బస్సు సర్వీసును పొడిగించాలి
ఓబులవారిపల్లె: ఓబులవారిపల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని గాడవారిపల్లె నుంచి రైల్వేకోడూరుకు వైకోట మార్గంలో ఆర్టీసీబస్సును నడుపుతున్నారు. గాడివారిపల్లె నుంచి ఓబులవారిపల్లె మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్లదూరం మాత్రమే ఉంది. ఈ మార్గంలో కటికంవారిపల్లె, ముదినేపల్లె, జె.వడ్డిపల్లె, కొత్తవడ్డిపల్లె, ముదినేపల్లి అరుంధతీవాడ గ్రామాలున్నాయి.
పది సంవత్సరాలక్రితం ఓబులవారిపల్లె, వైకోట గ్రామానికి రోడ్డును ఏర్పాటుచేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మార్గంలో ఆర్టీసీబస్సు సర్వీసులను నడుపుతామని చెపుతున్నా ఇప్పటివరకు నడపలేదు. అయితే ప్రస్తుతం గాడివారిపల్లె వరకు నడుపుతున్న ఆర్టీసీబస్సును ఓబులవారిపల్లె వరకు పొడిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈమార్గం గుండా ఆటోలుకానీ ప్రైవేటు వాహనాలుకానీ లేవు. తద్వారా ఆర్టీసీకీకూడా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న బస్సులను కూడా తొలగిస్తే ప్రజలు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతొ ప్రజలు గాడివారిపల్లెకు వస్తున్న ఆర్టీసీబస్సును ఓబులవారిపల్లె వరకు పొడిగించాలని అధికారులను కోరుతున్నారు.