Nirmala Reddy chilkamarri
-
మట్టికి మొక్కుత!
నేను నా దైవం ఏ దిక్కుకు దండం పెట్టాలి? దేవుడే దిక్కు కదా! ఆకాశంలోని కుండకు మొక్కాలా? కుండను చేసిన మట్టికి మొక్కాలా! మట్టికి మొక్కాలా? దాని బిడ్డకు మొక్కాలా! ఏ మొక్కకు మొక్కాలి? అడవంతా దేవుళ్లే కదా! రాతిని చేసిన దేవుడికి మొక్కాలా? దేవుణ్ణి చెక్కిన ఉలికి మొక్కాలా! ప్రతిమకు మొక్కాలా? ప్రతినిధికి మొక్కాలా! ప్రసాదం పెట్టే దేవుడికి మొక్కాలా? నైవేద్యమే లేని అమ్మోరికి మొక్కాలా! గర్భగుడిలో సామికి మొక్కాలా? ఆకలి కడుపులో గర్భానికి మొక్కాలా! అవ్! దైవానికి మొక్కాలా? దైవత్వానికి మొక్కాలా! ‘ఏదీ... దేవుణ్ణి చూపించూ!’ అన్న తర్కానికి మొక్కాలా? ‘ఇందుగలడందులేడన్న సందేహం వలదు’ అన్న విశ్వాసానికి మొక్కాలా! అయ్యకు మొక్కాలా? అమ్మకు మొక్కాలా! పదాలకు మొక్కాలా? పాటకు మొక్కాలా! అక్షర మల్లెల్ని అల్లే... జానపదానికి మొక్కాలా? జానపదానికి తోబుట్టువు... మన గద్దరన్న మొక్కిన దేవుళ్లకు మొక్కాలా! సాక్షి... తన పాఠక దేవుళ్లకు ప్రతి బుధవారం... ఇలా మొక్కు తీర్చుకుంటుంది. ఆఫీసులో ‘నేను నా దైవం’ శీర్షిక అనుకున్నప్పుడు ముందు ఎవరితో మాట్లాడితే బాగుంటుందనే చర్చ వచ్చింది. దైవాన్ని ఓ కొత్త కోణంలో చూసే వ్యక్తి, పాటనై వస్తున్నానమ్మా! అని పలకరించే వ్యక్తి గద్దర్ అయితే బాగుంటుందనుకున్నాను. ఇరవై ఏళ్ల క్రితం గద్దర్‌పై బుల్లెట్ దాడి జరిగింది ఈ నెలలోనే! బతుకుపోరాటంలో దేవుణ్ణి గద్దర్ ఏవిధంగా దర్శించారు? ఈ ఆలోచనతోనే హైదరాబాద్ అల్వాల్‌లోని గద్దర్ ఇంట్లో ఉదయం 9 గంటలకు ఆయన్ను కలుసుకున్నాం. ∙ గుడ్‌మార్నింగ్ సర్. ఉదయం నిద్ర లేస్తూనే ఏ దైవాన్ని తలుచుకున్నారు. (తెల్లని జుట్టును వెనక్కి తోసుకుంటూ... జెండాను భుజానికి ఆనించుకొని రెండు చేతులతో నమస్కారం చేస్తూ..) మా అమ్మను యాది జేసుకున్న. అమ్మకు దండం పెట్టుకున్న. అప్పుడే నన్ను బతుకంతా నడిపిన అమ్మలకు మొక్కుతా.. ‘ననుగన్నతల్లుల్లారా వందనమో.. దయగల తల్లుల్లారా పాదాభివందనమో!’ అని పాడుకున్న. ∙ అంటే, మీరు ఏ దేవుణ్ణీ పూజించరా? ఇగో, ఈ మొక్క పేరేందో తెల్వదు.(బాల్కనీలో ఉన్న ఓ మొక్క ఆకును పట్టుకొని చూపుతూ) దీనికి మొక్కుత. ఇది నాకు పండిస్తది, గాలిస్తది. బతుకునిస్తది. నేను అడవిల ఉన్నప్పుడు అక్కడ అడవి బిడ్డలతో కలిసి విత్తనం వేసేటప్పుడు మొక్కేది. పంట వచ్చేటప్పుడు మొక్కేది. కోతలేసినప్పుడు, కుప్పలు నూర్చినప్పుడు మొక్కేది. ఆ గింజలను వండి, ముందు అడవితల్లికి పెట్టి, ఆ తర్వాత తినేవాళ్లం. మా ఇంట్ల మొత్తం జూడు ఒక్కతాన కూడా దేవుని పటం కనపడదు. తులసి చెట్టు మాత్రం ఉంది. ఆ మొక్క మా నాయినమ్మ మా అమ్మకు ఇచ్చిందంట. మా అమ్మ మా ఆవిడ (విమల)కు ఇచ్చింది. మా ఆవిడ ఆ మొక్కకు రోజూ నీళ్లు పోస్తది. ‘ననుగన్న తులసీ నీకు వందనాలమ్మా, వందనాలమ్మా! ఈ మనిషి కోసం నీవు ఆక్సీజన్ అయితావంట. సచ్చేముందు నువ్వు తీర్థమైతావంట. ఓ తులసీ మొక్కమ్మో నీకు వందనాలమ్మ!’ అని తులసి మీద పాటగట్టిన. ∙ ఈ మధ్య గుళ్లకు తిరుగుతున్నారు... ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని పల్లె పల్లె తిరుగుతున్న. దీంట్ల భాగంగనే అక్కడి గుళ్లకూ పోతున్నా. కోట్లాది మంది మొక్కే కొమరెల్లి మల్లన దగ్గరకు మొన్నీమధ్యేబోయిన. అక్కడ మా అమ్మను తల్సుకొని పాట పాడిన. ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఎన్నాళ్లు ఏడ్సేవు ఎంతాని ఏడ్సేవు లచ్చుమమ్మో! ఏడ్సినా తుడ్సినా ఏమి సాధించేవు. నీ సాటి చెల్లెళ్లు, నీతోటి తమ్ముల్లు ఎర్రదండుల జేరి ఎత్తిండ్రు కొడవళ్లు. కొడవళ్లు నూరుకొని లచ్చుమమ్మో కొమరెల్లి కొండల్లో కొరివి రాజేసిండ్రు’ అంటూ ‘నువ్వూ కొడవళ్లు నూరుకో’ అని జెప్పిన. సాంస్కృతిక ఉద్యమంలో ప్రజల నమ్మకాలను విప్లవీకరించాలి. ∙ గుడికి వెళ్లివనప్పుడు ఏమని మొక్కుతరు? మొన్నామధ్య యాదగిరి గుట్టకుబోయిన. పంతులుతో– ‘సామీ.. 1970లో జూసినప్పుడు నర్సన్న బండ సొరెకల ఉండేటోడు. ఇదేంది ఇట్లున్నడు అనడిగితే ‘ఒరిజనల్ దేవుడు అడ్నే ఉన్నడు. ఇక్కడున్నది డూప్లికేట్’ అన్నడు. అప్పుడే పాటందుకున్న– ‘యాదన్న మా యాదన్న.. యాదగిరి నర్సన్న. యాదాద్రివైనావ్ యాది మర్సిపోకన్నా! పుట్టినా మా బిడ్దకు, పుట్టబోయే కొడుకుకు యాదమ్మ, యాదగిరి అని పేరుబెట్టుకున్నామ్. నువ్వు పేరు మార్సుకోని మా పేరు తుడిపేయకో యాదన్న మా యాదన్న’ అని పాడిన. 1980ల తిరుపతి కొండ ఎక్కిన. ఆ కొండ మీద పాట గట్టిన, ఆ బస్సుల మీద పాట గట్టిన. ఆడ పంతులు నెత్తిన శఠగోపం బెట్టిండు. ఇగ జూస్కో అందరూ ఇదే ముచ్చట. (నవ్వులు). ఆ మధ్య పోలవరం వస్తది. గుడి మునుగతది అన్నరు. అప్పుడు భద్రాచలం పోయిన. గుళ్లోకిపోయి వచ్చినంక అడిగిండ్రు. ‘ఎవరికి మొక్కినవ్!’ అని. ‘సీతమ్మతల్లికి మొక్కిన’ అంటే ‘ఎందుకు?’ అని అడిగిండ్రు. రామునికి సీతమ్మపై ఒట్టి ప్రేమనే ఉంది. సీతమ్మకు రాముని మీద ప్రేమ, విశ్వాసం రెండూ ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం రెండూ ఉంటెనే పెండ్లి నిలబడ్తది అని జెప్పిన. ఈ గద్దర్ సీతమ్మ పక్షపాతి. ∙ మరి ఈ మధ్య శివుడిని తలుస్తున్నారు. శివతత్త్వం గురించి పాడుతున్నరు... ఏదో ఒకటి తోక పట్టుకుంటరు. అదే గుంజతరు. ఇప్పుడు ఓం నమఃశివాయ నడుస్తుంది. నడవనీ! చిన్నప్పట్నించి దేవుండ్లను గౌరవించేవాణ్ణి. కానీ, నమ్మలేదు. మా నాయిన గొప్ప శివభక్తుడు. చిన్నప్పుడు