breaking news
Overseas Jobs
-
విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త
మోర్తాడ్(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) శుభవార్త అందించింది. ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో భాగంగా విదేశాల్లోని కంపెనీలకు, వలస కార్మి మకులకు ప్రభుత్వరంగ సంస్థనే మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గతంలో కేవలం గల్ఫ్ దేశాల వీసాలను ఇప్పించిన టామ్‌కామ్ కొన్ని నెలల నుంచి పాశ్చాత్య దేశాల్లోనూ యువతకు ఉపాధి బాటలు వేస్తోంది. ఇజ్రాయెల్, జర్మనీ వీసాల జారీతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిన టామ్‌కామ్ తాజాగా సౌదీ అరేబియా, గ్రీస్, సింగపూర్ దేశాల్లో ఉపాధి చూపనుంది. ఆసక్తి ఉన్నవారు టామ్కామ్ను సంప్రదిస్తే అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. సౌదీ అరేబియాలో వేర్‌హౌజ్‌లలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ చదివిన అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్ నాలెడ్జి ఉండాలని టామ్‌కామ్ సూచించింది. 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులకు వేర్‌హౌజ్‌లలో ఉపాధి కల్పించనున్నారు. మన కరెన్సీలో రూ.40 వేల వేతనం ఉచిత వసతి, రవాణా సదుపాయం కూడా కంపెనీనే కల్పిస్తుంది. అభ్యర్థులకు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు తప్పనిసరి అనే నిబంధన ఉంది. గ్రీస్‌లో ఉపాధి పొందాలనుకునే మహిళలకు హౌస్‌కీపింగ్, బార్ అండ్ రెస్టారెంట్లలో వెయిటర్లుగా పనిచేయడానికి యువతీ యువకులకు అవకాశం ఉంది. మన కరెన్సీలో రూ.1.02 లక్షల వేతనం వస్తుంది. అభ్యర్థుల వయస్సు 18–45 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మగవారికైతే ఎల్రక్టీషియన్, కార్పెంటర్, ప్లంబర్, టైల్స్, మార్బుల్ మేషన్లకు ఉపాధి కల్పిస్తారు. వీరికి కూడా వేతనం రూ.1.02 లక్షల వరకు ఉంది. గార్డెనింగ్, క్లీనర్లుగా పని చేసేవారికి రూ.88 వేల వరకు వేతనం చెల్లిస్తారు. గ్రీస్‌లో కార్మిక చట్టాలను అనుసరించి ఓవర్‌టైం పని కల్పించనున్నారు.చదవండి: చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం సింగపూర్‌లో ప్లాస్టర్ మేషన్, స్టీల్ ఫిక్సర్ రంగాల్లో కూడా ఉపాధి కల్పిస్తారు. ఆయా రంగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు 45 ఏళ్ల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని టామ్‌కామ్ వెల్లడించింది. మన కరెన్సీలో రూ.29 వేల నుంచి రూ.31 వేల వేతనం చెల్లిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు టామ్‌కామ్ ఈమెయిల్‌కు వివరాలను పంపించాల్సి ఉంటుంది. టామ్‌కామ్ కార్యాలయమున్న ఐటీఐ మల్లెపల్లి హైదరాబాద్ క్యాంపస్‌లో స్వయంగా 94400 50951/49861/51452 నంబర్లలో సంప్రదించవచ్చని జనరల్ మేనేజర్ నాగభారతి వెల్లడించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ టామ్‌కామ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఎలాంటి మోసానికి తావు ఇవ్వకుండా వీసాల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నర్సులకు నెలకు రూ.2.50 లక్షల జీతం!
