breaking news
Petroleum and Oil Ministry
-
రండి.. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశ, విదేశీ కంపెనీలను పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి ఆహ్వానించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లతో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ‘‘ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గుర్తింపు విషయంలో, సవాళ్లను అధిగమించే విషయంలో మీతో కలసి ప్రభుత్వం పనిచేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా నడుస్తోంది. దీంతో ఇంధనానికి డిమాండ్ కూడా పెరగనుంది. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దేశ, విదేశీ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఇంధనంపై పెట్టుబడులకు మంచి అవకాశం ఎక్కడ ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. అందుకు భారత్ అనుకూలమైనది’’ అని మంత్రి ప్రకటించారు. గతంతో పోలిస్తే భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభతరం అయినట్టు చెప్పారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు. -
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
-
ఇక వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్!
న్యూఢిల్లీ : అత్యధిక మొత్తంలో ఆదాయాలు ఆర్జిస్తున్నా ప్రభుత్వ అందిస్తున్న వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎందుకు వదులుకోవాలంటూ వ్యవహరిస్తున్న వారందరికీ కేంద్రప్రభుత్వం షాకివ్వబోతుంది. నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తున్న పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని పెట్రోలియం, ఆయిల్ మంత్రిత్వశాఖకు మార్పిడి చేస్తోంది. ఈ సమాచార మార్పిడితో రూ.10 లక్షల కంటే ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి వివరాలను పెట్రోలియం శాఖకు అందనున్నాయి. దీంతో వంటగ్యాస్‌పై సబ్సిడీ వివరాలను చెక్ చేసి, ఒకవేళ ఎవరైనా రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తూ సబ్సిడీ పొందుతున్నట్టు తెలిస్తే వారికి వెంటనే గ్యాస్ సబ్సిడీలో కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ ఆర్జన వివరాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలు పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, జెండర్, ఐటీ డేటా బేస్‌లోని అందుబాటులో ఉండే అన్నీ అడ్రస్‌లు, ఈ-మెయిల్ ఐడీ, ఇంటి ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్లు వంటి వాటిని ఐటీ డిపార్ట్మెంట్ పెట్రోలియం శాఖకు అందించనుంది. దీనికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్కు, మంత్రిత్వశాఖకు ఓ అవగాహన ఒప్పందం జరుగనుందని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం పన్నుచెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా పంచుకోనున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయాన్ని ఆర్జించే వారికి వంటగ్యాస్‌పై సబ్సిడీ కోత విధించబోతున్నారు. ఆటోమేటిక్‌గా వారి ఈ సబ్సిడీలను విరమించబోతున్నారు. అవసరార్థులకు సబ్సిడీ గ్యాస్ అందుబాటులో ఉండేందుకు వీలుగా ధనికులు తమ గ్యాస్ సబ్సిడీలను వెనక్కి ఇచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా సబ్సిడీలను వదులుకున్న సంగతి తెలిసిందే.