మా నాయనతో కూడి వందలాది భజనలు జేసిన. కీర్తన్లు పాడిన. బాగోతులు ఆడిన. అట్ల అని పొద్దున లేచి స్నానం చేసి శివ శివ అంటూ పూజలు చేస్తూ కూర్చోను. ∙ క్రీస్తు, బుద్ధుని గురించీ చెబుతుంటారు... బుద్దిజాన్ని నమ్మిన. దాంట్ల కనపడని దేవున్ని మొక్కమని జెప్పరు. ‘గుజిమల్లే పూలో గుజిమల్లే పూలో.. రాగి చెట్టుకింద రాజెవ్వడమ్మ గుజిమల్లెపూలో! ప్రజ్ఞ, కరుణా సమత.. ఆ మూడు కలిసినాడే మనిషిన్నన్నదెవరో.. గుజిమల్లేపూలో! భగవంతుడే ఒక్క భ్రమ అని చెప్పిన భాగ్యశీలి ఎవ్వడే గుజిమల్లెపూలో!..’ అని పాడిన. అట్లనే ఏసు గురించి...‘ శిలువ మీద నిలిచిన దీపమా! మరణమే లేని శాంతి రూపమా!’ అని పాడిన. అట్లనే బసవన్న గురించి ‘వందనాలు వందనాలూ బసవన్నో. అంటరాని గుండె మీద ఆత్మలింగం నీవన్నో!’ ఇట్ల పాడని పాట లేదు తల్లీ! చెట్టు, కొమ్మ, చేమ, పుట్ట, రాయి, చీపురు అన్నీ పాడిన. ∙ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి కొలుస్తరు... మరి మీరు ఎవరిని తలుచుకునేవారు.. ఏ కష్టమొచ్చినా ‘అమ్మా’ అని అమ్మను తలుసుకుంట. ఉద్యమాలలో అసువులు బాసిన వారిని, వారి కన్నతల్లులను చూసినప్పుడు ఆ దుఃఖం గురించి ఎంతని సెప్పేది. అప్పుడొచ్చిందో పాట.. ‘ఓలీ ఓలీల రంగ ఓలీ చెమ్మకేళిల ఓలి. కొడుకులారా మిమ్మలానూ వోలీ కల్లగూడ మర్సిపోను ఓలీ! బిడ్డలారా మిమ్ములానూ ఓలీ, బాధలల్ల మర్సిపోను ఓలీ. కసి తీర్సుకో నీవు ఓలీ చెమ్మకేళిల వోలీ.. కాళమ్మలవుతాం ఓలీ చెమ్మకేళల ఓలీ..’ అంటూ పాడిన. ఆ తల్లులను మీరంతా కాళికవ్వాలని పాటలో చెప్పిన. నిన్న మొన్న అన్ని పార్టీలోల్లు బోనాలు ఎత్తుకుండ్రు. బతుకమ్మలను ఎత్తుకున్నరు. ‘ఇయ్యాల రేపంట లస్కర బోనాలంట. మన బోనాలెన్నడమ్మో లచ్చుమమ్మా, లచ్చుమమ్మా! నా ఈపెనక ఈపోడు ఇల్లిడిసిపోయిండు. ఆడు యుద్ధంల గెలిసి ఇంటికిస్తే బాలమ్మో ఎర్రబోనం సిద్దం చేస్తా ఓ బాలమ్మ!, మా ఊరి లీడరోడు మహా చాలుగాడు తల్లీ. ఓట్లేసుకునేదాక ఒంగి ఒంగి మొక్కిండు. ఓట్లల్ల గెల్సినంక బూట్లు జూపిస్తుండు’’ అని పాడిన. ప్రజల విశ్వాసాలను గౌర వించాలి. వారి నమ్మకాలను మూఢనమ్మకాలుగా మార్చకూడదు. ∙ ఇప్పుడున్న ఆచారాలు... వ్యవహారాల గురించి? మనిషి తరతరాలుగా కొన్ని ఆచరాలు పెట్టుకొని, వాటిని ఆచరిస్తూ ఉన్నాడు. వాటిని అందరూ గౌరవించాలి. అయితే, అవి రాను రాను మూఢాచారాలు అయ్యాయి. వాటిని గౌరవించలేం. మేం దళితులం. దళితలకు ఏం ఆచారాలు ఉంటయి. మావి అంటరాని కుటుంబాలు. మాకు దేవుడు లేడు. గుడి లేదు. మనుషులుగా గుర్తించబడని మనుషులం. పొద్దుగుంకేదాక కష్టం చేస్తం. మా అమ్మకో, నాయినకో ఏడాదికొక్కమారు తల్చుకొని దణ్ణం పెట్టుకొని, భోజనం పెట్టి, అదే మేం