సాక్షి, చెన్నై/తిరువొత్తియూర్: విదేశాలలో రూ.2.50 లక్షల వేతనంతో పనిచేసేందుకు అర్హులైన నర్సులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్థ డైరెక్టర్ మహేశ్వరన్ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లండ్‌లోని ఆస్పత్రులలో నెలకు రూ. 2 లక్షల మొదలుకొని రూ. 2 లక్షల 50 వేల వరకు జీతంతో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయిన మేల్ /ఫిమేల్ నర్సులు 500 మంది అవసరం ఉందన్నారు. అదే విధంగా.. పదవ తరగతి పరీక్ష పాస్ అయిన వారు 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 వయస్సు వరకు ఉన్న వారు ఐసీసీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు కువైట్‌లో పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు. అలాగే నెలకు రూ. 27 వేల నుంచి రూ.34 వేల వరకూ జీతంతో పనిచేయుటకు సౌదీ అరేబియాలోని హోటల్స్‌లో వంట మనిషి (పురుషులు) కావాల్సి ఉందన్నారు. ఇక కువైట్‌లో ఇంటి పనులు చేయుటకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అవసరమని వీరికి నెలకు రూ.29,640 మొదలుకొని రూ. 32 వేల వరకు జీవం అందజేస్తారన్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, ఐటీఐ, ఫిట్టర్ పాసైన (22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారు) క్యాస్టింగ్ / ఇన్స్పెక్షన్ /మెకానిక్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఓమెన్ దేశంలో ఖాళీలు ఉన్నాయన్నారు. వారికి నెల రూ. 29 వేలు అందుతుందని తెలిపారు. జీతం కాకుండా విదేశాలలో పని చేసేవారి వారికి భోజనం, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, విమాన టికెట్లను ఆయా దేశ ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేచేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు www.omcmanpower.com వెబ్సైట్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను విదేశీ ఉపాధికల్పన సంస్థలు 0 4 4 2 2 5 0 5 8 8 6 /22 502267 అనే ఈ నంబర్ల ద్వారా తెలుకోవచ్చన్నారు. కాగా ఈ విదేశీ ఉపాధి కల్పన సంస్థ ఇప్పటి వరకు 10,350 మందిని వేరువేరు దేశాలకు ఉద్యోగులకు పంపించినట్లు పేర్కొన్నారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
టామ్‌కామ్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు
- వరంగల్ మెగా ఉద్యోగ మేళాలో మంత్రి నాయిని వరంగల్: విదేశాలల్లో ఉద్యోగాలు చేయగోరేవారు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ను మాత్రమే సంప్రదించాలని, ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోపడి మోసపోవద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి బుధవారం వరంగల్‌లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదనే విమర్శలు అర్థరహితమన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని నాయిని అన్నారు. ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
విదేశీ ‘కొలువు’దీరేందుకు మార్గాలు...
‘స్టడీ అబ్రాడ్’ అంటే.. సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి గుర్తొచ్చే పదం. ఇందుకోసం గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే కసరత్తు మొదలుపెడతారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో కాలు మోపేందుకు సన్నద్ధమవుతారు. ఇటీవలకాలంలో స్టడీ అబ్రాడ్తోపాటు బాగా ప్రాచుర్యం పొందుతున్న మాట.. ‘జాబ్స్ అబ్రాడ్’! అంటే.. విదేశీ ఉద్యోగాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాయి. అవసరమైన మానవ వనరుల కోసం విదేశీ అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ కొలువులపై స్పెషల్ ఫోకస్.