breaking news
Panuganti Laxminarasimha Rao
-
వచన రచన విశిష్టత
ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణదురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. పూర్వము సంస్కృతముననేమి యిప్పుడైన నాంధ్రముననేమి వచన ప్రబంధములు మిక్కిలి తక్కువగ నున్నవి. వచనమును వ్రాయువాడు వట్టి తెలివితక్కువవాడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుట కర్హుడు కానివాడే యీ కట్టెలమోపు మోయదగిన వాడని జనుల నమ్మకము. ఆడుది తాను మిగుల రూపవతి యని లోకులనుకొనుట కెంత యాత్రపడునో, పురుషుడు తాను మిగుల బుద్ధిమంతుడని జనులనుకొనుట కంత కంటె నెక్కువ యాత్రపడును. అగరు నూనెల మెఱుగులు, నద్దము నెదుటి తిరుగులు, నాభరణముల హొరంగులు, మొగము పొడుముల తెఱగులు, కన్ను త్రిప్పుల వెరగులు మొదలగు సౌందర్య కళా సంపాదన సామగ్రి యాడుది యెంత యాచరించిన నంత యామెకే నష్టము. ఆపత్కాలములో నసురక్షణముకై పనికిరాదగు ధన మాస్యాళీక శోభకై సబ్బుబిళ్లల క్రింద నరిగి నురుగై కరగిపోవును. పోనిండు. అందువలన నితరుల కేమి నష్టము. వంగని ముంగురుల వంచుటకై కాగిదములనో, కారులనో యుపయోగించి పడరాని పాటుల నామె పడనిండు. ముంగురులు వంగకున్నను నలుగురి నవ్వులాటచే నామె తలయే వంగనిండు. అందువలన నితరుల కేమినష్టము! కాని బుద్ధిమంతుడని యనిపించు కొనదలచిన పురుషుడు వాజ్మయమున జేయు ప్రయత్నమట్టిది కాదు. బాహ్య ప్రపంచ జ్ఞానము లేక యాంతర ప్రపంచ జ్ఞానమంతకంటె లేక కవిత్వ మనగనేమో మొదలే యెఱుగక యతి ప్రాస బద్ధమైనదే కవిత్వమని నిశ్చయ పఱచుకొని పామర జనులనెట్లో యొకట్లు రంజింప జేయుటయే ప్రధానోద్దేశముగ జేసికొని యే పాడు ప్రబంధమో యే పాటల నాటకమో ప్రపంచమున నాతడు మెల్లగ జారవిడుచుట తోడనే – ఇంక భాషకు గల్గు ముప్పెంతో జెప్పదరమా? దేశమునకు గల్గు నపకీర్తి యెంతయో నిర్వచింప దరమా? జాతికి గల్గు నగుబాటెంతో చెప్ప వశమా? వాఙ్మయమున కింతకంటె పాషాణ ప్రయోగము మరియేది యుండగలదు! అతడు కవి శిఖామణియని యంతకుదగిన విమర్శకులు కొందఱాతనిని స్తుతుల జేయుచు నాతని యష్టావక్ర శిశువు నభినందింపగనే జనులంద ఱాతని దారినే యవలంబింతురు. ఆతనికంటె లఘుతరముగ బ్రకృతిని బహిరంగముగ దల బగులగొట్టి చంపుదురు. ఇక నెక్కడ జూచిన గవితాగళ బంధములే. ప్రపంచ జ్ఞాన జలద జంఝా మారుతములే. ప్రకృతి కాంతా శిరఃకృతకములే! ఇట్టి గ్రంథములు శీఘ్రముగ నశించిపోక నిలుచునా? నశించును – అట్లే నశింపకుండు నెడల నర ప్రకృతి యట్టె వానర ప్రకృతి లోనికి దిగిపోయి యదియట్టె చతుష్పాత కృతిలోనికి జారిపోయి యదియట్టె యవయవ శూన్య పిండ ప్రకృతి లోనికి గరిగిపోయి జగత్తు వికాస శూన్యమగు ప్రప్రథమావస్థలోనికి వచ్చియుండదా? అట్టి యుపద్రవ మేల సిద్ధింపగలదు. అందుచే నట్టి గ్రంథములు నశించును. కాని చేయదగినంత యపకృతి చేసిన పిదప గదా? ఎల్లకాల మేకీడైన నుట్టి గట్టుకొని యూగులాడునా? కవులు కానివారు కవితను జెప్పినందువలన గలుగు పుట్టిమునుక యిది! కవితా