breaking news
Organic farming practices
-
ప్రకృతి ఉత్పత్తులకు ప్రీమియం ధరలు
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నిమిత్తం టీటీడీకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 10 రకాల ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1,784 టన్నుల శనగలు, బెల్లం సరఫరా చేయగా.. ఈ సీజన్ నుంచి బియ్యంతో పాటు కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతోంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కంటే 10–15 శాతం అదనపు ధరతో రైతుల నుంచి సేకరించి సరఫరా చేయబోతున్నారు. మార్కెట్ ధర ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనంగా.. ఎమ్మెస్పీ కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ ధర కంటే 15 శాతం అదనంగా ప్రీమియం ధర చెల్లించేలా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను సీఎం యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రీమియం ధర చెల్లించి పంట ఉత్పత్తులను సేకరిస్తున్నారు. శనగలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 2021–22 సీజన్లో రూ.5,230 ఉండగా.. రైతుల నుంచి రూ.5,753 చొప్పున చెల్లించి సేకరించారు. 2022–23 సీజన్లో కనీస మద్దతు ధర రూ.5,335 కాగా, రైతులకు రూ.5,868 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. బెల్లం మార్కెట్ ధర క్వింటాల్ రూ.5,250 కాగా.. రైతుల నుంచి రూ.6,037 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. రూ.5 కోట్లతో నంద్యాలలో దాల్ మిల్ ఆర్బీకేల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్థారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రసాయన అవశేషాలు లేని ఫైన్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ)ఉత్పత్తులని నిర్థారించుకున్న తర్వాతే ప్రాసెస్ చేసి టీటీడీకి సరఫరా చేస్తారు. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సొంతంగా ప్రాసెస్ చేసి సరఫరా చేసేందుకు నంద్యాలలో రూ.5 కోట్ల అంచనాతో దాల్ మిల్లును ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం, పప్పులు కూడా సేకరిస్తాం టీటీడీకి గడచిన రెండు సీజన్లలో శనగలు, బెల్లం సరఫరా చేశాం. ప్రస్తుత సీజన్ నుంచి శనగలు, బెల్లంతోపాటు సోనా మసూరి (స్లేండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతున్నాం. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
మామిడిని కాపాడుకుందాం!
వాతావరణం మారిపోయింది. అసాధారణ వాతావరణం మామిడిౖ రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. సంక్రాంతి సమయంలో చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు పూతను దెబ్బతీసింది. ఇప్పుడేమో రాత్రి పూట వణికించే చలి, పగటి పూట అధిక ఉష్ణోగ్రత మామిడి రైతుపై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. పూత ఆలస్యం కావడం, తీరా వచ్చిన పిందెలు కూడా రాలిపోతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉండటం.. పగటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం వంటి విపరిణామాలు ఆశలను తుంచేస్తున్నాయి. తేనెమంచు, తదితరæ చీడపీడలు రసాయనిక మందులు చల్లే రైతులను అల్లాడిస్తున్నాయి. అయితే, ప్రకృతి వ్యవసాయదారుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. సేంద్రియ తోటల్లో చీడపీడల బెడద లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవచ్చని, మామిడి తోటలను కాపాడుకోవచ్చని వీరి అనుభవాలు చెబుతున్నాయి.. చలి పెరిగినా పూత బాగుంది.. గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలేవు. కరువొచ్చింది. చలి కూడా తక్కువే. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. చలి పెరిగింది. పూత బాగుంది. గత ఏడాదికన్నా రెట్టింపు దిగుబడి వస్తుందనుకుంటున్నాను. మా తోట పదెకరాలు. 14 ఏళ్ల నాటిది. మొదటి నుంచీ మనసబు ఫుకుఒకా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నా. అసలు నీరు పెట్టలేదు. కలుపు తీయకుండా సజీవ ఆచ్ఛాదన చేస్తున్నాం. వాన నీటి సంరక్షణకు ఇంకుడుగుంటలు తీశాం. కలుపుమందులు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడట్లేదు. మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ లేవు. వేపనూనె కూడా పిచికారీ చేయట్లేదు. నీరు ఎప్పుడూ పెట్టలేదు. మా ప్రాంతంలో నీరు పెట్టిన తోటలు చిగుళ్లతో గుబురుగా ఉన్నాయి, తేనెమంచు పురుగు వచ్చింది. రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు కూడా రాలిపోతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల రోగనిరోధక శక్తి ఆ చెట్లకు తక్కువగా ఉండటం వల్ల అన్ని రకాల పురుగులు, తెగుళ్లూ వస్తుంటాయి. మాకు ఆ బెడద లేదు. మా తోటలో ఎకరానికి 99 చొప్పున చిన్న రసం చెట్లున్నాయి. మాది కరువు ప్రాంతాలకూ సరిపోయే అధిక సాంద్రత పద్ధతి. ఎటు చూసినా 21 అడుగులకో చెట్టు నాటాం. పంట అయిపోగానే ప్రూనింగ్ చేస్తాం. గాలిదుమ్ములను తట్టుకుంటుంది. కాయ రాలుడు చాలా తక్కువ. కరువును తట్టుకొని, గాలులను తట్టుకొని దీర్ఘకాలం దిగుబడులనిచ్చే విధంగా ఇన్‌సిటు గ్రాఫ్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. – ఎల్.జి.బి.ఎస్. రామరాజు (94401 06567), కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం ఆవు పిడకల పొగ వేస్తున్నాం.. మా 20 ఎకరాల తోట 30 ఏళ్ల నాటిది. వెయ్యి చెట్లున్నాయి. ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. 80% బేనిషాన్(బంగినపల్లి) చెట్లున్నాయి. ఈ ఏడాది చాలా చెట్లకు 80% పూత వచ్చింది. పిందె బాగానే వచ్చింది. అయితే, కొన్ని చెట్లకు చిగుళ్లు వచ్చాయి, పూత 25% మాత్రమే వచ్చింది. గత ఏడాది పూత ఎక్కువగానే వచ్చినా నిలబడింది తక్కువ. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఇప్పటికి మా తోటకు తెగుళ్లు ఏమీ రాలేదు. పూత రాకముందు పది రోజులకోసారి ఆవు మూత్రం కలిపిన నీటిని పిచికారీ చేశాం. ఇప్పుడు పిచికారీలు చేయడం లేదు. నీరు ఇవ్వడం లేదు. చీడపీడలు రాకుండా పది రోజులకోసారి పిడకల పొగ వేస్తున్నాం. సాయంత్రపు వేళలో ఐదెకరాలకు ఒక చోట కిలో ఆవు పిడకలు, పావు కిలో నెయ్యి, పచ్చి ఆకులు వేసి పిడకల పొగ వేస్తున్నాం. పూత, పిందెలు రాలిపోకుండా రక్షించుకోవడానికి పిడకల పొగ ఉపయోగపడుతున్నది. తేనెమంచు పురుగు కూడా రాలేదు. ఏ చెట్టుపైనైనా వచ్చిందన్న అనుమానం వస్తే ఆ దగ్గర్లో పిడకల పొగ పెడుతున్నాం. పిచికారీలు చేయడం లేదు. వడగళ్ల వాన రాకుండా ఉంటే ఈ ఏడాది మంచి దిగుబడే వస్తుందనుకుంటున్నాం. – సుధామోహన్ (93947 47100), బొమ్మరాజుపేట, శామీర్‌పేట మండలం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా వేస్ట్ డీ కంపోజర్ వల్ల తోట బాగుంది.. మా 60 ఎకరాల సేంద్రియ తోటలో 1500 మామిడి చెట్లు, 1500 కొబ్బరి చెట్లున్నాయి. 