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులకు మంచి ఆదరణ లభిస్తోంది. కష్టపడి పనిచేసే తత్వం.. త్వరగా స్థానిక పరిస్థితులతో ఇమడగలిగే నేర్పు.. ఇంగ్లిష్‌పై పట్టు.. విదేశాల్లో భారతీయులకు అవకాశాలు పెరగడానికి కారణమన్నది నిపుణుల అభిప్రాయం. అనేక దేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.. లో-స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ప్రొఫెషనల్ స్కిల్స్ పేరుతో దిగువ స్థాయి మొదలు.. ఆయా రంగాల్లో అనుభవం గడించిన మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ వరకూ.. ఎన్నో విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ డెస్టినేషన్స్ సాధారణంగా ‘విదేశీ’ లక్ష్యం ఎంచుకున్న వారికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు తొలి ప్రాధాన్యంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల అక్కడి సంస్థల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ ఆశించడం కొంత కష్టంతో కూడుకున్న విషయం. ఇదే సమయంలో అంతే స్థాయిలో ఆదాయార్జనకు మార్గం వేసే క్రమంలో మరెన్నో దేశాలు ఉద్యోగాల పరంగా బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. పొరుగు దేశం చైనా మొదలు ఆఫ్రికా వరకు భారతీయులకు అవకాశాలు కల్పించడంలో ముందుంటున్నాయి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న చైనా.. విదేశీ ఉద్యోగులను ఆకర్షించడంలో ముందుంటోంది. అదేవిధంగా ఆసియా ఖండంలోనే విదేశీ ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్న మరో దేశం.. సింగపూర్. ఇక్కడ టూరిజం, హాస్పిటాలిటీ, టెలికాం రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో క్లర్క్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు.. హెల్త్‌కేర్ నుంచి హాస్పిటాలిటీ దాకా.. అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. ఆఫ్రికా దేశాల్లోనైతే భారత అభ్యర్థులకు అవకాశాలు కోకొల్లలు. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, టెలికం రంగాల్లో అవకాశాలు విస్తృతం. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు మరింత ప్రయోజనం విదేశీ ఉద్యోగాల విషయంలో ఎంట్రీ లెవల్ అభ్యర్థులతో పోల్చితే.. మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జీతభత్యాలే. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సంబంధించి మన దేశంలో చక్కటి వేతనాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా దేశాల్లోని జీతాలతో పోల్చితే సమానంగా ఉంటున్నాయి. కానీ మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ విషయంలో మాత్రం ఇక్కడ కంటే విదేశాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వచ్చే జీతభత్యాలకు కనీసం రెండింతలకుపైగా అందుకోవచ్చు. విదేశీ ఉద్యోగాన్వేషణకు మార్గాలు విదేశాల్లో ఉద్యోగం కోరుకునే ఔత్సాహికులకు ఉద్యోగాన్వేషణ క్రమంలో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే ప్రముఖంగా నిలుస్తోంది కన్సల్టెన్సీల ద్వారా అన్వేషణ. ప్రస్తుతం ఎన్నో ‘అబ్రాడ్ జాబ్ కన్సల్టెన్సీలు’ అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహికులు ముందుగా వీటిని సంప్రదిస్తే సరైన గమ్యాలు తెలుస్తాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్: జాబ్స్ అబ్రాడ్ దిశగా మరో ముఖ్య సాధనం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్. ఔత్సాహికులు ఆయా సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్ ద్వారా తాము అడుగుపెట్టాలనుకుంటున్న దేశం, అక్కడి అవకాశాలపై.. అప్పటికే ఆయా దేశాల్లో స్థిరపడిన స్నేహితులు, ఇతర అనుభవజ్ఞుల ద్వారా సమాచారం పొందొచ్చు. జాబ్ సెర్చ్ ఇంజిన్స్: ఇంటర్నెట్ సాధనంగా జాబ్ సెర్చ్ ఇంజిన్స్ (నౌకరీ డాట్ కామ్, మాన్స్టర్ డాట్ కామ్ తదితర) ద్వారా కూడా విదేశీ ఉద్యోగావకాశాలపై సమాచారం