breaking news
old currencey
-
‘అణా’దిగా చెలా‘మనీ’
మనీ.. మనిషి జీవితాన్నే శాసిస్తోంది. అణా నుంచి నేటి రెండు వేల రూపాయల నోటు దాకా కరెన్సీకి ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానంలో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైంది? ఏ పాలకుడి హయాంలో ఎన్ని రకాల నాణేలు, నోట్ల తయారీ జరిగింది? ఆయా కాలాల్లో మనీ.. చెలామణి ఎలా ఉండేది? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఆసక్తి కలిగించేవే. నిజాం హయాంలో పేపర్ కరెన్సీ మొదలుపెట్టి వందేళ్లు అవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం. హైదరాబాద్ సంస్థానం సొంత నాణేల ముద్రణ 1857లో మొగల్ రాజ్య పతనానంతరం ఐదో నిజాం అఫ్జలుద్దౌల్లా మొగల్ నాణేల వాడకాన్ని నిలిపి వేసి సొంతంగా సుల్తాన్ షాహీ ప్రాంతంలో నాణేల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నాణేలను ‘హలి సిక్కా’గా పిలిచేవారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో 1895లో యంత్రం ద్వారా తొలిసారి నాణేలను తయారు చేయడం ప్రారంభించారు. దీన్ని చర్ఖీ సిక్కా (చర్ఖీ(చక్రం) ద్వారా తయారు చేసిన నాణేలు) అని పిలిచేవారు. ఒకటో ప్రపంచ యుద్ధకాలం నాటికి వెండి ధర గణనీయంగా పెరిగింది. ఫలితంగా నాణేల ముద్రణ భారం కావడంతో ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి పేపర్ కరెన్సీ ముద్రణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు. కమిటీ సిఫారసుల మేరకు హైదరాబాద్ సంస్థానంలో 1918 ఏప్రిల్ 24వ తేదీన తొలిసారిగా పేపర్ కరెన్సీ విడుదల చేశారు. 1959 వరకే ఉస్మానియా కరెన్సీని ముద్రించారు. ఈ కరెన్సీపై ప్రభుత్వ ఖజానా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సంతకముండేది. హైదరాబాద్ కరెన్సీ చట్టం కింద జారీ చేసిన నోట్లను ఉస్మానియా కరెన్సీ అని పిలిచేవారు. 1918లో ఒక రూపాయి, ఐదు రూపాయల నోట్లు విడుదల చేశారు. 1926లో వెయ్యి రూపాయి నోట్లు జారీ చేశారు. 1959 వరకు హైదరాబాద్ స్టేట్ కరెన్సీ కొనసాగింది. హైదరాబాద్ సంస్థాన విలీనంతో భారత కరెన్సీ అమలులోకి వచ్చింది. 500 ఏళ్లకు పూర్వం .. గోల్కొండ సంస్థానంలో హున్ నాణేలు గోల్కొండ సంస్థానంలో బహమనీల పాలనా కాలంలో హున్ నాణేల వాడకం ఉండేది. వీరి పతనానంతరం కుతుబ్ షాహీ పాలన నుంచే సొంతంగా నాణేల తయారీ మొదలైంది. 1689లో తానీషా పాలన వరకు కుతుబ్ షాహీ నాణేల వాడకముంది. గోల్కొండను మొగల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనం చేసుకోవడంతో కుతుబ్‌షాహీ నాణేల వాడకం అంతరించి మొగల్ నాణేలు వాడుకలోకి వచ్చాయి. బంగారు, వెండి నాణేలు ఐదో నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సొంతంగా నాణేల తయారీ ఉండేది. వాటిని బంగారం, వెండి, రాగి, ఇత్తడితో తయారు చేసేవారు. 1905 నుంచి 1945 వరకు నాలుగు రకాలుగా బంగారు నాణేలు తయారు చేసి వినియోగించేవారు. ఇందులో 11.09 గ్రాముల బంగారు నాణేం చాలా గుర్తింపు పొందింది. నాణేలు, పేపర్ కరెన్సీ ఇలా... నాణేనికి ఒకవైపు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ బహదూర్ ఉంటే మరోవైపు ఫరకందా బునియాద్ హైదరాబాద్ అని ఉర్దూ అక్షరాల్లో ఉండేవి. ఇవి నాణేంపైన బయటికి వచ్చినట్లుగా ఉండేవి. ఇక వెండి, బంగారు నాణేలపై ఒకవైపు చార్మినార్, మరోవైపు అసఫ్ జాహీల ఫరకందా బునియాద్ ఉండేది. పేపర్ కరెన్సీపై ఉస్మానియా సిక్కా అని ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, కన్నడ, మరాఠీ భాషల్లో విలువ రాసి ఉండేది. భారత దేశ కరెన్సీతో కలిపిన నిజాం కరెన్సీ 1950లో భారత రూపాయిని స్థానిక ద్రవ్యంతో పరిచయం చేశారు, 7 హైదరాబాద్ రూపాయలు = 6 భారతీయ రూపాయలుగా వినియోగించేవారు. 1951లో హైదరాబాద్ రూపాయి వాడకాన్ని నిలిపివేశారు. దీంతో భారత రూపాయి ప్రధాన ద్రవ్య కరెన్సీగా మారింది, అయితే, హైదరాబాద్ రూపాయి 1959 వరకు చెల్లింది. -
మోదీజీ.. మార్పించరూ
రద్దయిన పాతనోట్లు ఇప్పటికీ కోట్ల కొద్ది పట్టుబడుతున్నాయి. అయితే అదంతా బ్లాక్‌మనీ... బడాబాబుల డబ్బు. కానీ ఈ బంగ్లాదేశీ వనితది దీనగాథ. వేధింపులు భరించలేక పెళ్లయిన మూడేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఓ దుస్తుల తయారీ పరిశ్రమలో నెలకు రూ. 9 వేల జీతానికి పనిచేసేది. భారత్‌లో తనకు తెలిసిన వారున్నారని, అక్కడైతే నెలకు రూ.15,000 వరకు సంపాదించొచ్చని.. కలిసి పనిచేసే వ్యక్తి ఆమెకు ఆశ చూపాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అందుకు అంగీకరించిన ఆమె అతని వెంట వచ్చేసింది. ముంబై శివార్లలోని వాషికి తీసుకొచ్చి ఓ నేపాలీ మహిళకు రూ.50 వేలకు ఆమెను అమ్మేశాడా ప్రబుద్ధుడు. బెంగళూరుకు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. స్వదేశానికి పంపుతామని చెప్పి తర్వాత పుణేకు తరలించారు. అక్కడి బుధవార్పేట్లోని ఓ వ్యభిచార గృహం నుంచి 2015 డిసెంబర్లో పోలీసులు ఆమెను రక్షించారు. బంగ్లాదేశ్ నుంచి అనుమతి రావడానికి ఇన్నాళ్లూ వేచిచూసింది. ఆమె తమ పౌరురాలేనని ధ్రువీకరించుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే తన దగ్గర రూ.10 వేల పాతనోట్లు ఉన్నాయని, వీటిని మార్చుకోవడానికి సహకరించాలని కోరుతూ చేతిరాతతో రాసిన లేఖ ఫొటోను ఆమె ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. విటులు టిప్‌గా ఇచ్చిన డబ్బును కూడబెట్టుకున్నానని, నోట్ల రద్దు సమయంలో ఆ డబ్బు వ్యభిచార గృహ నిర్వాహకుల వద్ద ఉండిపోయిందని వివరించింది. ఈ అభాగ్యురాలి వేదన నెటిజన్లు పలువురిని కదిలించింది.