breaking news
Nirosha Radha
-
ఎం.ఆర్. రాధా బయోపిక్
ఎం.ఆర్ రాధ... తమిళంలో పాపులర్ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట. -
అందుకే మాకు పిల్లలు వద్దనుకున్నాం : నిరోషా
మణిరత్నం ‘ఘర్షణ’ సినిమాలో‘ఒక బృందావనం... సోయగం’ అంటూ కవ్వించిన సోయగం గుర్తుంది కదూ! ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’లోచిరంజీవితో ‘నీతోనే ఢంకా పలాసు’ అంటూసయ్యాటలాడిన సుందరి నిరోషాను తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరచిపోలేరు.రాధిక చెల్లెలిగా ఎంటరైన నిరోషాతన నిషా నటనతో దక్షిణాది వెండితెరపై ‘సిందూర పువ్వు’లా విరబూశారు.ఇంతకూ ఈ నిరోషా ఏమయ్యారు?ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు?ఇటీవలే హైదరాబాద్‌లో సడన్గాప్రత్యక్షమైన నిరోషాతో ‘సాక్షి’ స్పెషల్ టాక్. అన్నట్టు నేడు ఈ బొద్దుగుమ్మ పుట్టిన రోజు కూడానూ. చాలా రోజుల తర్వాత కనిపించారు. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. నా సొంత సంస్థలో ‘తామరై’, ‘చిన్న పాప పెరియ పాప’ అనే టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాను. తెలుగు భాష గుర్తుందా? భలేవారేనండి. తెలుగు ఎలా మర్చిపోతాను. నారీ నారీ నడుమ మురారి, కొబ్బరి బొండాం, స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్... ఇలా మంచి మంచి సినిమాలు చేశాను. తెలుగు భాషనూ మర్చిపోలేదు.. తెలుగు పరిశ్రమ మీద ప్రేమా పోలేదు. మరి.. తమిళంలో కీలక పాత్రలు చేస్తున్నారు కదా! తెలుగులో ఎందుకు చేయడంలేదు? తెలుగులో మానేయలేదు. కొంచెం విరామం తీసుకున్నానంతే. కథానాయికగా ఇక్కడ మంచి మంచి పాత్రలు చేశాను. అలాగే, సహాయ నటిగా మంచి పాత్రలు వస్తే చేయాలనుకుంటున్నాను. ‘ఘర్షణ’ టైమ్‌లో మెరుపు తీగలా ఉండేవారు. ఎందుకని హఠాత్తుగా లావయ్యారు? కథానాయికగా సినిమాలు మానేశాక.. ఫిజిక్ గురించి పట్టించుకోలేదు. ఆ మధ్య కఠినమైన వ్యాయామాలు చేసి, కొంచెం తగ్గాను. కానీ, నా దురదృష్టం ఏంటంటే.. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నెలన్నరగా వర్కవుట్లు చేయలేదు. దానివల్ల కొంచెం బరువు పెరిగాను. ఇప్పుడు కొంచెం ఫరవాలేదు. అందుకని మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టాను. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అప్పట్లో ‘ఘర్షణ’ చేశాను కదా. ఇప్పుడూ అలానే చేస్తానంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు లక్ ఏంటంటే.. గ్లామరస్ అమ్మ, అక్క, వదిన పాత్రలుంటున్నాయి. అలాంటివి చేయడానికి రెడీగా. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. కథానాయికగా కెరీర్ బాగున్న సమయంలోనే సినిమాలు చేయడం తగ్గించేశారు. ఎందుకలా? కావాలని తగ్గించలేదు. తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటిరెండు, కన్నడంలో.. ఇలా మూడు భాషల్లో చేయడం వల్ల ఏ భాషలోనూ పెద్దగా సినిమాలు చేసినట్లుగా ఎవరికీ అనిపించడం లేదు. తెలుగులో ‘పచ్చని సంసారం’ చేస్తున్నప్పుడు కన్నడంలో ఎక్కువ సినిమాలు ఒప్పుకున్నాను. ఆ కారణంగా తెలుగుకి దూరమయ్యాను. మీ సోదరి రాధిక మీకు సలహాలు ఇస్తుంటారా? ‘నువ్వు సక్సెస్ అవుతావ్.. ట్రై చెయ్’ అని తను చెప్పడంవల్లే సినిమాల్లోకొచ్చా. మీ పెళ్లి విషయానికొద్దాం. ‘సింధూర పువ్వు’ చిత్రంలో మీ పక్కన హీరోగా చేసిన రాంకీనే ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ లవ్‌స్టోరీ గురించి? ఆ సినిమా టైమ్‌లో ప్రేమలో పడ్డాం. పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నాం. మీ పెళ్లయ్యి దాదాపు 20 ఏళ్లయ్యింది. పిల్లలు వద్దనుకున్నారా? అవును. తల్లిదండ్రులు లేని పిల్లలకు మేం అమ్మా, నాన్నా అవ్వాలనుకున్నాం. అలాంటి పిల్లలకు మా వంతు సహాయం చేస్తున్నాం. ఇది ఇద్దరి నిర్ణయమా? అవును. ‘పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్లని పెంచి, పెద్ద చేస్తాం. ఇంతేనా జీవితం అంటే...’ అనుకున్నాం. ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నాం. అందుకే, మాకు పిల్లలు వద్దనుకున్నాం. మేం సంపాదిస్తున్న డబ్బులో చాలావరకు నిరాదరణకు గురైన, అనాథలైన పిల్లల సహాయార్థం ఉపయోగిస్తున్నాం. చాలామందిని చదివిస్తున్నాం.. వైద్య సహాయం చేస్తున్నాం. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే వార్త వచ్చింది. అవన్నీ తొలగిపోయాయా? కష్టసుఖాలేవీ నిరంతరం కాదు. జీవితం అన్నాక ఎవరికైనా ఒడుదొడుకులుంటాయి. మేం మా సమస్యలను అధిగమించేశాం. మీ 20 ఏళ్ల వైవాహిక జీవితం గురించి ఏం చెబుతారు? మేమిద్దరం అదృష్టవంతులమే. ఇద్దరి ఆలోచనలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వివాహ జీవిత పరంగా నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ప్రస్తుతం కెరీర్ పరంగా మీ ప్రణాళికల గురించి? నా భర్త రాంకీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నా. సినిమాకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ ఆయన పని చేశారు. ఓ ఫ్యామిలీ డ్రామాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు నిర్మించాలన్నది మా లక్ష్యం.