breaking news
Order-to-serve
-
ఆర్డర్ టు సర్వ్ బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పనిచేస్తున్న పోలీసుల బదిలీలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో తాత్కాలిక పద్ధతిలో కేటాయించిన పోలీస్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఏడాదిగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు ఊరట లభించినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అన్నిశాఖల్లో పాత జిల్లాల పరిధిలోని ఉద్యోగులను విభజించి ఆర్డర్ టు సర్వ్(తాత్కాలిక) పద్ధతిలో కొత్త జిల్లాలకు కేటాయించింది. పోలీసుశాఖ కూడా ఇదే పద్ధతిని అమలు చేసింది. కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు తాత్కాలికంగానే కేటాయించారు. అప్పటి నుండి శాశ్వత బదిలీల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆర్డర్ టు సర్వ్ విధానం వల్ల పోలీసుశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ ఏడాదిన్నరగా ఆగిపోయింది. పదోన్నతులు ఇవ్వాలంటే సీనియారిటీతోపాటు ఆ జిల్లాల్లో ఖాళీలుండాలి. ఇవి తాత్కాలిక కేటాయింపులు కావడంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో ఖచ్చితమైన లెక్కలులేవు. దీంతో కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కేటాయించిన పోలీసు సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి అప్పగించాలని హోంశాఖ ముఖ్యమంత్రిని కోరింది. పోలీస్‌శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్డర్ టు సర్వ్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయసలహా తీసుకున్నారు. దరఖాస్తు చేసుకుంటేనే... ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాత్కాలిక పద్ధతిలో కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీల కోసం డీజీపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో కొత్త జిల్లాల్లో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐల బదిలీలకు పదోన్నతులకు లైన్ క్లియరైంది. కొత్త జిల్లాల కేటాయింపుల విషయమై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా వచ్చే పోస్టులను పాత జిల్లాల ఎస్పీలకు కేటాయిస్తారు. పాత హెడ్ క్వార్టర్లో ఉన్న అధికారి ఆ జిల్లా పరిధిలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకు పోస్టులను కేటాయించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
ఇక్కడివారు అటు..అక్కడివారు ఇటు
సచివాలయంలో ఉద్యోగుల స్థానం మార్పు - ఆంధ్రాకు చెందిన 99 మంది తెలంగాణకు - తెలంగాణకు చెందిన 127 మంది ఆంధ్రాకు - తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులూ ఆంధ్రాకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఉద్యోగుల పేర్లు, వారి హోదాతో ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఆదేశాల ప్రకారం నాల్గో తరగతి ఉద్యోగులు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని 774 మంది ఉద్యోగులను తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు కేటాయించారు. ఇందులో ఆంధ్రాకు చెందిన 99 మంది ఉన్నారు. అలాగే తెలంగాణకు చెందిన 127 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం తెలంగాణకు చెందిన ఉద్యోగులే ఎక్కువ మంది ఆంధ్రపదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి వస్తోంది. నాల్గో తరగతి ఉద్యోగులు సచివాలయంలో 595 మంది ఉండగా, వారిలో 35 మంది తప్ప మిగతా వారంతా తెలంగాణకు చెందినవారే. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. తెలంగాణ సచివాలయానికి కేటాయించిన ఉద్యోగుల సంఖ్య ప్రకారం.. అదనపు కార్యదర్శులు ముగ్గురు, సంయుక్త కార్యదర్శులు ముగ్గురు, ఉప కార్యదర్శులు 24 మంది, సహాయ కార్యదర్శులు 55, సెక్షన్ ఆఫీసర్లు 239, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 348, ప్రైవేట్ కార్యదర్శులు 34, ప్రత్యేక స్టెనోలు 10, సీనియర్ స్టెనోలు ముగ్గురు, జూనియర్ స్టెనోలు 12, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు 14, డీఆర్టీ అసిస్టెంట్లు 29 మంది ఉన్నారు. 1. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సిన తెలంగాణకు చెందినవారు: ఇద్దరు అదనపు కార్యదర్శులు, ఇద్దరు ఉప కార్యదర్శులు, 75 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు, 29 మంది టీఆర్టీ అసిస్టెంట్లు ఉన్నారు. 2. తెలంగాణ సచివాలయంలో పనిచేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు: ముగ్గురు జూనియర్ స్టెనోలు, ముగ్గురు సీనియర్ స్టెనోలు, నలుగురు ప్రత్యేక స్టెనోలు, పది మంది ప్రైవేట్ కార్యదర్శులు, 78 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు 3. తెలంగాణ సచివాలయం, వివిధ విభాగాలు, చట్టసభల్లో పనిచేసే ఉద్యోగులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ అయిన ఉద్యోగులందర్నీ తక్షణమే రిలీవ్ చేయాలనీ, లేని పక్షంలో సంబంధిత శాఖల అధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అపాయింటెడ్ డే నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఉద్యోగుల విభజనకు సంబంధించి కసరత్తు ప్రారంభించినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఉద్యోగులను తాత్కాలిక పద్దతిలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.