breaking news
operation and maintainence
-
మంత్రా.. మజాకా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో నిబంధనలు కాదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు. కోటి రూపాయల అంచనాలతో పిలిచిన టెండర్లకు ఇంకా నాలుగు రోజులు గడువు ఉండగానే అర్ధంతరంగా రద్దు చేశారు. అవే పనులను నామినేషన్ కోటాలో అధికార పార్టీ కార్యకర్తలకు పంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడో పిలవాల్సిన టెండర్లు చివరి నిమిషం వరకు నాన్చి ఇప్పుడు అత్యవసరం పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... సోమశిల ప్రాజెక్ట్ కింద దక్షిణ, ఉత్తర కాలువలతో పాటు కావలి కాలువ, వాటి లింక్ కాలువల్లో సిల్టు, నాచు తొలగింపునకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద కోటి రూపాయలు విడుదలయ్యాయి. ఈ పనులకు సెప్టెంబర్ 24న అనుమతి లభించింది. ప్రాజెక్ట్ నుంచి తొలి పంటకు ఇచ్చే నీరు సక్రమంగా చివరి వరకు చేరేందుకు వీలుగా మెయింటెనెన్స్ పనుల కోసం ఈ నిధులు కేటాయించారు. ఆ మేరకు రెండు రోజుల కిందట ఇరిగేషన్ అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. హఠాత్తుగా మంగళవారం టెండర్లు రద్దు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రకటించారు. దీనిపై ఆరా తీస్తే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి కాలువలకు నీరు విడుదల చేసేందుకు బుధవారం మధ్యాహ్నం ముహూర్తంగా నిర్ణయించారు. సోమశిలలో గంగమ్మ పూజలు నిర్వహించిన తరువాత నీటిని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించేందుకు సమయం పడుతున్నందున నామినేషన్ కింద పనులు కేటాయించాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. సాంకేతికంగా తప్పు లేదని అనిపించుకునేందుకు పనుల అంచనా విలువను ఐదు లక్షల రూపాయలకు మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మెయింటెనెన్స్ పనులను సాగునీటి సంఘాలకు అప్పగించేవారు. ఇప్పుడు సాగునీటి సంఘాలు లేకపోవడంతో ఆరోపణలకు జడిసి ఆయా కాలువల కింద రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇవన్ని ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. రైతులతో కమిటీలు నియమించేందుకు కనీసం వారమైనా పడుతుంది. నిజమైన కమిటీలు ఏర్పాటు చేసేందుకు వారం రోజులు పడుతుండగా ఇప్పటికే పిలిచిన టెండర్లకు గడువు నాలుగు రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ కమిటీల నియామకం మొత్తం బూటకమని స్పష్టమవుతోంది. మంత్రి రామనారాయణరెడ్డి, అధికారపార్టీ నేతలు సూచించిన వారికి పనులు కట్టబెట్టేందుకు రైతులతో కమిటీలు అన్న కొత్త నాటకానికి తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాలువల్లో సిల్టు, నాచు తొలగింపు ఏటా జరిగేదే. దీని గురించి చివరి నిమిషం వరకు మీనమేషాలు లెక్కించి ఇప్పుడు నామినేషన్ల కింద కాంగ్రెస్ కార్యకర్తలకు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
ఇరిగేషన్లో అవినీతి జలగలు
సాక్షి, నెల్లూరు: దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా కొల్లగొడుతున్నారు. పనులు చేయకుండానే, చేసినట్లుగా చూపి జేబులు నింపుకుంటున్నారు. కొన్ని కాలువల్లో నాచు,పీచు తీసి నిధులను అందిన కాడికి స్వాహా చేస్తున్నారు. జిల్లాలోని నీటిపారుదల శాఖలో శ్రుతిమించిన అవినీతి పర్వం ఇది. ప్రభుత్వం మంజూరు చేసిన ప్యాకేజీ పనులతో పాటు రైతులు చెల్లించే భూమిశిస్తుతో వచ్చే ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ నిధులను ‘మాకు 40, మీకు 60’ అనే నిష్పత్తిలో అధికారులు, అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్లకు కక్కుర్తిపడిన కొందరు అవినీతి అధికారులే ఈ అక్రమాలకు తెరదీసినట్టు సమాచారం. జిల్లా