నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, చెన్నై:రాష్ట్రం నుంచి రాజ్యసభకు 18 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో జీకే వాసన్, జయంతి నటరాజన్(కాంగ్రెస్), బాలగంగ (అన్నాడీఎంకే), జిన్నా, వసంతి స్టాలిన్(డీఎంకే), టీకే రంగరాజన్(సీఎం)ల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఈ స్థానాలు భర్తీ చేయాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. దీంతో గత వారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆ మేరకు మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. ఈనెల 28 వరకు దరఖాస్తుల స్వీకరణ, 29న పరిశీలన, 31న ఉపసంహరణ ప్రక్రియకు చర్యలు తీసుకున్నారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఎన్నికలు అనివార్యమైన పక్షంలో ఏడో తేదీ ఓటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన పనుల్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి ఏఎంపీ జమాలుద్దీన్ చేపట్టి ఉన్నారు. సచివాలయం, అసెంబ్లీ ఆవరణలోని కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్లను అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికలు అనివార్యమైన పక్షంలో అసెంబ్లీ ప్రధాన సమావేశ మందిరంలో ఓటింగ్‌కు ఏర్పాటు చేయనున్నారు.
నేడు శివ నామినేషన్: తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థిని డీఎంకే ప్రకటించింది. స్టాలిన్ వ్యతిరేకించినా, గారాలపట్టి కనిమొళి మద్దతుదారుడు కావడంతో తిరుచ్చి శివకు డీఎంకే అధినేత మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఆయనకు మద్దతుగా ఓట్లు దక్కేనా అన్న సందిగ్ధత నెలకొది. స్టాలిన్ తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న దృష్ట్యా, ఎక్కడ తన అభ్యర్థిత్వానికి చివరిక్షణంలో గండి కొడతారోనన్న బెంగతో మంగళవారం నామినేషన్ సమర్పించేందుకు తిరుచ్చి శివ సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే తమకు ఉన్న ఎమ్మెల్యేల బలం మేరకు నలుగురు అభ్యర్థులను తొలుత ప్రకటించడం ఖాయం. ఒక వేళ వామపక్షాల మధ్య సఖ్యత కుదరకున్నా, తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చినా, చివరి క్షణంలో మరో అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలున్నాయి. నామినేషన్ల పర్వం ఆరంభం అవుతోండటంతో అన్నాడీఎంకే అభ్యర్థులు ఎవరన్నది ఒకటి రెండు రోజుల్లో తేలడం ఖాయం.