breaking news
Open Market Price
-
తగ్గింపు ధరలతో కందిపప్పు విక్రయాలు
* గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 రకం రూ.135 * నేటి నుంచే విక్రయాలు ప్రారంభం, ఒక్కొక్కరికి కేజీ మాత్రమే సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలతో సామాన్య వినియోగదారులకు కందిపప్పును అందించేందుకు దాల్ మిల్లర్లు ముందుకు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ కేంద్రాలద్వారా గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ. 135కు విక్రయిస్తామని మిల్లర్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కేంద్రాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ దాల్ మిల్లర్లు, హోల్‌సేలర్లు, ఇతర వ్యాపారులతో తగ్గింపు ధరలపై కందిపప్పు విక్రయాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలక న్నా తక్కువకే సామాన్యులకు విక్రయాలు చేయాలని ఆయన కోరారు. దీనికి మిల్లర్లు అంగీకారం తెలిపారు. హైదరాబాద్‌లో 10 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, జిల్లా, మండల కేంద్రాల్లో పౌరసరఫరాల శాఖ సహకారంతో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో ఒక్కొక్కరికి కేవలం కేజీ కందిపప్పును మాత్రమే విక్రయిస్తారు. ఈ విక్రయ కేంద్రాల చిరునామా, తగ్గించిన ధరలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విసృ్తత ప్రచారం కల్పించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
భూమి బంగారమే..!
-
భూమి బంగారమే..!
గ్రేటర్లో భూముల విలువ పెంపునకు రంగం సిద్ధం ♦ బహిరంగ మార్కెట్ ధరలే ప్రామాణికం ♦ 10 నుంచి 30 శాతం పెంపునకు కసరత్తు పూర్తి ♦ ఆన్లైన్లో సవరించిన ప్రతిపాదనలు ♦ ఆగస్టు ఒకటి నుంచి పెంచిన విలువల అమలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు బంగారం కానున్నాయి. సరిగ్గా రెండేళ్ల తర్వాత భూముల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్త్తంగా భూముల విలువల సవరణలను చేపట్టాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువలను సరిపోల్చుతూ అవసరమైన చోట పెంచుతూ ప్రాథమిక కసరత్తులు పూర్తి చేశాయి. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుల రుసుం రేటు తగ్గించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగవచ్చని భావించారు. అయితే రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల ప్రభుత్వ రాబడి లక్ష్యం నెరవేరలేదు. దీంతో తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువల పెంపునకు సిద్ధమైంది. పెంపు ప్రతిపాదనలు ఇలా.. ♦ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45లో ప్రస్తుతం గృహ ఉపయోగ భూమి చదరపు గజం విలువ రూ.42 వేలు ఉండగా, తాజాగా రూ. 45 వేల నుంచి 47 వేలకు పెంచింది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన భూమి విలువను రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. బంజారాహిల్స్ పరిధిలోని మొత్తం 15 ఏరియాలకు 10 ఏరియాల్లో మాత్రమే భూముల విలువలను పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. ♦ చిక్కడపల్లి, సికింద్రాబాద్‌ల్లో ప్రస్తుతం చదరపు గజం విలువ రూ.38 వేలు ఉండగా రూ. 40 వేల నుంచి రూ. 42 వేల వరకు పెంచారు. వాణిజ్య కేంద్రమైన అబీడ్స్‌లో రూ. 42 వేల నుంచి రూ. 44 వేలకు పెంచారు. ♦ ఉప్పల్ రింగ్‌రోడ్ సమీపంలో ప్రస్తుత విలువ రూ.25 వేలు ఉండగా దానిని రూ. 30 వేలు, నాగోలులో రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. ఉప్పల్‌లోని 25 ఏరియాలకుగానూ 22 ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం, రెండింటిలో 30 నుంచి 50 శాతం పెంచుతూ ప్రతిపాదించారు. ♦ ఎల్బీనగర్ పరిధిలోని సరూర్‌నగర్, వనస్థలిపురంలో చదరపు గజం రూ.20 వేలు ఉండగా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ప్రతిపాదించారు. ♦ పాతబస్తీలోని చార్మినార్, దూద్‌బౌలీలో 10 నుంచి 30%, మారేడుపల్లిలో 5% వరకు పెంచుతూ ప్రతిపాదించారు. మల్కాజిగిరిలో 20 నుంచి 50% వరకు భూముల విలువలను పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. 10-30 శాతం పెంపు గ్రేటర్ పరిధిలో భూముల విలువలను కనీసం 10 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం 30 శాతం నుంచి 50 శాతం వరకు కూడా ప్రతిపాదించింది. ఉదాహరణకు గోల్కొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో 30 శాతం నుంచి 50 శాతం పాతబస్తీలోని దూద్‌బౌలీ, నగర శివారులోని పెద్ద అంబర్‌పేట, ఎల్బీనగర్, కీసర తదితర ప్రాంతాల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్సైట్లో బ్లాక్, వార్డులవారీగా అందుబాటులో ఉంచింది. వీటిపై అభ్యంతరాలు, సూచనలను జూలై 15 వరకు స్వీకరిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సూచనలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆగస్టు ఒకటి నుంచి పెంచిన విలువలను అమలు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.