తింటం. ఇప్పుడు మావోళ్లూ కొందరు పూజలు, వ్రతాలు జేస్తుంటరు. పిలుస్తరు. పోతా! దణ్ణం పెట్టుకోమంటే పెడ్త. ప్రసాదం తీసుకోమంటే తీసుకుంట. ఎవరినీ అగౌరపరచను. ∙ మనుషుల్లో దైవం ఉందంటారు. అలా ఆ దైవం మీకు కనిపించిన సందర్భాలు.. ఎందుకు లేవు? నేను అరణ్యంల ఉన్నప్పుడు. కన్నబిడ్డలకు తిండిపెట్టకుండా మా కోసం సద్ది కట్టి పంపించిన తల్లులున్నారు. ఆళ్ల కడుపులుగట్టుకొని మాకు ముద్ద పెట్టేవోళ్లు. వాళ్లు మాకు దేవతలు. దైవం ఉపశమనం ఇవ్వదని నేను అన. అయితే, అది తాత్కాలిక ఉపశమనం ఇస్తది. రాకెట్ పంపించేటప్పుడు ‘దేవుడా, ఇది ఫలించేలా చేయ్’ అని మొక్కుతుండ్రు. గుళ్లో కొబ్బరికాయలు కొడుతుండ్రు. అదంతా తాత్కాలిక ఉపశమనమే ఇస్తది. పరిష్కారం ఇవ్వదు. ∙ మీ కుటుంబ జీవితంలో దైవం గురించి... నా కుటుంబంతో జీవించిందే శానా తక్కువ. నా పిల్లలకు ఏనాడూ దేవుణ్ణి గురించి చెప్పలేదు. నా భార్య విమలనే ఆళ్లను పెంచింది. ఆమె గుళ్లూ గోపురాలకు తిప్పలేదు. మాబతుకే ఒక పోరాటం. పాట ద్వారా ప్రజల్లోకి మహోన్నతమైన శక్తిని తీసుకెళ్లగలిగిన. మీ మతాలు మీవి. మీ విశ్వాసాలు మీవి. దాన్ని నేను కాదన. కానీ, నా పాట ద్వారా ఏది మంచిదో చెబతా! గుడి–బడి రెండింటిలో ఏది మంచిదంటే బడే అంట. అక్కడ కులం లేదు మతం లేదు. జ్ఞానం ఒక్కటే ఉన్నది. చనిపోయిన మా చిన్నకొడుకు ఇక్కడి బడిలో గోడమీద మీద రాసిన ఓ మాట ఇప్పటికీ ఉంది. ‘జ్ఞానం ఒక్కటే చివరకు మిగిలిపోవును’ అని. అదే నేను నమ్ముతా! అదే, అందరికీ కావాలని మొక్కుత. ∙ మీ మాటల్లో స్పిరిచ్యువల్ డెమొక్రసీ అనే పదం వినిపిస్తోంది! గా చెట్టుకింద పోశమ్మ గుడి ఉంది. దానికి తలుపుల్లేవు. తాళం లేదు. పూజారి లేడు. ఆ గుళ్లనే కుక్కలు పంటయి. అండ్లనే పిల్లలను గంటయ్! పోశమ్మను ఊరూర్లో మొక్కుతరు. మరి ఈడేంది?! మా ఇంటికి దగ్గర్లనే ఏడు గుళ్లు అని పెద్ద గుడి ఉంది. అక్కడ దేవుడ్ని లోపలపెట్టి తలుపు, తాళం వేస్తరు. పూజారిపోయి గంట గొట్టి తాళం తీస్తడు. ఈ జనం అక్కడకే పోయే హుండీల పైసలేస్తరు. చెట్టుకింద పోశమ్మ గుడీ గుడే! తాళం వేసిన ఆ పెద్ద గుడీ గుడే! అయితే, అందరిలో ఉన్న దేవుడే నాకు దేవుడు. తాళాలు వేసుకొని భద్రంగా ఉండేటోడు కాడు. అడవిబిడ్డలకు సమ్మక్క, సారమ్మలు చెట్లరూపంలనే ఉన్నరు. పోశమ్మ, మైసమ్మ దేవతలను ఊరూర్లో మొక్కుతరు. దీన్నే స్పిరిచువల్ డెమాక్రసీ అంటాను. ఇదే నాకు నచ్చుద్ది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సఖీ.. ఎంత లక్కీ!