పొందొచ్చు. ఈ మార్గాల ద్వారా అన్వేషణ సాగించి అసలైన గమ్యాన్ని తెలుసుకోవడం ఎంతో తేలిక. స్పష్టతతో అన్వేషణ సాగిస్తేనే విదేశీ ఉద్యోగార్థులు ఎంతో స్పష్టంగా వ్యవహరించాలి. తమ విద్య, ఉద్యోగ నేపథ్యం- అనుభవం ఆధారంగా ముందుగా తాము కోరుకుంటున్న ఉద్యోగాన్ని, అందుకు తగిన గమ్యాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సదరు దేశంలో తమకు సరిపోయే సంస్థలు, వాటిలో అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత.. ఆయా సంస్థల పనితీరును పరిశీలించాలి. ఇందుకు ఏకైక సాధనం ఇంటర్నెట్. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షించి సదరు సమాచారం పొందొచ్చు. అంతేకాకుండా ఆయా కంపెనీలకు ఆ దేశంలోని నియంత్రణ సంస్థల అనుమతుల విషయంలోనూ పరిశోధన సాగించాలి. అనుమతులున్న కంపెనీల్లోనే దరఖాస్తుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలకు సన్నద్ధత జాబ్ అబ్రాడ్‌కు సంబంధించి దరఖాస్తుల విషయంలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు సాధారణంగా టెలిఫోన్ లేదా ఈ-మెయిల్ లేదా స్కైప్ మాధ్యమాల్లో జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. టెలిఫోనిక్, స్కైప్ ఇంటర్వ్యూల సమయంలో.. ప్రశ్నలకు సమాధానమిచ్చేట ప్పుడు ఎలాంటి తడబాటుకు లోనవకూడదు. ఇక ఈ-మెయిల్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూల సమయంలో సమయపాలన, భాషపై పట్టు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఆన్లైన్ చాటింగ్ ద్వారా జరిగే ఇంటర్వ్యూలలో సంబంధిత సంస్థ అధికారులు తాము అడిగిన ప్రశ్నకు అభ్యర్థి సమాధానం ఇవ్వడానికి తీసుకుంటున్న వ్యవధిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి.. వీటిని దృష్టిలో పెట్టుకుని.. దరఖాస్తు సమయం నుంచే ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. అప్రమత్తతో కన్సల్టెన్సీలు, ఏజెంట్స్ ఎంపిక విదేశీ ఉద్యోగార్థులకు మార్గంగా నిలుస్తున్న జాబ్ కన్సల్టెన్సీలు, రిక్రూటింగ్ ఏజెంట్స్ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ అన్ని దేశాలకు సంబంధించి గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలు, ఏజెంట్ల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. ముందుగా దాన్ని పరిశీలించి ఆ జాబితాలో ఉన్న కన్సల్టెన్సీలను సంప్రదించడం మేలు. అదేవిధంగా ఇతర దేశాలు కూడా విదేశాల్లోని తమ అధీకృత రిక్రూటింగ్ ఏజెన్సీల వివరాలను తమ ఎంబసీ వెబ్సైట్లు, ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లలో పొందుపర్చాయి. ఔత్సాహికులు తాము ఎంపిక చేసుకున్న దేశం.. అక్కడి ప్రభుత్వ గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాలు అందుకు సంబంధించి ఏజెంట్లు జారీ చేసే ప్రకటనల ఆధారంగా వెళ్లే అభ్యర్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. నైపుణ్యాలను నిరూపించుకుంటే.. సులువుగా వీసా వీసా.. విదేశాల్లో అడుగుపెట్టేందుకు కచ్చితంగా అవసరమైంది. ఈ విషయంలో అన్ని దేశాలు ఎంతో నిర్దిష్టంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. స్టడీ, టూరిస్ట్, బిజినెస్ వీసాలతో పోల్చితే వర్క్ వీసాల మంజూరులో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఔత్సాహికులు తమ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్కడి వారికంటే తామెంత మెరుగైన నైపుణ్యాలు కలిగున్నామో తెలియజేయాలి. తద్వారా వీసా అధికారులను మెప్పించాల్సిన బాధ్యత అభ్యర్థులదే. అదనపు ‘భాష’ ప్రయోజనం విదేశీ ఉద్యోగార్థుల కోణంలో మరో అదనపు ప్రయోజనం సంబంధిత దేశ భాషలో నైపుణ్యం సాధించడం. ఇది భవిష్యత్తులో రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీస్‌గా ఉన్న చైనా, స్కాండినేవియన్ దేశాలలో ఉద్యోగాలు కోరుకునేవారు తప్పనిసరిగా ఆయా