breaking news
Panchayat raj Office
-
తెరపైకి డిప్యూటేషన్ల ‘పంచాయితీ’!
– ప్రజాప్రతినిధుల పంచన అక్రమార్కులు – అరకొర పనుల్లో కూడా నాణ్యతకు తిలోదకాలు – చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు ఒక డీఈ రాయదుర్గానికి బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో డిప్యూటేషన్‌పై ఉన్న డీఈ నేటికి అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. శాఖ ఉన్నతాధికారులు డిప్యూటేషన్‌పై వెళ్లిన డీఈని తన స్థానానికి పంపకుండా చోద్యం చూస్తున్నారు. ఇక ఎస్ఈ పీఏగా విధులు నిర్వహించాల్సిన వ్యక్తి తాడిపత్రి, శింగనమల ప్రాంతాలకు డీఈగా వ్వవహరిస్తున్నారు. ఇది కేవలం ఏ ఇద్దరి, ముగ్గురి సమస్య కాదు...ఈ శాఖలో కాసులు కోసం ఎక్కడిదాకైనా వెళతారనడానికి ఇవే నిదర్శనం. అనంతపురం సిటీ : పంచాయతీరాజ్‌శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల గోల మొదలైంది. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ గాడితప్పుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేతల పంచన చేరి అందిన కాడికి దండుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో జేబులు నింపుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ‘అనంత’లో ఈ దోపిడీ తారస్థాయికి చేరింది. పాలకుల స్వార్థం, కొందరు అధికారుల కక్కుర్తి వెరసి నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగుల్లో బలమైన సామాజిక వర్గానిదే ఇక్కడ పెత్తనం సాగుతోంది. సామాన్య ఉద్యోగులు నోరు మెదపలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నేతల పంచన అక్రమార్కులు ప్రజాప్రతినిధుల పంచన చేరి కొందరు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తూ కావాల్సిన చోటుకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కింది స్థాయి సిబ్బంది మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతగా అంటే ఒకరినొకరు కొట్టుకునేందుకు వెనకాడని స్థాయికి దిగజారిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కూడా డిప్యూటేషన్లపై వెళ్లాలని పట్టుబడుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధికారులు నేతల పంచన చేరి పనుల్లో పర్సేంటేజీల శాతాన్ని ఎక్కువ మొత్తంలో పంచుకుతినేందుకు అలవాటుపడ్డారు. వీరు పనులు ఎక్కడ జరిగితే...అక్కడికి వాలి పోతారు. ఏ స్థానానికి వెళ్లాలన్నా స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోవడమే వీరికి పెట్టుబడి. అనంతరం టెండర్లు వేయించడం మొదలు.. పనులను అతి తక్కువ ఖర్చులో ఎలా ముగించాలో కూడా వారే నేతలకు సూచిస్తారు. కాకపోతే వాటాల్లో తేడాలుంటాయి. తాజాగా ఈ డిప్యూటేషన్ల విషయంలో ఓ ప్రజాప్రతినిధి డీఈ స్థాయి అధికారిని కార్యాలయానికి వచ్చి మరీ బెదిరించారని తెలిసింది. తాను సూచించిన వారిని డిప్యూటేషన్ పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. నాణ్యతకు తిలోదకాలు ఈ శాఖ పరిధిలో జరుగుతున్న, జరిగిన రహదారుల నిర్మాణాల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం వేసిన రహదారులు కూడా గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యంగా మారాయి. కోట్లాది రూపాయల నిధులను ఇలా దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుకునే సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్ స్థాయి అధికారులు ఈ శాఖవైపు దృష్టి సారించడం అరుదుగా ఉంటుంది. ఇక ఏసీబీ, విజిలెన్స్ అధికారుల పనితీరు కూడా ఈ శాఖపై పెద్దగా ప్రభావితం చేయడం లేదు. చాలా విషయాల్లో విజిలెన్స్ అధికారులను సైతం సర్దుబాటు చేసిన ఆరోపణలున్నాయి. కొసమెరుపు: డిప్యూటేషన్లను రద్దు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు చేసి రెండు నెలలు కూడా గడవక ముందే మళ్లీ డిప్యూటేషన్ల గోల మొదలు కావడం కొసమెరుపు. -
శిథిలావస్థలో కల్వర్టులు
కొండాపూర్, న్యూస్‌లైన్: కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికారులు మొద్దునిద్ర వీడడంలేదు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా నుంచి మునిదేవునిపల్లి వరకు ప్రమాదకరంగా నాలుగు కల్వర్టులు ఉన్నాయి. పెద్దాపూర్ నుంచి మారెపల్లి వరకు రెండు కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ రోడ్డుపై ఉన్న ఈ కల్వర్టుల మీదుగా ప్రతిరోజు మల్లెపల్లి శివారులోని పరిశ్రమల భారీ వాహనాలు సదాశివపే ట, సంగారెడ్డి పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు రాత్రింబవళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో మళ్లీ యధాస్థితికి వస్తున్నాయి. ఇదిలా ఉండగా మండలానికి రెగ్యులర్ పీఆర్ ఏఈ లేకపోవడంతో పంచాయతీరాజ్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డివిజన్, జిల్లాస్థాయి అధికారులు సైతం మండలంలో పర్యటించిన దాఖలాలు లేవు. ఇన్చార్జి పీఆర్ అధికారులతో ఇబ్బందులు 2010 నుంచి నేటి వరకు అధికరులు తరుచూ బదిలీలు ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించడంతో పంచాయతీరాజ్ పనులు సరిగ్గా చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు అధికారులు మండల పీఆర్ బాధ్యతలు నిర్వహించారు. ఏడాదిలో ఇద్దరు మార్పు చెందడంతో పనులు నత్తనడకన సాగడమే కాకుండా పర్సెంటేజ్‌లు తీసుకుని నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 2013 ఫిబ్రవరి 5 వరకు శశికుమార్ ఏఈగా పనిచేశారు. 6 నుంచి రత్నం 8 నెలల పాటు ఇన్చార్జిగా పనిచేశారు. అకస్మాత్తు గా రత్నంను ఇన్చార్జి బాధ్యతల నుంచి తొల గించగా ఓ నెలపాటు తిరిగి శశికుమార్ ఇన్చార్జి బాధ్యతలు చూశారు. ప్రస్తుతం సదాశివపేట పీఆర్ఏఈ మధుకర్ 1 డిసెంబర్ 2013 నుంచి ఇన్చార్జి పీఆర్ఏఈ బాధ్యతలు చూస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో హరిసింగ్‌ను వివరణ కోరగా మండలంలో పీఆర్‌ఏఈలు ఇన్చార్జిలుగా ఉండటంతో ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమన్నారు. పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్ఏఈ రికార్డులు నమోదు చేస్తామన్నారు.