కాలము గడచిపోయినది. ఇప్పుడైన నట్టి యున్మాదము గలవాడు లక్షకుగోటి కెవ్వడైన నుండిన నతడు కవితాగానము చేయవచ్చును. అంతేకాని కవిత్వమున ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించు జనుల సందర్భ గ్రంథముల çసృజించి యకాలపు వెఱులై ప్రకృతి కాపత్తు తెచ్చి పెట్టుట న్యాయమా! మనుజుడగు వాడు తన యభిప్రాయములకు గర్త కర్మ క్రియలు గల సందర్భములగు సహేతుకములగు వాక్యములతో వెల్లడించుట యుచితము. అది యత్యావశ్యకము గూడను. అందుచేత వచన రచన యెక్కువ యుపయోగకారి కాదా? ప్రపంచ మందున్న మహానాగరక దేశము లందెల్లడ వచన గ్రంథములే హద్దు లేకుండ వృద్ధి యగుచున్నవి. కవితాభివృద్ధికి ననాగరకత కెట్టి సంబంధమో గద్యాభివృద్ధికి నాగరకత కట్టి సంబంధము. కావున గాలానుసరణముగ గద్య గ్రంథములే మిక్కిలి యభివృద్ధి నొందవలసినది. అట్లు వానిసంఖ్య యభివృద్ధి నొందుచున్నదా? లేదని చెప్పుటకు లజ్జ పడక తప్పదు. ఎందుచేత? వచన గ్రంథకర్త వట్టి శుంఠయను వెఱి< లోకము నావరించి యున్నది. వచన రచన వలనే కాని భాష యభివృద్ధి నొందదు. దేశమున్నత దశకు రాదు. మనుజులు జ్ఞానయుక్తులు కారు. శాస్త్రములు వ్యాపింపవు. సత్యము ప్రబలదు. అట్టి వచన రచనను మనవారడుగు దొక్కినారు. దాని ననుసరించిన వానిని దీసివేత మనుజుని క్రింద బరిగణించుచున్నారు. కుక్కమూతి పిందె పండితునిగ భావించి త్రుంచివైచు చున్నారు. అట్లు త్రుంపకున్న దల్లిచెట్టు నశించునని యాందోళన పడుచున్నారు. వెలుగుచున్న దీపము నార్పుచున్నారు. వెనుకకు నడుచుచున్నారు. ఇట్లున్నను గాల మాహాత్మ్యముచే కొన్ని వచన గ్రంథములు బయలుదేరక పోలేదు. అవి చాల భాగము నవలలై యున్నవి. వానిలో నితర భాషల నుండి యాంగ్రీకృతములైనవి కొన్ని యున్నవి. ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణధురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. సందర్భ శుద్ధియు, హేతు కల్పనమును, కార్యకారణ సంబంధ జ్ఞానమును గలవాడే కాని యుత్తమ వచన గ్రంథమును వ్రాయజాలడు. అట్టి శక్తులను వన్నెబెట్టి యభివృద్ధి పరచుట యందు గణితము కంటే గద్య రచనయే యెక్కువ శక్తి కలదియై యున్నది. ఉత్తమ వచన గ్రంథము లింక విరివిగ బయలుదేరుట యావశ్యకమై యున్నది. అట్టిలోపమును దీర్చుటకు బుద్ధిమంతులు ప్రయత్నింతురు గాక. పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘వచన రచన’ ఇది. అరసున్నాలు తీయడం మినహా య«థాతథ ప్రచురణ. ‘కవిశేఖర’ పానుగంటి (11 ఫిబ్రవరి 1865 – 1 జనవరి 1940) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బి.ఎ. చదివారు. ‘ఏ ఉద్యోగంలో ప్రవేశించినా తనని పోషించే ప్రభువుకంటే తను చాలా ఎక్కువవాడనని అనుకోవడమే కాకుండా యజమానికి కూడా ఆ భావం కలిగేటట్లు చేసేవారు.’ అందువల్ల ఎన్నోచోట్ల దివానుగా పనిచేశారు, మానేశారు. యువకుడిగా ఆయన్ని షేక్స్పియర్ ప్రభావితం చేశారు. ఆయనన్ని నాటకాలు రాయాలనుకొని 30 నాటకాలు రాశారు. రామాయణాన్ని పాదుకా పట్టాభిషేకము, విజయ రాఘవము, వనవాస రాఘవము, కల్యాణ రాఘవము పేర్లతో నాలుగు నాటకాలుగా రాశారు. రాధాకృష్ణ, కంఠాభరణం, మణిమాల, విప్రనారాయణ చరిత్రము ఆయన ఇతర నాటకాలు. కథావల్లరి, కథాలహరి, హాస్యవల్లరి, విమర్శాదర్శవిమర్శాదర్శము, ప్రకీర్ణోపన్యాసములు ఇతర రచనలు. తెలుగులో పుష్టి కలిగిన వచనం రాసిన కొద్దిమంది రచయితల్లో పానుగంటి ఒకరు. ఆయన ‘సాక్షి వ్యాసాలు’ తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. అందులోని తొలి వ్యాసం 1913లో అచ్చయింది. అయితే, ‘నా కీర్తిని ఎప్పటికైననూ నిలుపునది నా నాటకములే. ఎడమ చేతితో వ్రాసి పాఱవైచిన సాక్షి వ్యాసములు కావు’ అని పానుగంటి అనడం గమనార్హం. -
నూట యాభై యేళ్ల ‘సాక్షి’
కవర్ స్టోరీ ‘సాక్షి’ వ్యాసాల సృష్టికర్త, నాటక రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు నూటాయాభయ్యవ జయంతి సందర్భంగా... ...::: మోదుగుల రవికృష్ణ అది కోలంక సంస్థానం ముఖ్య గ్రామం లక్ష్మీనరసాపురం. దివాణంలో కచ్చేరీ గది. దివాను గారు ఏకాగ్రచిత్తంతో ఏవో కాయితాలు పరకాయిస్తున్నారు. గదిలోకి ఒక పండితుడు ప్రవేశించి ఒక అర్జీ దివాను గారి చేతికిచ్చాడు. తమ వంశం తరతరాలుగా దివాణాన్ని అంటిపెట్టుకొని ఉన్నదనిన్నీ, దివాణం వారి యశోప్రతిష్ఠలకు తమ వంటి పండితులను పోషించడమే కారణమనిన్నీ, జమీందారిణీవారు తనకెన్నో మార్లు ధన సహాయం లోగడ చేసి ఉన్నారనిన్నీ, ఇప్పుడు తన కుమారుని వివాహం తాలూకు యావత్తు ఖర్చున్నూ భరించవలసినదనిన్నీ, అందువలన జమీందారిణీ వారికి శాశ్వత బ్రహ్మలోక నివాసం ప్రాప్తించగలిగినంతటి పుణ్యం లభించగలదనిన్నీ ఆ అర్జీ సారాంశం. దాఖలు చేసిన అర్జీలో విషయాన్ని ఒక్క నిమిషంలో చదివేసి, ఉత్తర క్షణంలో ‘డసుకు బల్ల’పైని సిరాబుడ్డిలో కలాన్ని ముంచి ‘‘ప్రస్తుతం రాణీ వారికి అంత పుణ్యం జరూరుగా అవసరం లేనందున దరఖాస్తు త్రోసి వేయడమైనది’’ అని రాసేశారు దివాను. మరోసారి అదే దివాను గారు సాయంత్రపు వ్యాహ్యాళికి వెళుతుండగా రాజబంధువైన వెలమ దొరగారు ఎదురుపడ్డారు. ఆయన కించిత్ వైద్యుడు. దివాను గారు ‘వైద్యం ఎలా సాగుతున్న’దని కుశలప్రశ్న వేశారు దొర గారిని. ‘ఇప్పుడు వైద్యం మానేశానండీ. కవిత్వం సాధన చేస్తున్నాను’ అని బదులిచ్చేడాయన. ‘‘ఏదైతేనేమి లెండి, జనాన్ని చంపడానికి’’ అని చురకేశాడు దివానుగారు. ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరిగాక ఆశ్రీతుల ఫిర్యాదులు ఎక్కువై రాణీవారు దివానుకు ఉద్వాసన పలికారు. ఆ దివాను పేరు పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులు. ఆయన 11.2.1865 నాడు ప్రభవమొందారు. 1.1.1940 నాడు గతించారు. అంటే ఈ సంవత్సరానికి పానుగంటి జన్మించి 150 యేళ్లు. నిష్ర్కమించి 75 యేళ్లు. పానుగంటి రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో వేంకటరమణయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఆ ప్రాంతంలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యుడు. తల్లి ప్రేమకు ఎక్కువ కాలం నోచుకోలేదు పంతులుగారు. 