వెలుగు వెనుక చీకటి నిజాలు
ఎల్ఈడీ సరఫరాలో ఏకపక్ష నిర్ణయాలు
రూ. కోటి 52లక్షల కాంట్రాక్టుకు టెండర్లు పిలవని వైనం
గతేడాది భారీగా లబ్ధిపొందిన ఓ సంస్థ
అధికారులు, నేతల ప్రమేయంపై అనుమానాలు
తాజా టెండర్లతో బట్టబయలైన వ్యవహారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మన ఇంటికి ఏదైనా వస్తువు కొనాలంటే ఏం చేస్తాం. నాలుగు దుకాణాలు తిరిగి ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడే కొంటాం. కానీ సర్కారు సొమ్ము కదా... అందుకే కోట్లలోని కాంట్రాక్టును నాయకుల సిఫార్సులతో ఎలాంటి టెండర్లేకుండా అప్పగించేశారు. ప్రత్యేకించి ఓ సంస్థపై అవ్యాజమైన ప్రేమ చూపించారు. పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల సరఫరాకు నేరుగా అనుమతులు ఇప్పించేశారు. ఈ ఏడాది టెండర్లు పిలవగా భారీగా ధరలు తగ్గించి టెండర్లు ఖరారు చేసుకోవడంతో గత ఏడాది దోపిడీ తేటతెల్లమైంది. దీనివల్ల ఆ సంస్థ దాదాపు రూ. 60లక్షల మేర లబ్ధిపొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీలకు ఎల్ఈడీ సరఫరా చేయడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ సంస్థపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ... అటు నాయకులు, ఇటు అధికారులు పెద్ద ఎత్తున లాభం చేకూర్చేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. గతేడాది 24వాట్స్ ఎల్ఈడీ లైట్ రూ. 2241ల వంతున 5291లైట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడదే లైటును రూ. 1386కు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 48వాట్స్ లైట్‌ను రూ. 4716 వంతున 725 కొనుగోలు చేశారు. ఇప్పుడదే లైట్‌ను రూ. 2628కు కొనుగోలు చేస్తున్నారు. అంటే నెలల వ్యవధిలో 24వాట్స్ రేటులో ఒక్కొక్క దానికి రూ. 855, 48వాట్స్ రేటులో ఒక్కొక్క దానికి రూ. 2,088 మేర తేడా వచ్చింది. ఈ రేటు తేడా రావడానికి ప్రధాన కారణమేంటంటే గతేడాది టెండర్లు పిలవకుండానే ఓ సంస్థకు సరఫరా బాధ్యత కట్టబెట్టగా, ఈ ఏడాది టెండర్ల పిలవడం ద్వారా అప్పగించడమే.
ఎల్ఈడీ లైట్ల ముసుగులో దోపిడీ
ఎల్ఈడీ లైట్ల ముసుగులో దోపిడీ జరిగింది. ఇందులో ఎవరి వాటా ఎంతో తెలియదు గాని రూ. 60లక్షల వరకు అదనపు భారం పడింది. నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చేశారు. 2014–15లో అడ్డగోలుగా ఎల్ఈడీ లైట్ల సరఫరా బాధ్యతల్ని ఓ సంస్థకు అప్పగించారు. తప్పు తెలుసుకున్నారో, దోపిడీని గుర్తించారో తెలియదు గాని ఈ సారి మాత్రం టెండర్లు పిలిచి కట్టబెట్టారు. ఇందులో కూడా ఓ అధికారి నిర్వాకంతో గతంలో లబ్ధిపొందిన సంస్థకు అయాచిత లబ్ధి చేకూర్చారు.
నిబంధనలకు టెండర్
2014–15లో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఎంపీ ల్యాడ్స్ నుంచి 34పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు వేసేందుకు నిర్ణయించారు. పంచాయతీల భాగస్వామ్యంతో వీధి లైట్లను దాదాపు సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా లైట్ల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచారు. రూ. కోటి 52లక్షల 76వేల 236 విలువైన కాంట్రాక్టును టెండర్లు పిలవకుండానే ఐలెట్ అనే సంస్థకు కట్టబెట్టారు. సాధారణంగా కాంట్రాక్ట్ విలువ రూ. 10లక్షలు దాటితే తప్పనిసరిగా టెండర్లు పిలవాలి. కానీ ఇక్కడ టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా ఐలెట్ సంస్థకు అప్పగించారు. ఇందులో ఇద్దరు అధికారులు, ఓ టీడీపీ నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
తాజా టెండర్లలోనూ ఆ సంస్థకు లబ్ధి
తాజా టెండర్లలో 24వాట్స్ ఎల్ఈడీ లైట్‌ను రూ. 1386కు సరఫరా చేసేందుకు ఓ సంస్థ బిడ్ వేయగా, గతంలో భారీగా లబ్ధిపొందిన ఐలెట్ సంస్థ మాత్రం రూ. 1550కి సరఫరా చేస్తామని బిడ్ వేసింది. అయినప్పటికీ వడ్డించే వాడు మనోడైతే చివరిబంతిలో కూర్చొన్నా ఫర్వాలేదన్నట్టు ఎక్కువ కోట్ చేసినప్పటికీ సదరు సంస్థకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. రేట్ ఆఫ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తక్కువగా కోటైన మొత్తానికి సరఫరా చేయాలంటూ ఐలెట్ సంస్థకు సగం కాంట్రాక్ట్ ఇచ్చారు. దీన్నిబట్టి తెరవెనుక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఎంపీ నిర్ణయించిన ధరకే ఇచ్చాం– ఎస్ సత్యనారాయణ రాజు, జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి అశోక్ ఒక్కో బల్బుకూ రూ.1551 ధర నిర్ణయించారు. ఈ ధరకన్నా తక్కువగా 1386 రూపాయలకు కోట్ చేశారు. ఇతనితో పాటు కేంద్ర మంత్రి నిర్ణయించిన ధరకు కోట్ చేసిన వారికి కూడా ఇచ్చాం. అంతకన్నా తక్కువకు ఎవరూ వేయలేదు. గతేడాది టెండర్లు పిలవని సంగతి నాకు తెలియదు.