breaking news
pavithrosthavas
-
వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
అప్పలాయగుంట(వడమాలపేట): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొపిన అర్చకులు శుద్ధి, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన, బలిహరణ శాస్త్రోత్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించగా భక్తులు స్వామివారి సర్వదర్శం చేసుకున్నారు. పండితులు హోమం నిర్వహించారు. సాయంత్రం మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం చేశారు. విశ్వసేనుని పల్లకిలో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ పుట్టమట్టిని తీసుకుని సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆ మట్టిని ఆలయానికి తీసుకువచ్చి నవధాన్యాలను మొలకవేసి వైభవంగా అంకురార్పణం జరిపించారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ జరిగింది. కార్యక్రమంలో ఏఈవో రాధాకష్ణ, సూపరింటెండెంట్ పవన్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరాజు, ఆలయాధికారి శ్రీనివాసులు, షరాబ్ హర్షవర్ధన్, ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
– నేడు అంకురార్పణ – పలు ఆర్జిత సేవలు రద్దు సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు 14 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. క్రీ.శ 1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసనాధారాలు ఉన్నాయి. క్రీ.శ 1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేస్తారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఆస్థానం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపంలో వేంచేపు చేసి పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు సోమవారం పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. చివరి రోజు మంగళవారం పూర్ణాహుతితో ముగిస్తారు. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, సహస్రదీపాలంకారణ సేవలు రద్దు చేశారు. అలాగే, 14 నుంచి 16వ తేదీ వరకు ఆయా రోజుల్లో నిర్వహించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు.