ ఠాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, సైదాబాద్, చిలకలగూడలు చిన్న స్టేషన్ల కంటే చాలా పెద్దవి. అయినప్పటికీ చిన్న ఠాణాల కంటే కేవలం 20 శాతం సిబ్బంది మాత్రమే ఇక్కడ అధికంగా ఉంటారు. ‘ట్రాఫిక్’ పరిస్థితులే కాస్త బెటర్ సాధారణంగా శాంతిభద్రతల విభాగం ఠాణాల కంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లే ఉండేవి. వీటి సంఖ్యని దాదాపు 20 ఏళ్ల క్రితం 18కి పెంచారు. అప్పటి నుంచి నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతునే ఉన్నా స్టేషన్లను మాత్రం పెంచడం లేదు. అయితే, 2012లో అప్పటి ప్రభుత్వం నగరానికి అదనంగా 33 శాతం పోస్టులు కేటాయించింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న అప్పటి ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ సీవీ ఆనంద్ ఏడు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, నల్లకుంట, ఫలక్‌నుమా, నారాయణగూడ, మారేడ్‌పల్లి, టోలిచౌకి ట్రాఫిక్ ఠాణాలు అప్పుడే అందుబాటులోకి వచ్చాయి. నగర వ్యాప్తంగా ఉన్న 18 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధులు, వాటిలో ఉండే ప్రాంతాలు, అక్కడ జరిగే కార్యకలాపాలను అధ్యయనం చేసిన సీవీ ఆనంద్.. అందుకు తగ్గట్టు రీ ఆర్గనైజ్ చేసి కొందరు అధికారులపై పడే మితిమీరిన భారాన్ని తగ్గించారు. పునర్ విభజన చేయాల్సిందే.. ప్రస్తుతం నగరంలోని శాంతిభద్రతల విభాగం ఠాణాలను పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం పరిధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా దాంతో పాటు ఆయా ఠాణాలు/ప్రాంతాల్లో నమోదయ్యే నేరాలు, నివసిస్తున్న/వచ్చిపోతున్న జనాభా, బందోబస్తు విధులను పరిగణలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ల రీ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందనే భావన ఉందని, అయితే.. అది సరికాదని వారు పేర్కొంటున్నారు. ఉన్న పోస్టులనే సర్దుబాటు చేస్తూ ఠాణాలను విభజించినా కొంత వరకు ఒత్తిడి తగ్గించవచ్చని, ఆపై అవకాశం ఉన్నప్పుడు వాటికి కొత్త పోస్టులు కేటాయించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం నగర పోలీస్ కమిషనరేట్‌లోని స్టేషన్లను పునర్విభజన చేపట్టాలని కోరుతున్నారు. -
మద్యం మత్తులో ఎస్సైని దూషించి.. వీరంగం
నల్లబెల్లి: మద్యంమత్తులో పోలీస్‌స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు శనివారం అర్థరాత్రి వీరంగం సృష్టించిన సంఘటన రూరల్ జిల్లా నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై నరేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాంతీర్థం శివారు బిల్‌నాయక్‌తండాకు చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లతో పాటు మరికొందరు శనిగరం క్రాస్ రోడ్డు జాతీయ రాహదారి సమీపంలో పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీస్ వాహనంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమ్కు, రాజారతన్‌సింగ్‌లు మాత్రం అక్కడే నిలుచున్నారు. ఇంతరాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని పోలీసులు ప్రశ్నిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మద్యంమత్తులో ఉన్న యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ ప్లేసులో మద్యం తాగినందుకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వారికి తెలియజేస్తూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ వాహనాన్ని ద్విచక్రంపై వెంబడిస్తూ పీఎస్‌కు చేరుకొని సుమారు రెండుగంటల పాటు ఎస్సైతో పాటు పోలీసులపై పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారు. ఎస్సై, పోలీసులు క్షమాపన చేప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హంగామ సృష్టించారు. ఫ్రెండ్లీ పోలీస్ కావడంతో చేసేది ఎమిలేక చూస్తూ ఉండి పోయారు. కేసు నమోదు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిల్‌నాయక్‌తండా గ్రామానికి చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లు మద్యంమత్తులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్పీ గారూ.. మీరెమంటారు?
ఓ కాంట్రాక్టర్ తన పనుల కోసం ఏకంగా పోలీసు ఔట్ పోస్ట్‌నే కబ్జా చేసేశాడు. అందులో సిమెంటు, ఇతర సామగ్రిని నింపేసి స్టోర్ రూమ్‌గా మార్చుకున్నాడు. ఇదెక్కడి చోద్యమని అనుకుంటున్నారా! ఔనండి ఇది అక్షర సత్యం. ఎక్కడా కాదు.. జిల్లా కేంద్రం అనంతపురంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో వైజంక్షన్లోనే!! ఇటీవల ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు. ధర్మవరం నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన కంపెనీకి ఈ పనుల కాంట్రాక్ట్ అప్పగించారు. దీంతో అక్కడే ఉన్న పోలీస్ ఔట్ పోస్టు తలుపుల తాళాలను బద్ధలుగొట్టి దానిని సిమెంట్, సామగ్రిని ఉంచి స్టోర్ రూంగా మార్చుకున్నాడు. ఇంతా జరిగినా వన్‌టౌన్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బతుకు తెరువు కోసం తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారు రోడ్డుపై కొద్దిగా ముందుకు వస్తే నిప్పులు చెరుగుతూ.. చిర్రుబుర్రులాడే పోలీసులు.. తమ ఔట్‌పోస్టును కబ్జా చేసిన కాంట్రాక్టర్ విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం. అధికార పార్టీ దురాగతంపై జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జీవీజీ అశోక్‌కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. - అనంతపురం సిటీ -
నిఘా.. ఎక్కడ నీ చిరునామా!
దిష్టిబొమ్మల్లా పోలీసు సబ్ కంట్రోల్ రూంలు కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు సబ్ కంట్రోల్ రూంలు దిష్టిబొమ్మల్లా మారిపోయాయి. శాంతి భద్రతల పరిరక్షణకు ఒక అడుగు ముందుకేసి ఏర్పాటు చేసిన ఈ విభాగం సేవలందించలేకపోయింది. ఉద్దేశం మంచిదే అయినా.. ఆచరణలో విఫలమవడం ప్రజలకు శాపంగా మారింది. 2012లో అప్పటి రాష్ట్ర పోలీసు బాస్ దినేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హయాంలో ఆరు సబ్ కంట్రోల్ రూంలు ఏర్పాటయ్యాయి. కిడ్స్ వరల్డ్.. జిల్లా పరిషత్ ఎదురుగా.. ఎంజీ పెట్రోల్ బంకు.. ఐదు రోడ్ల కూడలి.. ప్రభుత్వాసుపత్రి ప్రధాన గేటు.. సత్యనారాయణ గుడి(మెయిన్ రోడ్డులో).. కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూంలు ఇప్పటికీ సేవలందించకలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏఎస్ఐ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుళ్లతో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు వీటిలో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు కార్యాచరణ రూపొందించారు. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేందుకు జంకే బాధితులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకుకోవాలనేది సబ్ కంట్రోల్ రూంల ఉద్దేశం. మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు.. తాగుబోతుల హల్చల్.. అల్లరిమూకల ఆటకట్టించేందుకు ఈ విభాగం ఉపయోగపడనుంది. ఆ మేరకు పోలీసు అధికారులు సబ్ కంట్రోల్ రూంలలో నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. అయితే వీటిని ఆర్భాటంగా ఏర్పాటు చేశారే కానీ సిబ్బంది నియామకంలో చేతులెత్తేశారు. ప్రస్తుతం పోలీసు సబ్ కంట్రోల్ రూంలు నిరుపయోగంగా మారిపోయి అసాంఘిక కార్యకలాపాలకు నిలయమవుతున్నాయి. కిడ్స్ వరల్డ్ వద్దనున్న కంట్రోల్ రూంలో గుర్తు తెలియని వ్యక్తులు గోనెసంచులు మూటకట్టి పెట్టారు. ప్రతిచోటా చిరు వ్యాపారులు వీటికి అడ్డంగా దుకాణాలు పెట్టేయడంతో ఈ విభాగం మరుగునపడుతోంది. పోలీసు అధికారుల ఆకాంక్షకు అనుగుణంగా కంట్రోల్ రూంలకు ఒక కానిస్టేబుల్నైనా నియమిస్తే కొంత మేరకైనా నేరాలకు అడ్డుకట్ట వేయచ్చనే అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. గత ఐదు నెలల కాలంలో కర్నూలు నగరంలోనే 12 భారీ చోటు చోటు చేసుకున్న నేపథ్యంలోనైనా పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.