breaking news
Old districts
-
చెరో వైపు..
సాక్షి, ఆదిలాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థలో మొదటి జోన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పాత జిల్లాలైన నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కలిపి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ముసాయిదా వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్న విషయం విదితమే. కాగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా జిల్లాల అమరిక మారింది. కాళేశ్వరం జోన్‌ను మొదటిగా జోన్‌గా నిర్ణయిస్తూ పాత ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు పాంత్రంలోని రెండు జిల్లాలను అందులో చేర్చారు. రెండవ జోన్‌గా బాసరను నిర్ణయిస్తూ అందులో పశ్చిమ జిల్లాలోని రెండు జిల్లాలను చేర్చారు. ప్రధానంగా చదువుల తల్లి బాసరను, కాళేశ్వరం వంటి ప్రముఖ దేవాలయాల ప్రాంతాలను జోన్లుగా నిర్ణయించడంలో సీఎం సెంటిమెంట్ కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అప్పుడు.. ఇప్పుడు.. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండగా, ఐదవ జోన్లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొత్త ముసాయిదాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పాత నిజామాబాద్, మెదక్ జిల్లాలను కలిపి మొదటి జోన్లో చేర్చారు. గురువారం ముఖ్యమంత్రి జోన్ల సంఖ్యను పెంచడంతోపాటు అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ జిల్లాలను చెరో వైపు చేర్చడంతో ఈ నాలుగు జిల్లాల్లోని ఉద్యోగుల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాలు దూరం కానున్నాయి. అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడినప్పుడు భౌగోళిక పరిస్థితిలో మార్పు రాగా, ప్రస్తుతం జోన్ల పరంగా చెరో వైపు ఈ జిల్లాలు వెళ్తుండడంతో ముందు నుంచి ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీల్లో ఉన్న సంబంధాల్లో మార్పు రానుంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు జోన్ పరంగా భూపాల్పల్లి, పెద్దపల్లి జిల్లాలతో కలుస్తుండగా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలతో ఏకం అవుతున్నాయి. మల్టీజోన్‌లో ఉమ్మడి జిల్లా ఒకటి.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏడు జోన్లతోపాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి మల్టీజోన్‌లో రాజన్న, భద్రాద్రి జోన్లతో ఉమ్మడి జిల్లాలు చెరో వైపు వెళ్లిన కాళేశ్వరం, బాసర జోన్లను కలిపారు. ఇదిలా ఉంటే మల్టీ జోన్లో గెజిటెడ్ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు ఏస్థాయి వరకు ఉంటాయనే దానిపై ఉద్యోగుల్లో సందిగ్ధం వ్యక్తం అవుతోంది. గెజిటెడ్ ఉద్యోగుల్లో మొదటి స్థాయిలో గెజిటెడ్ ఉద్యోగులు, రెండవ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్లు, మూడో స్థాయిలో డిప్యూటీ డైరెక్టర్లు, నాలుగో స్థాయిలో జాయింట్ డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టులలో శాఖాధిపతులే పదోన్నతులు, బదిలీలు చేపడుతారు. మూడో, నాలుగో స్థాయిలో ప్రభుత్వం పదోన్నతులు, బదిలీలు చేపడుతుంది. దీంతో ప్రస్తుతం మల్టీ జోన్లో ఏ స్థాయిలను ఉంచుతారనే విషయంలో స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గతంలో మొదటి స్థాయిలో గెజిటెడ్ ఉద్యోగులకు కొన్ని శాఖల్లో జోనల్, మరి కొన్ని శాఖల్లో మల్టీ జోనల్ స్థాయిలో ప్రక్రియ జరిగేది. రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లో ఏ శాఖలోనైనా రాష్ట్ర స్థాయిలో వ్యవహారాలు సాగేవి. మూడో, నాలుగు స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో అయినా బదిలీలు జరిగేవి. దీంతో ప్రస్తుతం వేటిని మల్టీజోన్ పరిధిలోకి తీసుకువస్తారనే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త తరానికి ప్రయోజనం.. ప్రస్తుతం ఏడు జోన్ల విధానం కొత్త తరానికి ప్రయోజనం కలిగిస్తుంది. బాసర జోన్లో ఆదిలబాద్, నిర్మల్ జిల్లాలను నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కలపడం సమంజసమే. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలతో కలపడం కూడా సబబే. భౌగోళిక పరిస్థితులను బట్టి ఈజోన్లను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి సీనియార్టీ పరంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోనే అనుసంధానం ఉంది. రాబోయే తరానికి కొత్త జోన్ల విధానం ప్రయోజనం కలిగిస్తోంది. – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ నాన్చడానికే రోజుకో మాట.. ప్రభుత్వం జోనల్ విధానంలో చిత్తశుద్ధితో పని చేయడం లేదు. మొదట నాలుగు జోన్లతో ముసాయిదా ఏర్పాటు చేసి ఇప్పుడు ఏడు జోన్లు అంటుంది. కేవలం సమస్యను దాట వేయడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మేధావులను కూర్చోబెట్టి జోన్ల ఏర్పాటులో నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగడంలేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెరో మాట చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సరైన అవగాహన కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై తలూపడం తప్పితే ఏమీ చేయడం లేదు. అదే సమయంలో కాళేశ్వరం, బాసర జోన్లకు హెడ్ ఆఫీస్ ఎక్కడ పెడతారన్నది స్పష్టత లేదు. జిల్లా కేంద్రాలను జోన్ కార్యాలయాలకు కేటాయిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకోవడం ఏ మేరకు సమంజసం. – వెంకట్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
పాత జిల్లాలకు పనిదినమే!
నేడు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల పునర్విభజనలో ఆఖరి మార్పులు, చేర్పులకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఆవిర్భావ వేడుకలు, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అంతకు ముందు 11 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సీఎస్ సమావేశమవుతారు. దసరా రోజు కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది. కొత్త జిల్లాల ప్రారంభ రోజున ప్రస్తుతమున్న పది జిల్లాల పాలనా యంత్రాంగం సైతం విధుల్లో ఉండాలని ఆదేశించింది. కొత్త జిల్లాలకు అవసరమైన సమన్వయం, సహకారాలు అందించాలని అధికారులు, ఉద్యోగులకు సూచించింది. నిర్ణీత సుముహూర్తాన రిబ్బన్ కత్తిరించి కలెక్టరేట్ ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు నియమించిన కలెక్టర్ తన చాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ ఫైలుపై సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత మంత్రి, వీఐపీలు ప్రారంభోత్సవ ఫొటో సెషన్లో పాల్గొంటారు. మొదటి ఫైలుపై కలెక్టర్ సంతకం చేయటంతోపాటు తాను బాధ్యతలు స్వీకరించిన సమాచారాన్ని ఫాక్స్ ద్వారా సీఎస్‌కు పంపిస్తారు. అనంతరం కొత్త జిల్లాలకు సంబంధించిన సమాచారం, డివిజన్లు, మండలాలు, జనాభా, మ్యాప్‌లు, ఫొటోలు తదితర విశేషాలతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు ప్రయోజనాలు, కొత్త జిల్లా విశేషాలను విశ్లేషిస్తూ మంత్రులు ప్రసంగిస్తారు. అభివృద్ధి కోణంలో కలెక్టర్ మాట్లాడతారు. కార్యక్రమం అనంతరం ఇదే తరహా ప్రారంభోత్సవాన్ని జాయింట్ కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్‌వో, డీఈవో తదితర కార్యాలయాల్లో నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం వివిధ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల్లో మంత్రులు, కలెక్టర్, జేసీ, ఎస్పీ పాల్గొంటారు.