breaking news
no works
-
పలుకుబడికే ఉపాధి పనులు
నేరడిగొండ : దేవుడు వరమ్మిచినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది.. అధికారుల నిర్లక్ష్యంతో మహాత్మా గాంధీ ఉపాధిహామీ ఫలాలు రైతులకు అందడం లేదు. ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం ఈజీఎస్‌లో రైతులకు ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పనులు చేర్చి నిధులు కేటాయిస్తోంది. కానీ సంబంధిత అధికారులు, ఉపాధి సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ పథకం కొందరికే పరిమితమైంది. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఉపాధిలో వివిధ వ్యవసాయ ఆధారిత పనులు చేర్చుతూ ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో రైతుల అభివృద్ధికి ఆ పథకం ద్వారా ఒకట్రెండు పనులు మాత్రమే చేపట్టింది. కానీ ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచి రైతుల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది. రైతులకు చేరువకాని వైనం... రాజకీయంగా ఎంతోకొంత పలుకుబడి, అధికారులతో కాస్తోకూస్తో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఉపాధిహామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఫలాలు అందుతున్నాయి. చదువురాని సన్న,చిన్నకారు రైతులకు మాత్రం ఏమీ దక్కడంలేదు. ఎలాగో ఒకలా ఈ పథకాల గురించి తెలుసుకొని స్థానిక ఉపాధిహామీ సిబ్బందిని అడిగితే ఆ పని ఈయేడాది కాదు, వచ్చే యేడాది చూద్దాములే అంటూ దాటవేస్తున్నారు. లేకపోతే ఈ పనికి ఇంత ఖర్చు అవుతుందని, ఆ పని అంత అవుతుందని ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండలస్థాయి అధికారుల వరకు లెక్కలువేసి మరీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఖర్చులు ఇవ్వలేని సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కరువు.. ఉపాధిహామీ పథకం ద్వారా అనేక రకాలుగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పనులు చేపడుతున్నప్పటికీ అవగాహన కల్పించకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగడం లేదు. ఆసక్తి ఉన్న కొందరు రైతులకు అధికారులు సహకారం ఇవ్వకపోయినా సొంత ఖర్చులతో పాంపండ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఉపాధిహామీ పథకం ద్వారా రైతుల సంక్షేమం కోసం చేపట్టే పనులపై విస్తతంగా ప్రచారం చేపట్టాలని గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులకు సైతం పనులు, పథకాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సర్ధన రోడ్డుకు మోక్షమెప్పుడో?
నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా ముందుకు సాగని పనులు రోడ్డు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ నరకయాతన పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు మెదక్: మారుమూల గ్రామాల అభివృద్ధికోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ...రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తుంటే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తు పనులను ముందుకు కదల నీయడం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. నిధులు సకాలంలో మంజూరైన పనులను ప్రారంభించడంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా అధికారులు ఎమిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ నుంచి మండలంలోని సర్ధన గ్రామానికి 14.7కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇది సింగిల్‌రోడ్డు కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించడానికి నరక యాతన పడుతున్నారు. ప్రభుత్వం ఈ రహదారికి గత ఏడాది రూ.18కోట్లు మంజూరు చేసింది. కాగా ఆన్లైన్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నేటికి పనులు ప్రారంభించిన పాపాన పోలేదు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మెదక్ పట్టణం నుంచి సర్ధన వరకు మద్దుల్వాయి, ముత్తాయికోట, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, జక్కన్నపేట, సర్ధనతోపాటు పలు గిరిజన తండాలకు ఈ రహదారే ఆధారం. కాగా ఇది సింగిల్‌రోడ్డు కావడం వల్ల చాలా కాలంగా ఆయా గ్రామాల ప్రజలు రవాణా విషయంలో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ గ్రామాల వెంట నిత్యం 300 నుంచి 500మంది విద్యార్థులు మెదక్ పట్టణానికి వచ్చి చదువుకుంటారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సు నడిపించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ రహదారి ఓ వాహనం ఎదురుగా వస్తే మరో వాహనం వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటి సర్ధన రోడ్డును 4లైన్లుగా నిర్మించేందుకు ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. కాగా గత ఏడాది మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించని చందంగా సర్ధన రోడ్డు పరిస్థితి మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గతుకులరోడ్డుతో నరకం మెదక్-సర్ధన ప్రధాన రహదారి అడుగడుగున గుంతలమయంగా మారి ఇబ్బందులు తప్పడం లేదు. ఇది సింగిల్‌రోడ్డు కావడం వల్ల మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. రోడ్డు మరమ్మతుల కోసం రూ.18కోట్లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నేటికి పనులు ప్రారంభించలేదు. - జవ్వాజి యాదయ్య, ఫరీద్పూర్. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టండి సర్ధన-మెదక్ ప్రధాన రహదారి మరమ్మతులు కోసం రూ.18కోట్లతో పనులు వెంటనే చేపట్టాలి. ప్రస్తుతం గతుకుల రోడ్డు, సింగిల్‌రోడ్డు కావడంతో ప్రయాణం నరకంగా ఉంది. ద్విచక్ర వాహనం వెళ్లాలంటే గుంతల రోడ్డుతో ఆస్పత్రి పాలు కావాల్సిందే. - వెంకాగౌడ్, ముత్తాయిపల్లి