Oak Entertainment banner
-
ఇలాంటి కాన్సెప్ట్ ఈజీ కాదు
- ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. అశ్విన్, చేతన్, ధన్యా బాలకృష్ణన్, పూర్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం విజయోత్సవం మంగళవారం జరిగింది. ఓంకార్ మాట్లాడుతూ - ‘‘అవయవదానం గొప్పదనం చెప్పే సినిమా తీయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర అందించిన సపోర్ట్‌తో దసరా కానుకగా విడుదల చేసి, మంచి విజయం సాధించాం’’ అని చెప్పారు. ‘‘ఇది నా సెకండ్ హారర్ మూవీ’’ అని పూర్ణ అన్నారు. ‘‘టీమ్ అందరం బాగా కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి నాకు లైఫ్ ఇచ్చారు’’ అని హీరో అశ్విన్ చెప్పారు. నిర్మాత సాయి కొర్రపాటి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర కథానాయిక ధన్యా బాలకృష్ణన్, నటులు చేతన్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నా తమ్ముడు రెండు త్యాగాలు చేశాడు!
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘జీనియస్’ను ఆరు కోట్లలో తీయాలనుకుంటే పది కోట్లయ్యింది. దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చినా నిర్మాతకు ఆర్థిక సంతృప్తి లభించలేదు. అందుకే ఈసారి వీలైనంత తక్కువ బడ్జెట్లో, తక్కువ టైమ్‌లో సినిమా తీయాలనుకున్నా’’ అని ఓంకార్ అన్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయదర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది’. దసరా కానుకగా ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్‌కు మంచి మలుపు అయిన ‘ఆట’ గేమ్ షోలో నా తమ్ముడు అశ్విన్ కూడా పోటీపడ్డాడు. అశ్విన్ గెలిస్తే, షో నాది కాబట్టి గెలిచాడనుకుంటారని తనంతట తానుగా తప్పుకుని, త్యాగం చేశాడు. అలాగే, తనని హీరోగా పెట్టి ఓ సినిమా ప్రారంభిస్తే, నిర్మాతల కోరిక మేరకు వేరే హీరోతో తీయాల్సి వచ్చింది. ఆ విధంగా రెండోసారి కూడా నా తమ్ముడు త్యాగం చేశాడు. అందుకే అశ్విన్‌ని హీరోగా నిలబెట్టాలనే తపనతో ఈ సినిమా చేశా. నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర నా సినిమా కొనడం ఆనందంగా ఉంది. ఓ గ్రామంలో ఉన్న మహల్లోకి వెళ్లినవాళ్లందరూ చనిపోతుంటారు. ఏడుగురు వ్యక్తులు ఆ మహల్లోకి వెళితే ఏం జరిగిందన్నది చిత్ర కథాంశం. భయపెడుతూనే నవ్వించే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రం తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి కథ రెడీ చేసుకున్నాననీ, ‘రాజుగారి గది’ సీక్వెల్‌కి స్టోరీ రెడీ చేశానని ఓంకార్ అన్నారు.