1995 నుంచి సేంద్రియ, బయోడైనమిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఇప్పుడు జీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను విరివిగా వాడుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ సర్టిఫికేషన్లు ఉన్నాయి. మా తోటలో పల్ప్ రకం మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. రసాలు తక్కువ. గత మూడేళ్లుగా మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ ఎరుగం. కాయకు చివరన ముడ్డిపుచ్చు వస్తుంటుంది. మాకు అది అసలు లేనే లేదు. ‘సాక్షి సాగుబడి’ ద్వారా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం గురించి తెలుసుకొని గత అక్టోబర్ నుంచి దాదాపు రోజు మార్చి రోజు వాడుతున్నాం. వెయ్యి లీటర్ల ట్యాంకులు 24 చోట్ల ఏర్పాటు చేసి.. పావు గంటలో చెట్లన్నిటికీ ఈ ద్రావణాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇప్పుడు తోట చాలా ఆరోగ్యంగా ఉంది. ఏ తెగుళ్లూ లేవు. అప్పుడప్పుడూ ఘనజీవామృతం వేస్తున్నాం. జీవామృతం ఇస్తున్నాం. అయితే, వేస్ట్ డీ కంపోజర్‌ను జీవామృతంతో కలపకుండా విడిగా ఇస్తున్నాం. మా తోటలో మామిడి చెట్లు ప్రతి ఏటా కాస్తున్నాయి. కాయకోతలు పూర్తవ్వగానే ప్రూనింగ్ చేసి, ఎండుపుల్ల తీసేసి.. సక్రమంగా పోషణ ఇస్తాం. మళ్లీ ఏడాదీ కాపు వస్తుంది. వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహకు అందటం లేదు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మామిడి తోటల్లో ఈ ఏడాది తెగుళ్లతో పిందె రాలిపోతున్నది. ఇప్పటికే 8,9 సార్లు పురుగుమందులను పిచికారీ చేసినా, పిందె రాలుతూనే ఉంది. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవడానికి సేంద్రియ వ్యవసాయం తోడ్పడుతుంది. – చలసాని దత్తు (94414 73246), నూజివీడు, కృష్ణా జిల్లా పది రోజులకోసారి కషాయం పిచికారీ.. ఈ ఏడాది జనవరిలో 3 రోజుల పాటు దట్టమైన పొగమంచు కురిసి మామిడి పూతను దెబ్బతీసింది. దీని ప్రభావం వల్ల కొన్ని చెట్లకు పూత 50% వస్తే, మరికొన్నిటికి ఇంకా తక్కువే వచ్చింది. మాకున్న 30 ఎకరాలలో చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్నే చేస్తున్నాను. 310 మామిడి చెట్లున్నాయి. గత ఏడాది 70% చెట్లకు పూత, కాత చాలా బాగా వచ్చింది. లోకల్‌గా కిలో రూ. 100–120 వరకు అమ్మాం. అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు కూడా పంపాం. ఖర్చులు పోను రూ. 8 లక్షల నికరాదాయం వచ్చింది. ఈ ఏడాది పూతే తక్కువగా వచ్చింది. పూతరాక ముందు నవంబర్ నుంచే 15 రోజులకోసారి కషాయాలు, జీవామృతం పిచికారీ చేస్తున్నాం. తేనెమంచు పురుగు రాలేదు. 20 ఆకులను కుళ్లబెట్టి తయారు చేసుకున్న కషాయం, జీవామృతం, పులిసిన మజ్జిగ, దేశీ ఆవు పాలు–శొంఠి–ఇంగువ ద్రావణం, కొబ్బరి నీరు, సప్తధాన్యాంకుర కషాయం.. అదొకసారి ఇదొకసారి 7–10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పిందె రాలడం ఆగే వరకు, పిందెలు గోలికాయ సైజుకు పెరిగే వరకు కొడుతూ ఉంటాం. అయినా గత ఏడాది బూడిద తెగులు కంట్రోల్ కాలేదు. – బీరం వెంకట్రామారెడ్డి (98498 04527), సింగోంటం, మహబూబ్‌నగర్ జిల్లా వాతావరణం మారింది.. పూత, లేత పిందె మాడిపోతున్నది.. మా 8 ఎకరాలలోని 18 ఏళ్ల మామిడి తోటలో 500 చెట్లున్నాయి. సొంతంగా తయారు చేసుకునే జీవన ఎరువులు, జీవామృతంతో వ్యవసాయం చేస్తున్నాను. సగటున 40 టన్నుల దిగుబడి వచ్చేది.. రెండేళ్లుగా 25 టన్నులకు పడిపోయింది. మూడేళ్లుగా వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మరీ ఎక్కువై.. పూత, పిందెకు