breaking news
The Old City
-
రెపరెపలు అక్కడివరకేనా..?
పాతబస్తీ దాటని ‘పతంగి’ ప్రచారం మిగతా స్థానాల్లో కనిపించని హోరు సీటు దక్కని సిట్టింగ్‌లు ప్రచారానికి నై సాక్షి,సిటీబ్యూరో: మజ్లిస్ కంచుకోట పాతబస్తీలోనే ఆ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుండగా..మిగతా నియోజకవర్గాల్లో వెనుకబడిపోతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎన్నికల్లో గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన పార్టీ ప్రచారపర్వంలో మాత్రం పాతబస్తీ నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాల్లో పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తోంది.ఏకంగా కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంకు ఎన్నికలు పూర్తయ్యే వరకు విరామం ప్రకటించి మొఘల్‌పురాలోని ఒక ఫంక్షన్‌హాల్‌ను ఎన్నికల కార్యాలయంగా మార్చుకుంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానాలపైనే అధికదృష్టి సారించడంతో సిట్టింగేతర కొత్త స్థానాల్లో ప్రచారహోరు ఇంకా ఊపందుకోలేదు. పాతబస్తీకే పరిమితం మజ్లిస్ పార్టీ అగ్రనేతల పర్యటనలు పాతబస్తీకే పరిమితమవుతున్నాయి. పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ, చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారంలో తీరిక లేకుండా సాగుతున్నారు. సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. సిట్టింగ్ నియోజకవర్గాలు చార్మినార్, మలక్‌పేట, యాకుత్‌పురా, బహుదూర్పురాల్లో కూడా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గల్లీగల్లీకి తిరుగుతూ పతంగి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాంపల్లి, కార్వాన్ స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కనబెట్టి కొత్తవారిని బరిలోకి దింపడంతో అక్కడి ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ప్రచారం ఊపందుకుకోలేదు. కొత్త స్థానాల్లో ఊసేలేని ప్రచారం మజ్లిస్ కొత్తగా బరిలో దిగిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారహోరు ఇంకా పుంజుకోలేదు. అడపాదడప పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ తన లోక్‌సభ పరిధి దాటి ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లల్లో ప్రచారం చేస్తుండగా.. మిగతా నేతలు మాత్రం పెద్దగా తిరగట్లేదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఫర్వాలేదనిపిస్తున్నా..మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం పత్తా లేకుండా పోయింది. దీంతో ఈసారి గ్రేటర్‌వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ బరిలో దిగినప్పటికీ పతంగి ప్రచారం పాతబస్తీ మినహా మిగతా నియోజకవర్గాల్లో అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. -
వచ్చే 24 రోజులు అగ్నిపరీక్షే..!
హైదరాబాద్, సాక్షి: నగర పోలీసులకు రాబోయే 24 రోజులకు అగ్నిపరీక్షే. ఇప్పటికే ఎన్నికల బందోబస్తులో తలమునకలై ఉన్న పోలీసులకు ఈనెలలోనే వచ్చిన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్రల బందోబస్తు తలకుమించిన భారం కానుంది. ఈ రెండు ఉత్సవాలు, ఊరేగింపులో ఏ చిన్నపొరపాటు జరిగినా శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. గతంలో కర్ఫ్యూ వరకు దారి తీసిన సంఘటనలు జరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ముందస్తు బందోబస్తు ఏర్పాట్లపై కిందిస్థాయి అధికారులతో చర్చించారు. 8న శ్రీరామ నవమి నేపథ్యంలో ధూల్‌పేటలోని గంగాబౌలి నుంచి ప్రారంభ మయ్యే శోభాయాత్ర ఊరేగింపు పురానాపూల్, జాలిహనుమాన్, జుమ్మేరాత్‌బజార్, చుడీబజార్, ఛత్రీ, బేగంబజార్, సిద్ధంబర్‌బజార్, గౌలిగూడ మీదుగా రాత్రికి కోఠి హనుమాన్ వ్యాయామశాల వద్దకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభతో ముగుస్తుంది. అలాగే ఈనెల 15న హనుమాన్ జయంతి సందర్భంగా మరో శోభాయాత్ర ఊరేగింపు జరుగనుంది. ఇది గౌలిగూడ రాంమందిర్ నుంచి ప్రారంభమై పుత్లీబౌలి మీదుగా, కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, బోయిన్పల్లి తాడ్బన్ హనుమాన్ ఆలయానికి చేరుకొని.. రాత్రి అక్కడ బహిరంగసభతో ముగుస్తుంది. ఈ రెండు శోభయాత్రలు సాగే మార్గాల్లో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో పోలీసులు ప్రతిష్ట బందోబస్తును నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇక్కడ అదనపు బలగాలను వినియోగించాలని కమిషనర్ నిర్ణయించారు. అలాగే ఊరేగింపు పూర్తయే వరకు నిఘాను ఉంచాలని ఆదేశించారు. యాత్రల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా వాహనాలను దారి మళ్లించే ఏర్పాటు చేస్తున్నారు. మరో పక్క ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తయి, ప్రచారం జోరందుకుంటుండడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా చిన్న పొర పాటు జరిగినా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలున్నాయి.ఒకపక్క ప్రచారం కోసం అనుమతికై రాజకీయ పార్టీలు చేసుకునే దర ఖాస్తులను పరిశీలించడం, మరోపక్క ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులను మంజూరు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెషల్ బ్రాంచ్ అధికారుల సహాయం తీసుకోనున్నారు. ఎన్నికల ప్రచార అనుమతి ఇచ్చే ముందు అక్కడి స్థానిక స్పెషల్ బ్రాంచ్ అధికారి పంపిన నివేదికను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.