breaking news
piggy banks
-
తల్లీని సర్ప్రైజ్ చేసిన తొమ్మిదేళ్ల బాలుడు
-
స్మార్ట్ కిడ్.. తల్లికే షాకిచ్చాడు..!
బీజింగ్ : ఈ తరం పిల్లలకు పెద్దలంటే బొత్తిగా గౌరవం లేదు. తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయరు. అనే మాటలు వింటూనే ఉంటాం..! అడిగింది కొనివ్వలేదని గొడవలకు దిగే పిల్లల్ని కూడా చూస్తుంటాం..! కానీ చైనాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం వీటన్నికీ భిన్నంగా ఆలోచించాడు. అమ్మకు జీవిత కాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. మదర్స్ డే రోజు (మే 12)న తన తల్లిని గ్వో ఇఫాన్ జ్యుయెలరీ షాప్‌నకు తీసుకెళ్లాడు. ‘నీ చేతికి ఏ ఉంగరం బాగుంటుందమ్మా’ అని అడిగాడు. విషయమేంటో ఆమెకు అర్థం కాలేదు. కుమారుడు అడుగుతున్నాడు కదా అని ఆమె తనకు నచ్చిన ఓ ఉంగరాన్ని చూపించారు. దాని ధరెంతో తెలుసుకున్న ఇఫాన్ నేరుగా బిల్ కౌంటర్ దగ్గరకెళ్లి జేబులో నుంచి రెండు పిగ్గీ బ్యాంక్‌లను తీశాడు. (చదవండి : బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..) వాటిని పగులగొట్టి.. ఆ మొత్తం లెక్కిస్తే.. అవి రూ.15 వేలు (1500 యువాన్లు)గా ఉన్నాయని తేలింది. వాటితో ఆ గోల్డ్ రింగ్‌ని ఖరీదు చేసి.. అమ్మకు అందించాడు. ఇక కుమారుడు చేసిన పనికి ఆ తల్లి ఆనందంతో పొంగిపోయారు. ‘అమ్మ మాకోసం చాలా కష్టపడుతుంది. ఆమె చేతులకు బంగారు ఆభరణాలు లేవు. ఆమెకు ఏదైనా మంచి బహుమతి ఇద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అమ్మ, అమ్మమ్మ ఇచ్చిన పాకెట్‌మనీని రెండేళ్లుగా పొదుపు చేసి ఈ గిఫ్టులు కొన్నాను’ అని చెప్పుకొచ్చాడు ఇఫాన్. ఈ ముచ్చటైన సంఘటన లింక్వాన్ పట్టణంలో మే 12న జరిగింది. తన తల్లితో పాటు ఆమె తల్లికి కూడా ఇఫాన్ నెక్లెస్ కానుకగా ఇవ్వడం మరో విశేషం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తల్లీని సర్ప్రైజ్ చేసిన తొమ్మిదేళ్ల బాలుడు -
కేరళ: చిన్నారి సాయం, బంపర్ ఆఫర్
గత వందేళ్లలో లేని వర్షాలు, వరదలతో భీతిల్లుతున్న కేరళ ప్రజలనుఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్దా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ ఓ చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. తనవంతు సాయంచేసి మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు తన కలను సాకారం చేసుకుంది. నాలుగేళ్లపాటు దాచుకున్న సుమారు 9వేల రూపాయలను డొనేట్ చేసింది. అంతేకాదు తన ఔదార్యంతో దేశీయ సైకిళ్ల కంపెనీ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఎవరికైనా మంచి చేస్తే అదిఎప్పటికైనా నీకు మంచి చేస్తుందన్న పెద్దలమాట బేబి అనుప్రియ(8) పాలిట అక్షరాలా నిజమైంది. తమిళనాడు, విలుపురం జిల్లాకు చెందిన అనుప్రియ మూడవ తరగతి చదువుతోంది. వరద బాధితులు, ముఖ్యంగా పిల్లలు పడుతున్న అవస్థల్ని టీవీలో చూసి చలించిపోయింది. ఏకంగా ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న 8,240 రూపాయలను కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తం నాణేలను సోమవారం స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎల్కేజీలో ఉన్నప్పటినుంచీ సైకిల్ కొనుక్కోవాలనే కోరికతో రోజుకు కనీసం రెండు రూపాయల చొప్పున పిగ్గీ బ్యాంకులో దాచుకుంటున్నా..కానీ టీవీలో కేరళ ప్రజలు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులు చూసాకా బాధ అనిపించింది. అందుకే నేను సేవ్ చేసుకున్న డబ్బులు వారికివ్వాలని నిర్ణయించుకున్నానని అనుప్రియ చెప్పింది. చిన్ని వయసునుంచే ఆమెకు పొదుపు అలవాటు చేద్దామనుకున్నా కానీ అది ఇలా ఉపయోగపడుతుందని భావించలేదని ఆమె తండ్రి శివ షణ్ముగనాధన్ సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి గత సంవత్సరం సైకిల్ కొనిద్దామనుకున్నా..