breaking news
pk mahanti
-
విభజనపై 15 కేంద్ర శాఖల చర్చలు
ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఈరోజు ఇక్కడ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విభజనకు ఎంత సమయం పడుతుందన్న అంశంపై మహంతి నివేదికలను హొం శాఖ అధికారులకు అందజేశారు. కేంద్ర హొం శాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశంలో విభజన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల విధులపై చర్చించారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి 12 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే విభజనపై మరింత దృష్టిపెట్టలేమని అధికారులు చెప్పారు. త్వరలో మరోసారి సమావేశమవ్వాలని అధికారులు నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు అధికారికంగా విడిపోయే రోజు(నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజన్నది ఇంకా నిర్ణయించవలసి ఉంటుంది. అది రాజకీయ నిర్ణయం. ఆ తేదీ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై రేపటిలోగా కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అంతకు ముందు మహంతి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శితో సమావేశమై ఆలిండియా సర్వీస్, రాష్ట్ర సర్వీస్ ఉద్యోగులవిభజనపై చర్చించారు. -
సచివాలయంలో కీలక సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆధ్వర్యంలో సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ అన్ని అంశాలపై ఒక నివేదిక రూపొందించి రేపు ఉదయం మహంతి ఢిల్లీ వెళతారు. కేంద్ర హోంశాఖ రేపు సమావేశమై విభజన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
వీఆర్ఏల కలకలం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతి, డీజీపీ ప్రసాదరావు వాహనాలను అడ్డుకున్నారు. ఆదివారం అనంతగిరి అడవిలో జింకలు వదిలే కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న వారి వాహనాలను సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట అడ్డుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘లాఠిన్యం’తో పలువురికి గాయాలు.. చాలీచాలని జీతాలతో తమ బతుకు దుర్భరంగా మారిందని వీఆర్ఏలు వికారాబాద్ పట్టణంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అనంతగిరికి వచ్చిన సీఎస్ పి.కె మహంతికి వినతిపత్రం ఇవ్వాలని భావించామని, వాహనాలు అడ్డుకోవాలని తమ ఉద్దేశం కాదని వీఆర్ఏలు తెలిపారు. పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు తాము ఉదయం నుంచి పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. మరోమార్గం లేక సీఎస్, డీజీపీ వాహనాలను అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కాగా అంతకు ముందు రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోనే సీఎస్, డీజీపీ వాహనాలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి రంగంలోకి దిగి సిబ్బందితో కలిసి ఆందోళనకారులను చితకబాదారు. అధికారుల తీరుకు నిరసనగా సీఐటీయూ డివిజన్ కార్యద ర్శి మహిపాల్ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనపై తమ ప్రతాపాన్ని చూపించారు. బూటు కాళ్లతో తన్నడంతో మహిపాల్ రోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిరసనలో పాల్గొన్న పలువురు మహిళలను కూడా పోలీసులు తోసేశారు. నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టి సీఎస్, డీజీపీ వాహనాలను పంపించి వేశారు. కాగా భద్రత చర్యల్లో పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని డీజీపీ అసహనం,ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా వాహనాలను అడ్డుకున్న పదిమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ లచ్చిరాంనాయక్ తెలిపారు. విధులు నిర్వహిస్తున్నారా..? లేక నిద్ర పోతున్నారా..? వీఆర్ఏలు అడ్డుకుంటున్న సమాచారం తనకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన సిబ్బందిపై ఎస్పీ రాజకుమారి మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్నారా..? నిద్రపోతున్నారా.? అని తీవ్రంగా మందలించారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు..? సెట్లో సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇవ్వాలంటూ ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల దాడి అమానుషం.. సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించేందుకు వచ్చిన తమపై పోలీసులు లాఠీలతో దాడి చేయడం అమానుషమని జిల్లా వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.నర్సింలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం ఖండించారు.