దేశాల భాషలను నేర్చుకోవడం లాభిస్తుంది. పని చేసే ప్రాంతంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యంతో రాణించగలిగినా.. సామాజిక పరిస్థితుల కోణంలో స్థానిక భాషను నేర్చుకోవడం అవసరం. అంతేకాకుండా విధుల్లో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు అవసరమైన మార్కెటింగ్ విభాగాలు, ఎన్జీఓ రంగాల్లో ప్రవేశించాలనుకుంటే తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టుండాల్సిందే. అప్పుడే.. ఉద్యోగ వాతావరణంలో, అక్కడి సామాజిక పరిస్థితుల్లో రాణించగలిగి భవిష్యత్తులో సుస్థిర స్థానాలు సొంతం చేసుకోగలుగుతారు. జాబ్ అబ్రాడ్.. అనుసరించాల్సిన విధానాలు ముందుగా గమ్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఏ దేశంలో అడుగుపెట్టాలనుకుంటున్నారో.. ఆ దేశంలో తమకు సరితూగే అవకాశాలు, కంపెనీల గురించి తెలుసుకోవాలి. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వాటి గత చరిత్రను, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించాలి. ఫలితంగా తమ వ్యక్తిగత ప్రగతిపైనా అవగాహన ఏర్పడుతుంది. ఆయా కంపెనీల వెబ్సైట్లలో పొందుపర్చిన వివరాల ఆధారంగా.. అకడెమిక్, ఎక్స్పీరియన్స్ నిబంధనలతోపాటు ఇతర అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఐదేళ్లు పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. అవసరమైన డాక్యుమెంట్లు అబ్రాడ్ జాబ్ దిశగా కదిలే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి.. పాస్‌పోర్ట్ వీసా, వర్క్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పత్రాలు, లేదా రిక్రూట్మెంట్ లెటర్ యాక్స్‌ప్టెన్స్ లెటర్ (సదరు నియామక ప్రతిపాదనను అంగీకరిస్తూ సంస్థలో చేరేందుకు సంసిద్ధత తెలియజేసే లెటర్) హెల్త్ సర్టిఫికెట్ (దాదాపు అన్ని దేశాలు అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హెల్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశాయి.) ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అకడెమిక్ సర్టిఫికెట్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎంట్రీ మాత్రమే కాదు.. ఎగ్జిస్టెన్స్ కూడా ముఖ్యమే ఇప్పుడు ఎన్నో దేశాలు భారత అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుబాటులోని మార్గాల ద్వారా వీటిని అందిపుచ్చుకోవడం సులభంగా మారింది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీలు, సోషల్ నెట్వర్కింగ్ సోర్సెస్ ద్వారా వివిధ దేశాల్లోని అవకాశాలు తెలుసుకోవడం, వాటిని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఎంతో తేలిక. ఔత్సాహికులు సంబంధిత దేశంలో అడుగుపెట్టడంపై దృష్టి సారించాలి. దాంతోపాటు దీర్ఘకాలం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ క్రమంలో ఆయా సంస్థల క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లో రాణించాలి. అక్కడి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో పనిచేయగల నేర్పు ఉండాలి. - సుబ్రహ్మణ్యం, విసు గ్లోబల్ కన్సల్టెంట్స్ వీసా విషయంలో జాగ్రత్తగా విదేశీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వీసా పొందే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంస్థ అందించిన ఆఫర్ లెటర్ ఆధారంగా వీసా కాలపరిమితి ఉంటుంది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. యూకేలో ఉద్యోగం పొందితే.. ఆయా అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగా టైయర్-2, టైయర్-3 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వ్యవహారశైలిపై అనుమానం కలిగితే సందేహ నివృత్తి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించకూడదు. - సుచిత గోకర్ణ్, హెడ్, బ్రిటిష్ కౌన్సిల్ డివిజన్,బిటిష్ హైకమిషన్, న్యూఢిల్లీ