1888 నాటికి బి.ఎ. పూర్తి చేశారు. ఆ రోజులలో అది చాలా గొప్ప అయినప్పటికీ పానుగంటి వారెక్కడా తమ డిగ్రీ గురించి చెప్పుకోలేదు. పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయునిగా చేరారు. కొత్తపల్లి జగ్గారావు గారనే వెలమదొర ఆహ్వానం మీద వారి పిల్లలకు ట్యూటర్‌గా చేరి హైస్కూల్ ఉద్యోగం మానేశారు. ఇది మొదలు ఎన్ని ఉద్యోగాలలో చేరారో, ఎన్ని మానేశారో! ఏ ఉద్యోగంలో ప్రవేశించినా తనని పోషించే ప్రభువుకంటే తను చాలా ఎక్కువ వాడనని అనుకోవడమే కాకుండా యజమానికి కూడా ఆ భావం కలిగేటట్లు చేసేవారు. ఇది ఉభయులకూ క్షేమం కాదని ఉభయులూ తెలుసుకున్న ఫలితంగా పంతులుగారు నూతన ఉద్యోగ ప్రయత్నం చేయవలసి వచ్చేది. 1910లో ఆంధ్రసాహిత్య పరిషత్ నాల్గవ వార్షిక సభలు బళ్లారిలో జరిగాయి. ఆ సభలకు ‘నరపతి సింహాసనాధీశు’లగు ఆనెగొంది సంస్థానాధిపతి శ్రీరంగదేవరాయలు అధ్యక్షులు. ఆ సమయంలో రాయలకు, పానుగంటికి పరిచయం కలిగింది. పంతులుగారి బహుభాషా ప్రావీణ్యత, చాకచక్యము, సమయస్ఫూర్తి, హాస్యచతురత రాయలను ఆకట్టుకొన్నాయి. శ్రీరంగ దేవరాయలు కూడా సాహితీ ప్రియులు. దత్త మండలాల రెవెన్యూ శాఖలో పంతులుగారి సమీప బంధువు ఢిల్లీ జగన్నాథరావు డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన్ని రాయలు సలహా అడిగారు, పంతులు గారిని దివానుగా తీసుకొంటే ఎలా ఉంటుందని. ఆ మీదట ఆనెగొంది దివాను అయ్యారు పానుగంటి. ఆనెగొంది నిజాం సంస్థానంలో జమిందారీ. అక్కడ ఉర్దూ, పర్షియన్ రాజభాషలు. ఇవి నేర్చుకోకపోతే పని సాగదని శీఘ్రంగా ఆ రెండు భాషలూ నేర్చుకొన్నారు. సంస్థానంలో ముగ్గురు మల్లయోధులు ఉండేవారట. వారి వద్ద సరదాగా మల్లశాస్త్రమూ నేర్చుకొన్నారట. ఇంతా చేసి అక్కడున్నది 15 నెలలు. తరువాత శ్రీకాకుళంలోని ఉర్లాం జమీందారీకి కొద్ది కాలం దివాన్‌గా ఉన్నారు. ఆ కొద్ది కాలంలోనూ కోర్టు వ్యవహారాలను ఒక కొలిక్కి తెచ్చారు. అయినా అక్కడా ఉద్యోగం నిలవలేదు. ఇదంతా పంతులుగారి నిలకడలేనితనం అనుకొంటారేమో? కానేకాదు. భవిష్యత్తులో చాలా నాటకాలు రాయబోయేవాడికి, ఆంధ్ర భాషా సరస్వతికి జిగజిగమెరిసే ఆభరణం ‘సాక్షి’ని సమర్పించబోయేవాడికి, లోకాచారాలలో మత విరుద్ధము, సంఘోపద్రవకరములైన దుష్ర్పవర్తనను బాకా అంత గొంతుతో ఎగతాళి చేయబోయేవాడికి ఎంత లోకానుభవం ఉండాలి, మరెంత దేశం చూసి ఉండాలి, సంఘాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలించాలి! దానికి పూర్వరంగమే పంతులుగారి ఉద్యోగపర్వం. పానుగంటి వారి జీవితంలో పిఠాపురం చివరి జమీందారు మహారాజా శ్రీ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దర్ గారిది ప్రముఖ పాత్ర. సూర్యారావు గారికి పంతులు గారంటే చాలా ఇష్టం, గౌరవం. ఎంత ఇష్టమంటే గులాబీ తోటలో ఒంటరిగా పానుగంటివారితో కులాసాగా గంటల కొద్దీ కబుర్లు చెప్పుకొంటూ తిరుగుతూ ఉండేటంత ఇష్టం. సూర్యారావు పిఠాపురం కోటలో ఎన్నో రకాల గులాబీలతో అందమైన తోటను చేయించారు. ఆ తోటలో ఒక్క పూవు కూడా ఎవరూ కోయకూడదు. మద్రాసులో ఒక బంగళాకు పేరు కూడా ‘గులాబి’ అని పెట్టారు (ఒకప్పటి గులాబి ప్రాంగణంలో ప్రస్తుతం గోకులం కాలనీ ఉన్నది). అటువంటి తోటలో పానుగంటివారితో గడపడమే కాకుండా వీడ్కోలు సమయంలో ఒకటిరెండు పువ్వులు స్వయంగా తుంచి ఇచ్చేవారు. సూర్యారావు గారికి రాజ్యానికి రాకముందే పానుగంటి వారితో పరిచయం ఉంది. ఆయన సంస్థాన వారసత్వ దావాలో ఉన్నారు. ఈయన రకరకాల చోట్ల ఉద్యోగాలలో స్థిరత్వం లేకుండా ఉన్నారు. ఇద్దరికీ స్థిమితం చిక్కాక దివాన్గానో, అసిస్టెంట్ దివాన్గానో పానుగంటి వారిని ఆహ్వానించారు సూర్యారావు. ఇప్పటివరకూ సేవ్యసేవక సంబంధంతో విసిగిపోయిన పంతులుగారు స్నేహ సంబంధం కోరుకున్నారు. ఫలితంగా పిఠాపుర సంస్థాన నాటక కవి పదవి లభించింది. చేయవలసిన పని రాజావారికి ‘‘మిగుల నవ్వు పుట్టించు నాటకములు చేయుట’’, హాస్య ప్రసంగాలతో ఉల్లాసం కలిగించుట. ఇప్పటికి పంతులుగారికి కుదిరిక లభించింది. పిఠాపురంలో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న మేడలో నివాసం ఏర్పడింది. శరపరంపరగా అటు నాటకాలు, ఇటు వ్యాసాలు, ఎడాపెడా గ్రాంథిక భాష సమర్థన, వ్యావహారిక భాష నిరసన మొదలయ్యింది. పానుగంటి వారు బి.ఎ. చదివేటప్పుడు షేక్స్పియర్ ఆయనను ప్రభావితం చేశాడు. షేక్స్పియర్ రాసినన్ని నాటకాలు తానూ రాయాలని యువకోత్సాహంలో ప్రతిజ్ఞ చేశాడు. అనుకొన్నట్టే 30 నాటకాలూ రాశారు. వాటిలో కనీసం పదిహేనన్నా ఉత్తమ తరగతికి చెందినవి. పానుగంటి వారు మాధ్వలైనా విశిష్టాద్వైతం వైపు మనసు మొగ్గింది. రాముడు, రామాయణం వారి జీవాతువులు. అందుకే రామాయణం మొత్తాన్ని పాదుకా పట్టాభిషేకము, విజయ రాఘవము, వనవాస రాఘవము, కల్యాణ రాఘవమను పేర్లతో నాలుగు నాటకాలుగా రాశారు. వారి నాటకాలతో భక్తిరసం పరాంకోటినందుకొన్నది రాధాకృష్ణ నాటకంలో. నిలువెల్లా హాస్యం నిండి ఉన్నది కంఠాభరణం నాటకంలో. రంగస్థలంపై ఆదరణ చూరగొన్నది పాదుకా పట్టాభిషేకం. వీరి నాటకాలలో ఎక్కువ భాగం ప్రదర్శనకు అనుకూలంగా ఉండవని రంగాభిజ్ఞుల అభిప్రాయం. వీటికంటే ఇప్పుడు పంతులుగారి ప్రతిష్ఠను నిలబెడుతున్నవి సాక్షి వ్యాసాలు. అయితే వాటి మీద పంతులు గారికి చిన్నచూపు ఉండటం చిత్రం. ‘‘సంఘదురాచార నిర్మూలన కరంబులును, పండిత పామర జనరంజకంబులును, సరస హాస్యాద్భుత రసమయంబులును, గంగా ఝరీ ప్రతీకాశ ధాటీ విరాజితంబులును, అమృత మాధురీ ధురీణంబులును, అపూర్వ భావ భాసురంబులును, జ్ఞాన దాయకంబులును, హర్ష దాయకంబులును’’ అగు సాక్షి వ్యాసాల గురించి పంతులు గారేమన్నారో తెలుసా? ‘‘నా కీర్తిని ఎప్పటికైననూ నిలుపునది నా నాటకములే. ఎడమ చేతితో రాసి పాఱవైచిన సాక్షి వ్యాసములు కావు’’ అన్నారు. సినిమాల్లో తండ్రిచే వెళ్లగొట్టబడిన కొడుకే చివర రెండు రీళ్లలో తండ్రిని ఆదుకొన్నట్లు పంతులుగారిని ఇంకా సంఘం మరచిపోలేదంటే కారణం వారు నిరాదరణ చూపిన సాక్షి వ్యాసాలే. ఇవి ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రతి శనివారం పడుతుండేవి. వీటి ప్రచురణ వెనుక చిన్నకథ ఉంది. శతక కవుల చరిత్రకారుడు వంగూరి సుబ్బారావు పానుగంటి వారికి స్నేహితుడు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి సన్నిహితుడు. ‘‘మన పత్రికకు ఏదైనా రాయకూడదా’’ అని నాగేశ్వరరావు గారు సుబ్బారావుని అడిగారు. ‘‘ఇది వరలో సువర్ణలేఖ పత్రికలో (ఇది తణుకు నుండి వెలువడేది. పానుగంటి వారి మేనల్లుడు ద్రోణంరాజు వెంకట రమణారావు సంపాదకుడు) సాక్షి వ్యాసాలు పడుతుండేవి కదా. నా స్నేహితుడు రాశాడవి. వాటిని మన పత్రికలో పునఃప్రారంభించుదామని అడుగుదాము’’ అన్నారు. కాశీనాథునికి పానుగంటివారంటే దురభిప్రాయం లేదు కానీ సదభిప్రాయం మాత్రం లేదు. నోరు, కలమూ రెండూ దురుసనీ, మొండి మనిషనీ, పైగా సంస్థానం సర్వీసులో ఉన్నవాడు సమయానికి ‘మేటరు’ పంపుతాడా అని నాగేశ్వరరావుగారి సందేహం. సుబ్బారావు ఇద్దర్నీ వొప్పించారు. అలా సువర్ణలేఖలోనూ, ఆంధ్రపత్రికలోనూ కలిపి 143 వ్యాసాలు రాశారు పానుగంటి. సాక్షి వ్యాసాల పద్ధతిని, ఉధృతిని పేరాలలో వర్ణించడం కంటే శ్రీశ్రీ పదాలను స్మరించడం మేలు. లక్ష్మీనరసింహారావు పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి ఎంచేతంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియ్యడం నేనుగంటి. పంతులుగారు మనస్తత్వశాస్త్రం బాగా చదివారు. వ్యాకరణం, తర్కం, జ్యోతిష్యం, ఆయుర్వేదం మరింత బాగా తెలుసు. అందుకే ఆయన నాటకాలలో, సాక్షి వ్యాసాలలో ఆయా శాస్త్రాల సంగతులు గాలి కబుర్లలా కాకుండా సంప్రదాయవేత్తలా ప్రశంస తెస్తారు. అదే సమయంలో వాటిలో ఉండే వైరుధ్య అంశాలను ప్రస్తావించి ఎగతాళి చెయ్యకా మానరు. 1911 నుండి 1930 వరకు ఆయనకు యోగకాలం. రెండవ శ్రీనాథుడా అన్నట్లు బతికారు. ఖర్చుకు పిఠాపురంలో కోట తరువాత పంతులుగారి మేడే అని వాడుక వచ్చింది. కాలాంతరంలో సూర్యారావుగారికి, పంతులుగారికి విభేదాలు పొడసూపాయి. దీనికి పంతులుగారి నాలుకవాడి ప్రధాన కారణం. నెలకు 120 రూపాయల జీతం, దసరా ఉత్సవాలలో 116 రూపాయల యీనాం, రాజ కుటుంబంలో శుభకార్యాల సమయంలో 1116 రూపాయల ప్రత్యేక బహుమానం పానుగంటికి అందేవి. ఇవి కాక పంతులు గారి పుస్తకాలన్నీ రాజావారే అచ్చు వేయించి 100 ప్రతులు తాను తీసుకొని 900 ప్రతులు పంతులుగారికిచ్చేవారు. హఠాత్తుగా ఈ మర్యాదలన్నీ తగ్గిపోయాయి. వేతనం 60 రూపాయలయ్యింది. అది కూడా లోగడ ఎప్పుడో తీసుకొన్న మొత్తానికి సగం విరగ్గొట్టబడి 30 రూపాయలు చేతికి వచ్చేవి. ఆ 30తో కూడా ఆ రోజులలో బాగానే వెళ్లదియ్యవచ్చు. కానీ ఖర్చుకి అలవాటుపడిన చెయ్యి ఊరుకొంటుందా? ఈ సంక్షోభంలో ఉన్మాదం కలిగింది. అందుకే సాక్షి వ్యాసాల చివరి భాగాలలో ఉన్మత్తుని ఉపన్యాసాలు ఎక్కువగా ఉంటాయి. గిరీశం గురజాడ ప్రతిరూపం అంటుంటారు. పంతులుగారి కంఠాభరణం నాటకంలో కృష్ణారావు పాత్ర తన గురించి ఇలా చెప్పుకొంటాడు. ‘‘నా మనస్సునందన్ని రసములున్నవి. సదాచారమున్నది. వ్యభిచారమున్నది. భక్తియున్నది. రక్తియున్నది. వైరాగ్యమున్నది. పామరత్వమున్నది. నా మనస్సృష్టి వైఖరి యట్టిది’’. ఈ విధమైన ద్వంద్వ వ్యక్తిత్వం పంతులుగారిలో పుష్కలంగా ఉంది. కృష్ణారావు పాత్రలోనే కాక దశరథ పాత్రలో కూడా పంతులుగారు కనిపిస్తారు. పిల్లలంటే అమిత ప్రేమ. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. సంతానాన్ని విడిచి ఉండలేని ప్రేమ వారి ఎదుగుదలకు ఆటంకమయ్యింది కూడా. రాజావారి అనుగ్రహం తప్పిన తరువాత వారి సప్తతి ఉత్సవం 1935, ఏప్రిల్ 28న పిఠాపురంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి అధ్యక్షతన తూతూమంత్రం కంటే కాస్త వైభవంగా జరిగింది. అప్పటికి వారి మానసిక పరిస్థితి అదుపు తప్పి ఉంది. కుటుంబ వ్యవహారాలు తల్లకిందులయ్యాయి. అటువంటి స్థితిలో కూడా సహజ హాస్యధోరణిని ఆయన వదిలిపెట్టలేదు. ఉత్సవాలలో ఏవో బహుమతులు ఇవ్వబోతుంటే ‘‘ఉన్న ఒక మతిపోయి నేనేడ్చుచున్న ఈ సందర్భములో బహు‘మతు’లేల?’’ అని చమత్కరించారు. ‘వేళాకోళాల పంతులు’, ‘వెక్కిరింపుల పంతులు’ అని సమకాలీనులు చాటుమాటుగా సణుక్కొన్న పానుగంటి లక్ష్మీనరసింహారావు గురించి నేను రేఖా మాత్రంగా పరిచయం చేస్తున్నాను. వారి రచనలు చదివి సంఘ సంస్కరణ ప్రియత్వం, స్త్రీ జనాభ్యుదయ కాంక్ష, విద్యాసాంస్కృతిక రంగాలలో అభివృద్ధి జరగాలనే కోరిక, పాశ్చాత్య నాగరికతా వ్యామోహానికి గురికాకూడదనే హెచ్చరిక, మాతృభాషాభిమానం, స్వస్థాన వేషభాష ప్రియత, కుహనా దేశభక్తులను దుయ్యబట్టడం, సత్ప్రవర్తన పెంచుకోవాలని ఆశించడం, బాహ్యాడంబరాలు కాకుండా అంతశ్శుద్ధితో కూడిన దైవభక్తి ఉండాలనే వాంఛ; తదితరమైన పంతులుగారి ఉత్తమ భావజాలాన్ని రసజ్ఞులైన పాఠకులు గ్రహిస్తారని ఆశపడుతున్నాను. (వ్యాసకర్త తెలుగు లెక్చరర్. ఈయన సంపాదకత్వంలో కథకుడిగానూ పానుగంటి ప్రతిభను వెల్లడించే పుస్తకాన్ని ‘మిత్రమండలి’ ప్రచురిస్తోంది.) తిరిగి అప్పజెప్పిన శతకం పంతులుగారికి అఖండమైన జ్ఞాపకశక్తి ఒక వరం. కొత్తపత్తి జగ్గారావు గారింట్లో వారి పిల్లలకు ట్యూటరుగా ఉండే రోజులలో, ఒక కవి వచ్చి, తాను రాసిన శతకాన్ని జగ్గారావు గారికి వినిపిస్తున్నాడు. పిల్లలకు పాఠం చెబుతున్న పంతులుగారు ఒక చెవి ఇటు వేసి ఉంచారు. కొద్ది రోజులకు కవి వచ్చి ‘‘అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు, దానితో పాటు శతకమూ తగలబడిపోయాయని గోడు మన్నాడు. పంతులుగారు ఓదార్చి ఆనాడు తాను విన్న శతకాన్ని తిరిగి చెబుతూ కవి చేత రాయించారట. కూచి నరసింహ గారు పిఠాపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, పానుగంటి వారికి ప్రాణ స్నేహితుడు. ఒకసారి ఇద్దరూ మద్రాసులో అనిబిసెంట్ ఉపన్యాసం విన్నారు. బసకు వచ్చిన తరువాత కూచివారు అనిబిసెంట్ ఉపన్యాసాన్ని ఒకటే పొగడుతూ మరలా ఆ ఉపన్యాసం వింటే ఎంత బాగుండునని అనుకొంటుంటే ఆయన్ని కూర్చోబెట్టి పానుగంటి వారు పొల్లుపోకుండా ఆ ఉపన్యాసం అంతా అప్పచెప్పి ప్రాణమిత్రుణ్ని సంతోషపెట్టారట. పానుగంటి మేధోసృష్టి ‘సాక్షి’ సంఘం సత్యపురంలో (ఈ ఊరెక్కడుందో పానుగంటికి మాత్రమే తెలుసు) తపాలా కచేరీకి ఎదురుగా, పరీధావి సంవత్సర మాఖ బహుళ చతుర్దశీ శివరాత్రి గురువారం నాడు లింగోద్భవ కాలంలో (క్రీ.శ. 6.3.1913) సాక్షి సంఘాన్ని పానుగంటి ఆవిర్భవించేశారు. అంటే ఆ రోజు సువర్ణలేఖ పత్రికలో తొలి సాక్షి వ్యాసం అచ్చయిందన్నమాట. నేటికి నూట రెండేళ్ల క్రితం. చిత్ర విచిత్రాతివిచిత్ర మహా విచిత్రములైన ప్రాపంచిక చర్యలను విమర్శించి చూపడానికి, మన మెట్లా ఉన్నామో మనకు చెప్పడానికి, పుట్టిందీ సాక్షి సంఘం. ఇందులో సభ్యులు ఐదుగురు. మొదటివాడు కాలాచార్యులు. ప్రాణాల మీద తీపి వల్ల ఏ వనితా వివాహం చేసుకోకపోవడం వల్ల ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. సత్ప్రవర్తన కలవాడు. యధార్థ వాది. రెండవవాడు జంఘాల శాస్త్రి, సాక్షి సంఘ ప్రధాన ఉపన్యాసకర్త, శరీరంలో మిగతా అవయవాలు లేవు. ఉన్నదొక్కటే, నోరు... అనుకొనేంత వాచాలుడు. కాలినడకనే దేశమంతా తిరిగాడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఈ లక్షణాలన్నీ పానుగంటివే. మూడవవాడు వాణీదాసుడు. కవి. శ్లేష కవిత్వం అంటే ప్రాణం. నువ్వుగింజ మీద నూరు పద్యాలు అల్లగలిగాడు. ఆదికవి నన్నయ నుండి ఆధునిక కవి నన్నా సాహేబు వరకు ఏ కవినైనా దూషించగల అసూయాపరుడు. నాలుగో వాడు బొఱ్ఱయ్యపెట్టి. ఒకప్పుడు ధనికుడే కానీ ప్రస్తుతం ఏమీ లేదు. గుమ్మంలో పట్టనంత లావు. అందుకని ఎప్పుడూ సాక్షి కార్యాలయానికి రాలేదు. అయిదవ సభ్యుడు సాక్షి. తానెవరో తనకు తెలుసుకాని స్పష్టంగా ఇతరులకు చెప్పగలిగినంత ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల తన పరిచయాన్ని ఇవ్వలేకపోయాడు. ఇతర సభ్యులు మాత్రం సాక్షిని మిత్రునిగా, తమకు అధికారిగా అంగీకరించారు. ఈ అయిదుగురిలో చురుకైన కార్యకర్త జంఘాలశాస్త్రే. ఈ శాస్త్రిని అడ్డం పెట్టుకుని పానుగంటి సంఘాన్ని ఒక దులుపు దులిపారు. ఆశుకవుల వ్యర్థ పటాటోపం, వర్తకుల మోసం, మతంలో అసలు విషయాన్ని మరచిపోయి బాహ్యాడంబరాల కోసం వెంపరలాడే స్వభావం, అసమర్థులైన వైద్యుల డంబం, తిమ్మిని బమ్మి చేయగల న్యాయవాదుల వైఖరి, వేషం, జాతి, నీతిలో కనబడుతున్న వెలితి, విజాతీయ వ్యామోహం, పనికిమాలిన అనుకరణాభిలాష, వీటన్నింటినీ నవ్వు వచ్చేలాగా గాయాన్ని మాన్పే మందు కత్తికే రాసి కొట్టినట్టుండే శైలిలో అధిక్షేపించారు పానుగంటి. పానుగంటి ఎంత మోమాటం లేని మనిషంటే మొదటి వ్యాసంలో ‘‘మీకు మావలని ప్రతిఫలమేమియును లేదు. సరికదా, మీ పత్రికా వ్యాపారము తిన్నగ నుండకుండు నెడల మిమ్ములను గూడ మీ పత్రికలో నధిక్షేపించుచుందుము’’ అని హెచ్చరించారు. ఆ పత్రికాధిపతి ఎంతటి సరసుడంటే ఆ మాటలను ఒక్కక్షరం మార్చకుండా వేశారు.