కానీ పాప ఇంకా పెద్దది కాలేదని భయపడ్డా... ఇపుడు తన నిర్ణయం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయన మురిసిపోయారు. హీరో సైకిల్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ అనుప్రియ ఔదార్యానికి అబ్బురపడిన దేశీయ అతిపెద్ద సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ అనూహ్యంగా స్పందించింది. ఏ ఉద్దేశంతో అయితే పిగ్గీ బ్యాంకులో డబ్బు దాచుకుందో ఆ కోరికను నెరవేర్చాలని నిర్ణయించింది. చిన్నారికి కొత్త సైకిల్‌ను కానుకగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు సంవత్సరానికి ఒక కొత్త బైక్‌ను గిఫ్ట్‌గా అందిస్తామంటూ హీరో మోటార్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ పంకజ్ ఎం ముంజాల్ ట్వీట్ చేశారు. ‘సైకిల్ కోసం ఇలా చేయలేదు. సహాయం చేయాలనుకున్నా, చేశాను అంతే. నా స్కూలు స్నేహితులను కూడా సాయం చేయమని కోరతా’ ఈ ఆఫర్ గురించి ప్రశ్నించినపుడు అనుప్రియ ఇలా వ్యాఖ్యానించడం విశేషం. Anupriya, parnam to you. You are a noble soul and wish you spread the good around. Hero is too pleased to give you one bike every year of your life. Pl share your contact on my account. Love you and best wishes. Prayers for Kerala https://t.co/vTUlxlTnQR — Pankaj M Munjal (@PankajMMunjal) August 19, 2018 -
బుడి బుడి పొదుపు...
ఏడేళ్ల ఆదిత్య నాన్నతో కలసి ఏటీఎంకి వెడితే .. కార్డు ఇన్సర్ట్ చేయడం నుంచి నగదు, ట్రాన్సాక్షన్ స్లిప్ తీసుకునేదాకా అంతా తానే చేయాలంటాడు. ఆరేళ్ల భార్గవి .. వాళ్లమ్మతో షాపింగ్‌కి వెడితే డబ్బులు తన చేత్తోనే ఇస్తానని మారాం చేస్తుంది. డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆర్థిక లావాదేవీలపై వారికి క్రమక్రమంగా పెరిగే ఆసక్తే ఇందుకు కారణం. అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అటు బ్యాంకులు మరో అడుగు ముందుకేసి పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. ఉచితంగా పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలతో పలు బ్యాంకులు కిడ్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ తదితర బ్యాంకులు ఈ మధ్యే ప్రత్యేక అకౌంట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల పొదుపు ఖాతాలపై ఈ కథనం.. ఎస్బీఐ .. పెహ్లా కదమ్.. పెహ్లీ ఉడాన్.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల అకౌంట్లు అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలసి ఏ వయస్సు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీన్ని వారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో రూ. 5,000 దాకా పరిమితి ఉంటుంది. అదే మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనైతే పరిమితి రూ. 2,000గా ఉంటుంది. . యంగ్ చాంప్.. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారి కోసం ఫెడరల్ బ్యాంక్ యంగ్ ఛాంప్ పేరిట పొదుపు ఖాతాలను ప్రవేశపెట్టింది. పదేళ్లు అంతకు పైబడి వయస్సున్న పిల్లల కోసం దీన్ని ఉద్దేశించారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో రూ. 2,500 దాకా వ్యయ పరిమితితో ప్రత్యేకంగా డెబిట్ కార్డును అందిస్తుంది. మొబైల్ అలర్ట్‌లు, పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా నిధుల బదలాయింపు, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కొనుగోళ్లకు రివార్డు పాయింట్లు మొదలైన ఫీచర్లు ఈ అకౌంట్లో ఉన్నాయి. కిడ్స్ అడ్వాంటేజ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7-18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును బ్యాంకు ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ.2,500 విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ పరిమితి రూ. 