గొడ్డలిపెట్టులా మారాయి. ఈ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత(సాధారణంగా 23–24 డిగ్రీలు ఉండాల్సింది) 19 డిగ్రీలకు తగ్గింది. పగటి ఉష్ణోగ్రత (ఉగాది లోపల 35 డిగ్రీలు ఉండాల్సింది) 38–39 డిగ్రీలకు పెరిగింది. గత రెండేళ్లు దిగుబడి తగ్గినా పూత సమయానికి వచ్చింది. ఈ ఏడాది పూత 25–30 రోజులు ఆలస్యంగా వచ్చింది. దశేరి, హిమాయత్ కన్నా బంగినపల్లి పూత ఆలస్యంగా వస్తుంది. బంగినపల్లి చిన్న పిందె దశలో ఉంది. ఇప్పుడున్న లేత పిందె, లేత ఆకులు కూడా మాడి, రాలిపోతున్నాయి. ఇందులో 80% రాలిపోయే అవకాశం ఉంది. పిందెలను నిలబెట్టుకునేందుకు మామిడి చెట్లపై వేప నూనె, వర్టిసెల్లం లఖానియా(జీవన శిలీంధ్ర నాశిని)లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 20,000–50,000 పీపీఎం గల వేపనూనె అర లీటరు, వర్టిసెల్లం లఖానియా 0.5% ద్రావణం అర లీటరు చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఇందులో ఎమల్సిఫయర్ కలపకూడదు. ఎమల్సిఫయర్ కలిపితే వేడి పెరుగుతుంది. 10,000 పీపీఎం లోపు ఉండే వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ఎమల్సిఫయర్ కలుపుతుంటాము. 20,000–50,000 పీపీఎం వేపనూనెకు అవసరం లేదు. వర్టిసెల్లం లఖానియా.. రసం పీల్చే పురుగులన్నిటినీ సమర్థవంతంగా అరికడుతుంది. తేనెమంచు పురుగు, బూడిద తెగులు, పేనుబంక, పాముపొడ(లీఫ్‌మైనర్)లను అరికడుతుంది, నిరోధిస్తుంది. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ మామిడి రైతు, ఒగులాపురం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
‘నేలమ్మ’ గొడుగు నీడలో..
చిన్న, సన్నకారు రైతులు కాలం కలసిరాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుండడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బాధిత కుటుంబాలకు చెందిన మహిళా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్తింటి వారి నుంచి భూములు, ఆస్తులపై హక్కులు దక్కని దుస్థితి కొందరిదైతే.. ఒంటరి మహిళలుగా వ్యవసాయం కొనసాగించడంలో సమస్యలు మరికొందరిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(సీసీసీ) అనే స్వచ్ఛంద సంస్థ నిస్సహాయులైన రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతో నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి అండగా నిలుస్తోంది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం లింగపల్లికి చెందిన పెద్దలింగన్నగారి బాలమణి అధ్యక్షతన రెండేళ్ల క్రితం ఈ సంఘం రిజిస్టరైంది. 30 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులతోపాటు 200 మంది మహిళా రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరికి సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంపై సంఘం శిక్షణ ఇప్పించింది. అనేక ఎకరాల పొలం కలిగి ఉన్నప్పటికీ .. ప్రతి ఒక్కరూ అరెకరం, పావెకరంలోనైనా సరే కంపోస్టు ఎరువుతో సేంద్రియ సేద్యం చేసి ఇంటికి సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. సంఘం అండదండలతో ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటూ పిల్లలను చదివించుకుంటున్నారు పలువురు రైతు ఆత్మహత్య కుటుంబాల మహిళలు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిలో కొందరిని ‘సాగుబడి’ పలుకరించింది.. సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా.. మాకు ఎకరం చెల్క (మెట్ట) భూమి ఉంది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలు పెట్టేవాళ్లం. నీటి కోసం 3 బోర్లు వేశాం. అప్పు పెరిగిందే గాని నీరు రాలేదు. కొడుకు పొట్ట చేతబట్టుకొని బొంబాయి వెళ్లాడు. నా భర్త పదేళ్ల క్రితం ఒకనాడు రాత్రి పదైనా ఇంటికి రాలేదు. చెట్టుకు ఉరిపోసుకున్నాడు.. సంఘం అండతో వ్యవసాయం చేస్తున్నా. బోరు నీటితో వరి వేశా.. రూ. 