breaking news
The party office
-
48 ఎంపీ స్థానాల్లో పోటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు కొనసాగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. తెలంగాణతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని 48 స్థానాల్లోనూ బరిలో దిగేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా కార్యకలాపాలు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయన త్వరలోనే మహారాష్ట్ర బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ కానున్నారు. మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ కల్వకుంట్ల వంశీధర్‌రావు నిరంతరం అక్కడి నేతలతో సమన్వయం చేస్తూ స్థానికంగా సభలు, సమావేశాలు కొనసాగేలా చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత లాతూరులో పదివేల మందితో సభ నిర్వహించిన బీఆర్ఎస్, ఈ నెల 30న కొల్హాపూర్‌లోనూ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత షోలాపూర్, ఔ రంగాబాద్, వార్దా, బీడ్లోనూ సభలు ఉంటాయని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో చురుగ్గా కమిటీలు డిసెంబర్ మొదటివారంలో మహారాష్ట్రలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 200కు పైగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. నాగపూర్, ఔరంగాబాద్ (శంభాజీనగర్), వార్దా, బీడ్, సతారా, కొల్హాపూర్, సాంగ్లి, షోలాపూర్ తదితర జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టగా, మహారాష్ట్ర వ్యాప్తంగా 20లక్షలకు పైగా మంది క్రియాశీల సభ్యులుగా నమోద య్యారు. సంస్థాగతంగా 48 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. ఇప్పటికే నాగపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకలాపాలు సాగుతుండగా, త్వరలో పుణే, ఔరంగాబాద్‌లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న విదర్బ, మరాఠ్వాడా ప్రాంతంలో బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరిగిందని పార్టీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఓటమితో సానుభూతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పట్ల సానుభూతి పెరిగిందని మహారాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు మాణిక్ కదమ్ ‘సాక్షి’కి వెల్లడించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధుతో పాటు కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేసినా పార్టీ ఓడిపోవడంపై చర్చ జరుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ గందరగోళాన్ని సృష్టించి అధి కారంలోకి వచ్చిదనే విషయాన్ని విడమరిచి చెబుతున్నాం. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలకు బీఆర్ఎస్ అనుసరించే రైతు అనుకూల విధానాలతోనే పరిష్కారం దొరుకుతుందనే భావన కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కేసీఆర్ కోలుకున్న తర్వాత మహారాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశముంది’అని వెల్లడించారు. -
పదవి కొట్టు.. పార్టీ ఆఫీసు కట్టు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం నామినేటెడ్ పోస్టులను అధికార పార్టీ ఎరగా చూపుతోంది. నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న నేతలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను కట్టించాలనే షరతు విధిస్తున్నారు. ఈ షరతును అంగీకరించిన నేతలకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్టీ ముఖ్యులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సి కూడా వస్తోందని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి నుంచి కష్టపడ్డ తమకు అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. అంత ఖర్చా... భరించలేం! వాస్తవానికి కర్నూలు మార్కెట్ చైర్మన్ పోస్టుకు మొదటి నుంచి జిల్లాలో ప్రధాన వర్గానికి చెందిన నేత ఒకరు ప్రయత్నించారు. దాదాపు ఈయనకే కర్నూలు మార్కెట్ చైర్మన్ పోస్టు ఖరారైందన్న ప్రచారమూ జరిగింది. అయితే.. కర్నూలు జిల్లా ప్రధాన కేంద్రంలో మూడంతస్తుల పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంతో పాటు అదనంగా మరికొంత ముట్టచెప్పాలని నేతలు చెప్పడంతో ఆయన కాస్తా విస్తుపోయారు. అంతేకాకుండా కేవలం ఒకే ఏడాది పదవీకాలం ఉండటంతో.. అంతమొత్తాన్ని సంపాదించడం కష్టమని ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నారు. చివరకు ఈ షరతులకు ఒప్పుకున్న వారికే పదవులు దక్కాయని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జంప్‌జిలానీలకు షాక్...! ఇప్పటివరకు నాలుగు మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. మరో మార్కెట్‌కు త్వరలో నియామకం జరగనుంది. మిగిలిన మార్కెట్ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగం పుంజుకుంటోంది. అయితే, ఏ నామినేటెడ్ పోస్టు కూడా ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన తాజా మాజీ కాంగ్రెస్ నేతలు సిఫారసు చేసిన వ్యక్తులకు దక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో మాజీ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ప్రాంతాల్లో.. వీరు సిఫారసు చేసిన పేర్లను కాకుండా పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీరు కూడా పార్టీ కార్యాలయాల నిర్మాణంతో పాటు అంతో ఇంతో ముట్టచెప్పాల్సిందేనని ఆ పార్టీ ముఖ్యనేతలు కరాఖండిగా చెబుతుండటం విశేషం.