breaking news
passport seize
-
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
విజయ్ మాల్యాకు ఎస్బీఐ ఝలక్!
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు ఝలక్ ఇచ్చింది. మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్బీఐ నిన్న డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ని ఆశ్రయించింది. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన మాల్యా ఇక సంతానానికి చేరువగా ఉండేలా ఇంగ్లాండులో గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన లండన్‌కు పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడి, లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి, అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ను కోరింది. 2004 నుంచి 2012 వరకు కింగ్ ఫిషర్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. కింగ్ ఫిషర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా తాము గతంలో చాలాసార్లు బ్యాంకులను కోరినా చర్యలు తీసుకోలేదని సీబీఐ చీఫ్ అనిల్ సిన్హా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు విజయ్ మాల్యా, యునెటైడ్ బ్రివరీస్ హోల్డింగ్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఎస్బీఐ, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. రికవరీ ప్రక్రియలో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెల వేలం వేయాలని ఎస్బీఐ కన్సార్టియం నిర్ణయించింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అధికారాలున్న ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ .. ఈ-వేలాన్ని మార్చి 17న నిర్వహించనుంది. దీనికి రిజర్వు ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించింది. కన్సార్షియంలో అత్యధికంగా రూ. 1,600 కోట్ల మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్బీఐ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు చెరో రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు ఇచ్చాయి.