breaking news
Playing Card Clubs
-
జిల్లా క్లబ్‌పై దాడులు
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా క్లబ్‌పై పోలీసుల దాడులు జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. పట్టణ నడిబొడ్డున ఉన్న జిల్లా క్లబ్లో డబ్బులు పందెంగా ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్, ఎస్బీ డీఎస్పీ గిరిబాబు, డీటీసీ డీఎస్పీ సాయిప్రసాద్, టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేయడం జరిగింది. దీంతో కాయిన్స్ పెట్టుకొని మూడు ముక్కలాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు బందిగ శివప్ప, ఉప్పల లక్ష్మయ్య, కేటీ సుదర్శన్, మల్లేశ్, దశరథం, మదన్మోహన్రెడ్డితోపాటు క్యాష్ కౌంటర్ మేనేజర్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేశారు. అలాగే క్లబ్ కౌంటర్లో ఉన్న రూ.1,24,660 నగదు సీజ్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న కొందరు పెద్దలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. జిల్లా క్లబ్లో పేకాట ఆడటానికి కోర్టు అనుమతి ఉన్న దానికి విరుద్ధంగా ఆడుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి తుంగలో తొక్కారు గతంలో జిల్లా క్లబ్‌పై పోలీసులు దాడులు చేయడంతో దీనిపై అప్పట్లో ఉన్న పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించి కొన్ని నిబంధనలతో కూడిన పేకాట ఆడుకోవచ్చని ఆర్డర్ తెచ్చుకున్నారు. రమ్మీ, 13 కార్డ్స్ మాత్రమే ఆడాలని ఇందులో కూడా టేబుల్స్‌పై నగదు ఉండరాదని చెప్పింది. దీంతో పేకాట ఆడుతున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానిని నేరుగా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని సూచించింది. దీంతో అలాంటి నిబంధనలు పాటించకుండా క్లబ్ కౌంటర్లో డబ్బులు కట్టి కాయిన్స్ తెచ్చుకొని పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడాలని భావించిన ప్రతి ఒక్కరు ఎన్ని వేలు అయినా కౌంటర్లో కట్టి దానికి ప్రతిఫలంగా కాయిన్స్ తీసుకోవాలి. దీంట్లో గెలుపొందిన వ్యక్తులకు కాయిన్స్ పరిశీలించి దాని ప్రకారం కౌంటర్ నిర్వాహకులు గెలుపొందిన వ్యక్తులకు నగదు చెల్లిస్తారు. రాత్రివేళలోనే అధికంగా.. జిల్లాకేంద్రంలోని జిల్లా క్లబ్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో కాయిన్స్ పెట్టి భారీస్థాయిలో మూడు ముక్కలాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రాజకీయ పెద్దల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతిఒక్కరు ఉంటారని తెలుస్తోంది. ఈ దాడులు ఏదో రాత్రివేళలో చేసి ఉంటే పెద్ద మనుషులు అందరూ పట్టుబడే వాళ్లని చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రూ.300 నుంచి రూ.500లోపు ఆడేవారు మాత్రమే ఉంటారని సమాచారం. రూ.వేలు, లక్షలు పెట్టి ఆడేవారు సాయంత్రం 6 గంటల తర్వాతే క్లబ్ చేరుకుంటారని తెలుస్తోంది. పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడులు చేస్తే రూ.లక్షల్లో నగదు లభ్యమవుతుందని ప్రచారం. కాయిన్స్ పెట్టి పేకాట జిల్లా క్లబ్లో నూతనంగా ఏర్పాటు అయిన గేమింగ్ యాక్టు ప్రకారం డబ్బులు పెట్టి లేదా వాటిస్థానంలో కాయిన్స్ పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు క్లబ్లో భారీస్థాయిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా దాడులు చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.1,24,660 నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. దీంతోపాటు డిస్ట్రిక్ క్లబ్లో చట్టవిరుద్ధంగా డబ్బులతో పేకాట ఆడుతున్న నేపథ్యంలో సంబంధిత కమిటీ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట కానీ ఇతర జూదం ఆడటం చట్టప్రకారం నేరమని ఇలాంటి కార్యకళాపాలు ఎక్కడ జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పేకాడేస్తున్నారు