2,500గా ఉంటుంది. ఈ ఖాతా రూ. 1,00,000 మేర విద్యా బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. అలాగే మూడు నెలలకోసారి స్టేట్మెంట్లు, లావాదేవీలకు సంబంధించిన ఉచిత ఈమెయిల్ అలర్ట్‌లు కూడా బ్యాంకు పంపిస్తుంది. జంబో కిడ్స్ సేవింగ్స్.. కరూర్ వైశ్యా బ్యాంక్ పన్నెండేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్‌ను కూడా బ్యాంకు ఇస్తుంది. అటు స్టూడెంట్ సేవింగ్స్ అకౌంటు పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయస్సు గల విద్యార్థుల కోసం మరో పొదుపు ఖాతాను కూడా బ్యాంక్ అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉండాలి. కోటక్ మై జూనియర్ అకౌంటు.. ఈ ఖాతాలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షికంగా దాదాపు ఆరు శాతం దాకా వడ్డీ ఇస్తోంది. దీనికి అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటివి ప్రారంభించి.. క్రమం తప్పకుండా కడుతూ ఉంటే మినిమం బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది. ఖాతాను ప్రారంభించిన తొలి ఏడాది ప్రారంభ ఆఫర్ కింద ఆర్డీ, సిప్ మొత్తాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది దాకా పీవీఆర్ థియేటర్ సినిమా టికెట్లు లేదా ల్యాండ్‌మార్క్ బుక్ వోచర్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ ఖాతా.. పద్దెనిమిదేళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకటి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్‌బుక్‌లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా (ఆర్నెల్ల పాటు), రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. పదేళ్ల పైబడిన పిల్లలకోసం వారు కోరిన చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. ఆర్నెల్లకోసారైనా డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డెబిట్ కార్డు మోసాలు జరిగిన పక్షంలో రూ.50,000 దాకా పర్చేజ్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీ ఉంటుంది. ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ ఒక్క రోజు నుంచి పద్దెనిమిదేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాం క్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. పేరెంట్స్ కోరితే ఏడేళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది బ్యాంకు. రోజువారీ షాపింగ్ లేదా విత్‌డ్రాయల్ కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 దాకా వీటిపై పరిమితులను ఎంచుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ తరహా అకౌంట్లు పిల్లలకు చిన్నప్పట్నుంచి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చేందుకు ఉపయోగపడతాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌బుక్కులు, డెబిట్ కార్డులు వాడటం మొదలైన బ్యాంకింగ్ లావాదేవీల గురించి అవగాహన ఏర్పడుతుంది. అయితే, కిడ్స్ అకౌంట్స్ అంటూ బ్యాంకులు ప్రత్యేకత చూపించినా.. బ్యాలెన్సులు, ఫీజులు మొదలైన వాటి విషయంలో మిగతా సాధారణ ఖాతాల తరహాలో వీటి ట్రీట్మెంటు ఉంటుంది. ఇక, పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే.. తల్లిదండ్రులు కూడా వారితో కాస్త సమయం గడపాలి. డిపాజిట్, విత్‌డ్రాయల్స్ చేయడం, స్లిప్స్ నింపడం మొదలైనవి వారికి నేర్పాలి. అకౌంటు మనదే కదా అని వృథా ఖర్చులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అన్నది పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్లు మూడు నాళ్ల ముచ్చట కాకుండా కొనసాగించగలగాలి. ఇవన్నీ జరగాలంటే పేరెంట్స్‌కి కూడా క్రమశిక్షణ ఉండాలి.