మోహన్‌లాల్ ప్రతిపాదనపై నేడు నిర్ణయం
తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘లాలిసమ్’ బ్యాండ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం అత్యంత చెత్తగా ఉందని ఆన్లైన్లో నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఇందులో మోహన్‌లాల్‌తో పాటు ఇతర గాయకులు స్టేజిపై పాడలేదని, అంతా ముందే రికార్డు చేసిన కార్యక్రమంగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం నుంచి తాను తీసుకున్న రూ.1.63 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని సోమవారం మోహన్ లాల్ ప్రకటించారు. ఈ విషయమై కేరళ ప్రభుత్వం నేడు (మంగళవారం) ఓ నిర్ణయానికి రానుంది. అయితే ఆ స్థాయి నటుడి నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం మర్యాదగా ఉండదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.