*జూద గృహాలపై పోలీసుల ఉక్కుపాదం *ఐదు నెలల్లో 146 శిబిరాలపై దాడులు *పట్టుబడిన 1089 మంది జూదగాళ్లు *20 కార్లు, 265 బైక్‌లు.1037 సెల్ఫోన్లు సీజ్ సిటీబ్యూరో: పేకాట శిబిరాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన ఐదు నెలల్లో పేకాట శిబిరాలపై జరిపిన వరుస దాడులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం నగరంలో పేకాట క్లబ్బులు మూసివేయడంతో పేకాటరాయుళ్లు నగర శివార్లతో పాటు తమ ఇళ్లను అడ్డాగా చేసుకొని రహస్యంగా పేకాటాడుతున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఎస్ఓటీ పోలీసులు అన్ని ఠాణాల పరిధిలో పేకాట శిబిరాల గురించి తెలుసుకొనేందుకు పకడ్బందీ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గత ఐదు నెలల్లోనే 146 పేకాట శిబిరాలపై దాడి చేశారు. నిందితుల నుంచి సుమారు కోటి రూపాయలు, 26 కార్లు, 277 బైక్‌లు, 1040 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పారిశ్రామికవేత్తలు, బడా బాబుల పిల్లలు, మహిళలు, పోలీసులు, విలేకరులు ఉండటం గమనార్హం. మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పేకాట శిబిరాల గుట్టును కూడా ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. నగరంలోని క్లబ్‌లు మూసివేయడంతో హోటళ్లలో పేకాటాడితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో నగర శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని పేకాటాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 30 ఠాణాల పరిధిలో దాడులు నిర్వహిస్తున్నారు. శివార్లలోని హోటళ్లు, ఫామ్‌హౌస్‌లతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లల్లో నిర్వహిస్తున్న జూదగృహాలపైనా దృష్టి పెట్టి దాడులు కొనసాగిస్తున్నారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, గురురాంఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు నాలుగు బృందాలుగా ఏర్పడి తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. వీరి దాడులకు వెరసి పేకాట రాయుళ్లు దారి మార్చారు. హైదరాబాద్ టూ విజయవాడ... జూదాన్ని వృత్తిగా పెట్టుకున్న కొందరు విజయవాడకు తమ మకాం మార్చుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. అక్కడ కొన్ని క్లబ్బులు ఇక్కడి పేకాటరాయుళ్లతో నిత్యం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వారికి రవాణా సౌకర్యంతో పాటు వసతి వంటి సకల సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరికొందరైతే గోవాకు వెళ్లి పేకాడుతున్నారు. ఖాళీ చేయని క్లబ్‌లు.... మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న పేకాట క్లబ్బులు ఒక్కసారిగా బంద్ కావడంతో నిర్వాహకుల గొంతులో పచ్చివెలక్కాయపడినట్టు కాగా... సాధారణ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. క్లబ్బులు ఇక తెరిచేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినా... నిర్వాహకులు మాత్రం క్లబ్బులను ఇంకా ఖాళీ చేయడం లేదు. క్లబ్బులపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని తెరిచేందుకు రేపో మాపో అనుమతి ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అద్దె భవనాల్లో ఉన్న క్లబ్బులకు వేలాది రూపాయల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు. నగరంలోని ఓ క్లబ్ నిర్వాహకులు రోజుకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా క్లబ్ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోకుండా వెంటనే భవనాలు ఖాళీ చేసి ఇతర వ్యాపారాలు చేసుకుంటే మంచిదని పోలీసులు హితవు పలుకుతున్నారు. ఆటలు సాగనివ్వం పేకాట శిబిరాలపై దాడులు కొనసాగిస్తాం. గుట్టుచప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని పేకాటాడుకుంటున్నామని ఎవరూ అనుకోవద్దు. ఇలాంటి శిబిరాల సమాచారం సేకరించేందుకు అన్ని ఠాణాల పరిధిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. జూదం ఆడుతుంటే క్షణాల్లో మాకు తెలిసిపోతుంది. వెంటనే వెళ్లి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్నవారిని పట్టేస్తాం. జూదగృహాల గురించి తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నా. పేకాటాడుతూ తరచూ పట్టుబడే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నిర్వాహకులపై రౌడీషీట్ తెరుస్తాం. రామచంద్రారెడ్డి, ఎస్ఓటీ అదనపు డీసీపీ జూదకేంద్రాలపై దాడి: 16 మంది అరెస్టు సిటీబ్యూరో: ఉప్పల్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిలోని పేకాట కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదులో పాటు 16 మందిని అరెస్టు చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు ఈ దాడులు నిర్వహించారు.