breaking news
P Vijaya
-
సింధు పేరెంట్స్ ఏమన్నారంటే..
-
సింధు పేరెంట్స్ ఏమన్నారంటే..
తన కూతురు సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు. భవిష్యత్తులో తన కూతురు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయుల విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అయితే ప్రత్యర్థిపై తొలి గేమ్ సింధు గెలిచినా ఆమెపై గెలుపు అంత సులువుకాదని మరోసారి పీవీ రమణ ప్రస్తావించారు. బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు కాస్త నెర్వస్‌గా కనిపించిందని ఆమె తల్లి విజయ అన్నారు. కచ్చితంగా సింధు స్వర్ణం నెగ్గుతుందని భావించామని, అయితే అనవసర తప్పిదాలు చేయడం వల్లే కూతురు స్వర్ణం సాధించలేక పోయిందని పేర్కొన్నారు. సింధు తల్లి విజయ మీడియాతో మాట్లాడుతూ.. 'శారీరకంగానూ కాస్త అలసిపోవడం సింధు ఆటపై ప్రభావం చూపింది. మొదట్లో మెరుగ్గానే ఆడినా చివరికొచ్చే సరికి కాస్త టెన్షన్ పడ్డట్లు కనిపించింది. మరో ప్రయత్నంలో కచ్చితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గుతుంది' అని ఆశాభావం వ్యక్తం చేశారు. కూతుళ్లను కనడం భారమని భావించే తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇకనుంచి మార్పు వస్తుందని, తన కాన్పు సమయంలో కూతురే పుట్టాలని కోరుకున్నట్లు పుత్రికోత్సాహంలో ఉన్న ఆమె తెలిపారు. -
'సింధు తప్పకుండా గెలుస్తుంది'
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో తమ కుమార్తె పతకం సాధిస్తుందని బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సింధు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 'కచ్చితంగా సింధు గెలవాలని కోరుకుంటున్నాం. ఆమెతో మాట్లాడాను. ఆటపైనే దృష్టి పెట్టమని చెప్పాను. సెమీఫైనల్లో ఆమె విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. పతకంతో తిరిగొస్తుందన్న విశ్వాసంతో ఉన్నామ'ని రమణ అన్నారు. తమ కుమార్తె సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. తాను ఆడిన మొదటి ఒలింపిక్స్ లోనే సింధు సెమీఫైనల్ చేరడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజోమి ఒకుహరాతో తలపడనుంది. అయితే ఒకుహరా కేడా మంచి ప్లేయర్ అని, ఆమెతో మ్యాచ్ అంత ఈజీ కాదని రమణ పేర్కొన్నారు. రేపు ఎవరు బాగా ఆడతారనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుంటాయని చెప్పారు.