నీటిపారుదల శాఖ పరిధిలో ఇటీవల కాలంలో వివిధ పనుల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్(ఓఅండ్ఎం)తో పాటు నామినేషన్ పనులు కలిసి నెల్లూరు సెంట్రల్ డివిజన్, నెల్లూరు సౌత్, నెల్లూరు నార్త్, గూడూరు, కావలి డివిజన్లలో ఈ పనులు చేపట్టారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ఆ పనుల పందేరం చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు విలువైన పనులను మంజూరు చేసే అధికారం కలెక్టర్, చీఫ్ ఇంజనీర్‌కు ఉంది. అయితే నామినేషన్ పద్ధతిలో మంజూరు చేస్తున్న పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ శ్రీధర్ పనుల మంజూరును నిలిపేశారు. మంత్రి ఆనం సంతకం పెట్టిన పనులు మాత్రమే మంజూరు చేస్తూ వచ్చారు. ఇది గమనించిన కొందరు కాంగ్రెస్ నేతలు కలెక్టర్ వద్దకు వెళ్లకుండా శ్రీకాళహస్తిలో ఉండే తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ ద్వారా పనులు మంజూరు చేయించుకుంటున్నారు. ఇటీవల రూ.250 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. పనులు మంజూరు చే సుకుంటున్న కాంట్రాక్టర్లు నాణ్యతను గాలికొదిలేశారు. కొన్ని పనులైతే అసలు మొదలుపెట్టకుండానే బిల్లులు చేసుకుంటున్నారు. శాశ్వత మరమ్మతులు చేయాల్సిన చోట నాచు, చెత్త, బురద తీసి లక్షలు దోచేశారు. ప్రధానంగా ఈస్ట్రన్ , సదరన్, పైడేరు ఎస్కేప్ ఛానళ్లతో పాటు ఆత్మకూరు, ఏఎస్‌పేట, మర్రిపాడు, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో చెరువుల కింద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓఅండ్ఎం పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. చాలా చోట్ల వాటి కాలపరిమితి పూర్తయినా మాజీ ప్రతినిధులే పనులు చేస్తుండటం గమనార్హం. పర్సంటేజే ప్రధానం ఆనం సోదరుల అండ చూసుకున్న ఓ అధికారి పెద్దఎత్తున నామినేషన్ విధానంలో పనులు మంజూరు చేస్తూ, నాణ్యతను గాలికొదిలేసినట్లు ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. పర్సంటేజే ప్రధానంగా పలువురు అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు సమాచారం. పని మంజూరు కోసం అధికారపార్టీ ప్రజాప్రతినిధితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారికి చెరో 10 శాతం, పని మంజూరు సమయంలోనే ఎస్ఈకి 1శాతం,సీఈకి 1, అగ్రిమెంట్ అధారిటీ ఈఈకి ఒక శాతం, పూర్తయిన తరువాత జేఈకి 5,డీఈకి 3,ఈఈకి 2, కార్యాలయ సిబ్బందికి 2 శాతం చొప్పున పర్సంటేజీలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లే చెబుతున్నారు. పనుల్లో నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు సైతం వాటాలు తీసుకుంటున్నట్టు సమాచారం. పని చూసి పెడితే 2 శాతం, చూడకుండా సంతకం పెడితే 3 శాతం చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. మంజూరైన నిధుల్లో 40 శాతం పర్సంటేజీలకే సరిపోతుండటంతో కాంట్రాక్టర్లు పనులను నాసిరకంగా చేసి సరిపెట్టుకుంటున్నారు. సెలవులో ఈఈ ఇరిగేషన్ ఈఈ మునిరెడ్డి సస్పెండ్ అయిన తరువాత గంగాధర్‌రెడ్డి వచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం సబ్‌డివిజన్‌లో జరుగుతున్న నామినేషన్ పనులను తనిఖీ చేసిన ఆయనకు పలు అక్రమాలు తారసపడినట్లు తెలిసింది. ఇక్కడే ఉంటే ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్టు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. చక్రం తిప్పుతున్న డీఈ ఇరిగేషన్ పనుల్లో జరుగుతున్న అక్రమాల్లో ఓ డీఈ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధికి, నేతలకు మధ్యవర్తిగా ఆయన అన్నీ తానై నడిపిస్తున్నట్టు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం వెనుకాడుతుండటంతో డీఈ ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడో అర్ధమవుతుంది.