breaking news
paka ssuresh
-
టీడీపీకి షాక్.. కడప మేయర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్‌గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. సభ్యులంతా పాకా సురేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి మెజార్టీతో సురేష్ ఎన్నికయ్యారు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది. ఇక, కడప మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నంచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. కాగా, కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పారీ్టలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది.వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్‌బాషా, మాజీ మేయర్ కె సురేష్‌బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి శృంగ భంగం... కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబ్దిపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. కానీ, అవేవీ సఫలం కాకపోవడంతో అధికార కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. -
వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పై హత్యాయత్నం
కడప: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి టీడీపీ హత్యా రాజకీయాలకు తెగబడుతోంది. కడప 46 డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ పై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి వర్గీయులు సోమవారం దాడి చేసి హతమార్చేందుకు యత్నించారు. ఇనుప రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో సురేష్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేష్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆ వెంటనే ఆయన సొంత గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు గత కొంత కాలంగా సురేష్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇంటి వద్ద స్కార్పియోలో నిఘా పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదే అంశాన్ని గమనించి గతంలో జిల్లా ఎస్పీకి కూడా తనకు ప్రాణహాని ఉందంటూ సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విన్నవించారు. రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అయినా టీడీపీ ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. కడప కార్పొరేషన వద్ద ఉన్న సురేష్ పై బీటెక్ రవి వర్గీయులు దారుణంగా దాడిచేశారు. డిఎస్పీ కార్యాలయం పక్కనే ఈ దాడి జరగడం గమనార్హం.