2 లక్షల అప్పుంది. బిడ్డ పెళ్లి చేయలేదు.. – పోతరాజు కనకమ్మ, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా లగ్గం అయిన మూడేళ్లకే.. ఐదెకరాల చెల్క ఉన్నా.. పంటలు పండేది రెండెకరాల్లోనే. వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.3 లక్షల అప్పు అయ్యింది. నా భర్త ప్రభాకర్ లగ్గం అయినాక మూడేళ్లకే మందు తాగి చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వమే బోరు వేయించింది. వరి ఎకరం(35–40 బస్తాల ధాన్యం పండుతుంది), అర్థెకరం పత్తి వేస్తున్నా. సంఘంతో కలిసి పనిచేస్తున్నా. – గుర్రాల సుగుణ, చెల్లంకిరెడ్డిపల్లి, చిన్నకొండూరు మండలం, సిద్దిపేట జిల్లా రెండెకరాల్లో వరి వేస్తున్నా.. రెండెకరాలుంది. 17 ఏళ్ల క్రితం నా భర్త రాములు 3 బోర్లు వేశాడు. నీరు రాలేదు. నీరు లేక 4 మడులు ఎండిపోయాయి. పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇద్దరు బిడ్డలు, కొడుకు. ఒక బిడ్డ బోన్‌కేన్సర్‌తో చనిపోయింది. ఇంకో బిడ్డ టీటీసీ చదివింది. రెండెకరాల్లో వరి వేస్తున్నా. సంఘం నేర్పిన విధంగా.. ఎటువంటి (రసాయనిక) మందులూ వేయకుండా చేస్తున్నా. – ఉప్పునూతల రామలక్ష్మి, లింగపల్లి, మిడిదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా సంఘం అండగా నిలబడింది.. మాది ఉమ్మడి కుటుంబం. ఆరెకరాల భూమి ఉంది. నా భర్త రమేశ్ ఏడేళ్ల క్రితం వర్షాధారంగా వరి వేశాడు. కోతకొచ్చే సమయంలో 2 బోర్లు ఫెయిలయ్యాయి. గుళికలు మింగి చనిపోయాడు.. మా భూమి మల్లన్నసాగర్లో పోయింది. మా పాప చదువుకు సంఘం తోడ్పడింది. అమ్మ వాళ్లింట్లోనే ఉండి సీసీసీ స్వచ్ఛంద సంస్థ వలంటీర్‌గా పనిచేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో తోటి మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నా. పెళ్లికి ముందు 9వ తరగతి చదివా. డిగ్రీ రాస్తున్నా.. – మెంగన సుజాత, లక్ష్మాపూర్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా ఏడాది పాటు సేంద్రియ సేద్యంపై శిక్షణ సంఘం సభ్యులకు గత ఏడాదిలో అనేక దఫాలుగా సేంద్రియ వ్యవసాయ నిపుణులు కిషన్‌రావు వద్ద శిక్షణ ఇప్పించాం. తాము తినడానికి వరకు సేంద్రియంగా పండించుకుంటున్నారు. మహిళా రైతుల హక్కుల సంఘం నేతలు ఆశాలత, లక్ష్మిల తోడ్పాటుతో బాధిత మహిళల భూమి హక్కులపై చైతన్యం తీసుకువస్తున్నాం. ప్రవాస తెలుగువారితో కూడిన ఐ4ఫార్మర్స్ బృందం బాధిత మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తున్నది. – సజయ (99483 52008), కేరింగ్ ఫర్ సిటిజెన్స్ కలెక్టివ్ -
15న అడవినెక్కలంలో ప్రకృతి సేద్యంపై ఉచిత శిక్షణ
సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ (నోఫా) ప్రతి నెలా మూడో శనివారం రైతులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. సంస్థ కోశాధికారి సీహెచ్ రామకృష్ణప్రసాద్ ఈ నెల15న కృష్ణాజిల్లా అడవినెక్కలంలోని చుక్కపల్లి ఐటీఐ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు 98496 24311 నంబరులో సంప్రదించవచ్చు. 16న పండ్ల తోటలు, పాలీహౌస్‌లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