breaking news
Pinkthan
-
జాలీగా శారీ రన్..
ఖైరతాబాద్: తెలుగుదనం ఉట్టిపడింది. మహిళలు, పిల్లల సంప్రదాయ చీరకట్టు ఆకట్టుకుంది. వందలాది మందితో నెక్లెస్ రోడ్డు కళకళలాడింది. పింకథాన్ మూడో ఎడిషన్ శారీ రన్ ఆద్యంతం అలరించింది. ఆదివారం తనైరా, పింకథాన్ మూడో ఎడిషన్‌లో భాగంగా జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్ మీదుగా తిరిగి జలవిహార్ వరకు నగరంలో తొలిసారిగా శారీ రన్ నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 3 వందల మంది మహిళలు చీరలు ధరించి రన్లో పాల్గొన్నారు. మహిళల ఫిట్‌నెస్‌కు మద్దతు తెలుపుతూ నిర్వహించిన రన్‌ను నటుడు, మోడల్ అల్ట్రామ్యాన్ మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారు. డోంట్ హోల్డ్ బ్యాక్ అనే నినాదంతో నిర్వహించిన శారీ రన్లో భాగంగా జుంబా సెషన్, కర్రసాము, వ్యాయామంతో మహిళలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మిలింద్ సోమన్ మాట్లాడుతూ.. మహిళల్లో ఫిట్నెస్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా శారీ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి భారతీయ మహిళకూ చీరతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పింకథాన్ వంటి కార్యక్రమాలతో దేశంలో మహిళా సమాజాన్ని శక్తిమంతంగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారతతోనే ఆరోగ్యకర కుటుంబం, సమాజం, దేశంగా మారుతాయన్నారు. చీరకట్టుతో ఎంతో ఉత్సాహంగా శారీ రన్లో పాల్గొనడం ఆనందం కలిగించిందని మహిళలు తెలిపారు. -
రొమ్ము క్యాన్సర్‌పై యుద్ధం
ఖైరతాబాద్: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ‘పింక్‌థాన్’ పేరుతో రన్ నిర్వహించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో సాగిన రన్లో సుమారు ఏడు వేల మంది పాల్గొన్నారు. గతంలో ముంబ యి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఈ తరహా మారథాన్ నిర్వహించామని తొలిసారి సిటీలో ఏర్పాటు చేసినట్టు ఎస్బీఐ సీజీఎం సి.ఆర్. శశికుమార్ తెలిపారు. రన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రన్లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.రఘురామ్, ఫిట్నెస్ నిపుణుడు సోమన్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.