భార్యను ఆటపట్టించకపోతే తను భర్తెలా అవుతాడు? భర్తను ఆటాడించకపోతే ఆమె మిసెస్ బంగారం ఎలా అవుతుంది? రోజూ పొగడ్తలు వింటే బోరు కొట్టదూ! కాఫీలో చక్కెర తక్కువైందనో సినిమా చూసి చాలాకాలం అయిందనో ఒకర్నొకరు విసుర్లాడుకోకపోతే ప్రేమ పూసేదెలా? విరగ కాసేదెలా? అవును. చిన్నచిన్నగా సఖ్యతను పెంచుకుంటుంటే.. పెద్దపెద్ద అభిప్రాయాలలోనూ ఏకభావన వస్తుంది. సఖీ... చిన్నచిన్న సంతోషాలు ఎంచుకో. సఖ్యత పెంచుకో. పొంచివున్న నక్కల నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. ‘సఖీ.. ఎంత లక్కీ!’ అనిపించుకో. ఆఫీస్‌కి బయల్దేరడానికి బ్యాగ్ తీసుకొని గది బయటకు వచ్చిన మధుమతికి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు. టిఫిన్ ప్లేట్ వచ్చి గోడకు కొట్టుకొని, గింగిరాలు తిరిగి తన కాళ్ల మీద పడింది. ప్లేట్లో ఉన్న ఇడ్లీ ముక్కలు చిందరవందరగా ఫ్లోర్ అంతా పడ్డాయి. బిత్తరపోయి భర్త సురేశ్ వైపు చూసింది. ‘‘దగ్గరుండి వడ్డించాలనే స్పృహ కూడా లేదు. వీడి మొహానికి ఇదే ఎక్కువ అనేగా నీ ఉద్దేశం..’ తిట్టుకుంటూనే బయటకు వెళ్లిపోయాడు. సహనం నశిస్తోంది ‘‘మధూ... ఏంటలా ఉన్నావ్!’’ భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా బృంద. ఆఫీసులో సహోద్యోగి బృంద. కళ్ల నీళ్లు తుడుచుకుంటున్న మధుమతిని చూస్తూ.. ‘‘మళ్లీ ఇంట్లో గొడవా!’’ అంది. ‘అవును’ అన్నట్టు తలూపింది మధుమతి. ఇద్దరూ టీ బ్రేక్కని సెక్షన్ నుంచి బయటకు వెళ్లారు. ‘‘సురేశ్‌ని భరించేటంత సహనం ఇక లేదే. బయటకు వచ్చేద్దామనుకుంటున్నాను’’ అంది మధుమతి. ‘‘తొందరపడకు. సాయంత్రం కలుద్దాం’’ అంటూ మధు భుజమ్మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పి, తన సెక్షన్వైపు వెళ్లిపోయింది బృంద. సహోద్యోగులే అయినా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేటంత చనువు ఉంది ఇద్దరి మధ్య. మధుమతి నిట్టూర్చుతూ తన సీట్లో కూలబడింది. విసుగ్గా అనిపిస్తోంది మధుమతి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరికీ పెళ్లై రెండేళ్లు. పెద్దలు నిశ్చయించినదే! పెళ్లయిన రెండోరోజే తన పట్ల నిరసన చూపడం మొదలుపెట్టాడు సురేశ్. బట్టలు నీటుగా సర్దలేదని, వంట చేయడం రాదని.. తగువు పెట్టుకున్నాడు. టీ త్వరగా తేలేదని ఓ రోజు, నీళ్లు ఒలకబోసావని ఒకరోజు.. అయినదానికీ కానిదానికి గొడవే. పెళ్లయిన రెండు నెలలకి గ్రోత్ లేదని చేస్తున్న ఉద్యోగం మానేశాడు. ఇల్లు గడవాలనే ఆలోచనతో తనే ఉద్యోగంలో చేరింది. ఈ రెండేళ్లలో సరదాగా సినిమాకో, హోటల్‌కో వెళ్లడం రెండు, మూడుసార్లకి మించి లేదు. తనే నోరు తెరిచి అడిగితే డబ్బులు ఎందుకు దండగ అంటూ రివర్స్ ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. ఆఫీసులో ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంటుంది. ఆలస్యానికి ప్రతిరోజూ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు భరిస్తుందో అర్థం కావడం లేదు. ప్రతీ చిన్నదానికి విసుగ్గా అనిపిస్తుంది. ఆ విసుగు ఈ మధ్య ఇంకా పెరిగింది. దానికి కారణం.. క్రాంతేనా?! సురేశ్‌కి, క్రాంతికీ ఎంత తేడా! మధుమతి ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే క్రాంతి పని చేస్తున్నాడు. అతను ఆ ఆఫీసులో చేరి ఆర్నెల్లవుతోంది. బ్యాచిలర్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలివిడిగా ఉండే క్రాంతి అంటే అక్కడున్న అందరికీ ఇష్టం. అయితే అతడి ధ్యాసంతా.. ఎప్పుడూ ముభావంగా ఉండే మధుమతిపై ఉండేది. కొద్ది రోజుల్లోనే ఆమె విషయాలన్నీ రాబట్టాడు. సంతోషంగా ఎందుకు ఉండాలో చెబుతూ, ఎప్పుడు ఏ సాయమడిగినా ‘జీ హుజూర్’ అంటూ క్షణాల్లో చేసి పెట్టేవాడు. దీంతో మధుమతికి క్రాంతి మీద ఆసక్తి కలగడం మొదలైంది. ఎప్పుడూ తప్పులు ఎత్తిచూపే భర్త, ఎప్పుడూ సంతోషంగా ఉంచే క్రాంతి.. ఇద్దరినీ బేరీజు వేసుకోవడం మొదలుపెట్టింది మధుమతి. ఊహించని పరిణామం! సరేశ్ ఉదయం చేసిన రాద్ధాంతానికి మధుమతి మనసు చివుక్కుమంది. ‘తనను అపురూపంగా చూసే క్రాంతితో కలిసి బతికితే...’ అనిపించింది ఒక్క క్షణం. అంతే, ఈ ఆలోచనతో మధుమతిలో అలజడి మొదలైంది. తన పుట్టిన రోజు అని ఆఫీసు టైమ్ అవగానే కలుద్దామని చెప్పి వెళ్లాడు క్రాంతి. కాదని చెప్పలేకపోయింది. సాయంకాలం పార్క్‌కి తీసుకెళ్లాడు క్రాంతి. ‘నీ రాకతో ఈ వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారిపోయిందో చూడు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మాటలకు మురిసిపోయింది మధుమతి. ఉన్నట్టుండి క్రాంతి మధుమతి చెయ్యి తీసుకొని తన గుండెల మీద పెట్టుకున్నాడు. తనను చుట్టేసి ‘నువ్వు లేనిదే నేను లేను’ అన్నాడు. ఊహించని ఆ పరిణామానికి ఉలిక్కిపడింది. క్రాంతిని తప్పించుకొని ఇంటి దారిపట్టింది. ఆ రోజు నుంచి తిండికీ, నిద్రకు దూరమైంది. జీవితం... అయోమయం స్నేహితురాలి సలహాతో రిగ్రెషన్ థెరపీకి వెళ్లింది మధుమతి. తన అంతర్మథనానికి పరిష్కారం కోరుతూ కౌన్సెలర్ ముందు కూర్చుంది.‘‘నా కొలీగ్ని ఇష్టపడుతున్నానా? నా భర్తను కాదనుకొని అతనితో వెళ్లిపోతే? నా జీవితం అంతా అయోమ యంగా ఉంది.. ’’ కళ్ల నీళ్లు ఆపే ప్రయత్నంలో మాటలనూ ఆపేసింది. కాసేపు ఆగి ‘‘నా ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది?! ’’ అంది మధుమతి. ఆమె మాటలకు..‘‘మీలోనే ఉంది. తెలుసుకోండి..’’ అన్నారు కౌన్సెలర్. మధుమతికి రిగ్రెషన్ థెరపీ మొదలయ్యింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పదిహేను నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఈ ధాన్యప్రక్రియలో మధుమతికి అస్పష్టతలు స్పష్టం అవడం మొదలైంది. ఆందోళనలు ఆలోచనలవైపుగా మరలుతున్నాయి. పెళ్లి నాటి రోజులు, కాలేజీ రోజులు, అమ్మనాన్న గారాబం, బాల్యం.. అన్నింటినీ దర్శించుకుంటూ సమన్వయ పరుచుకుంటూ సినిమా రీలును వెనక్కి తిప్పినట్టుగా కాలాన్ని రివైండ్ చేస్తూ తన జీవితాన్ని దర్శిస్తోంది. అమ్మ గర్భంలో ఉన్న స్థితి నుంచి గత జన్మలోకి ప్రయాణించింది. ఆ ప్రయాణంలో సురేశ్ రూపం లీలగా కాసేపటికి స్పష్టంగా కనిపించసాగింది. నెమ్మదించిన ఆమె మనోగతాన్ని ప్రశ్నిస్తూ కౌన్సెలర్..‘‘మధుమతీ, మీ మనోఫలకం మీద ఇప్పుడు ఏం కనిపిస్తోంది?’’ అని అడిగారు. గతజన్మ గురువు.. ఈ జన్మ భర్త! మధుమతి చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నాకు సురేశ్ కనిపిస్తున్నాడు. అతను నాకు గైడ్‌గా ఉన్నాడు. నేను అతని విద్యార్థిగా ఉన్నాను. అతను చెప్పిన విషయాలేవీ నేను పట్టించుకోవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అతనితో వాదిస్తున్నాను. గొడవ చేస్తున్నాను. సహనంగా ఉండి, విషయాన్ని అర్థం చేసుకోమని అతను పదే పదే చెప్పినా నేను వినిపించుకోవడం లేదు. మళ్లీ మళ్లీ పొరపాట్లు చేస్తూనే ఉన్నాను. ఆకర్షణను ప్రేమగా భావించి క్రాంతితో వెళ్లిపోయాను. ఆ విధంగా నా డిగ్రీ పూర్తి కాలేదు. క్రాంతితో జీవితాన్ని ఆనందించలేక, ఎదుగుదల లేక బతికినన్నాళ్లూ మానసిక క్షోభను అనుభవించాను. నా గైడ్ చెప్పింది వినడానికే ఈ జన్మలో సురేశ్‌ని భర్తగా ఆహ్వానించాను. అందుకే అతని నుంచి దూరం కాలేకపోతున్నాను. క్రాంతిపై ఉన్న ఆకర్షణ నా జీవితాన్ని అసంపూర్ణం చేస్తోందని తెలుసుకోలేకపోతున్నాను’’ చెప్పింది మధుమతి. ‘‘గతం నుంచి ప్రస్తుతంలోకి రండి. ఈ జన్మలో ఈ రెండేళ్ల మీ జీవితాన్ని దర్శించండి. పొరపాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి...’’ అన్నారు కౌన్సెలర్. వర్తమానంలోనూ అదే భావన మధుమతి తన వైవాహిక జీవితాన్ని దర్శిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆనందం లేదంటూనే సురేశ్తోనే ఉంటున్నాను. అతని ప్రవర్తననూ భరిస్తున్నాను. కాదు కాదు నా ప్రవర్తననే సురేశ్ భరిస్తూ వచ్చాడు. నేనే అతనితో సఖ్యతగా మెలగాలని, వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే జ్ఞానాన్ని కోల్పోయాను. గతాన్ని ఈ జన్మకూ మోసుకొచ్చాను. ఎంత కంఫర్ట్‌గా ఉండాలని ప్రయత్నించినా సురేశ్ నాకు గైడ్ అనే భావనలోనే ఉన్నాను. అందుకే ఇన్నాళ్లూ అతన్ని భర్తగా అంగీకరించలేకపోయాను. దీని వల్లే అతనికి మానసికంగా, శారీకంగా దగ్గర కాలేకపోయాను. అతని పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. జీవితాన్ని అసంపూర్ణంగా మోస్తూ వస్తున్నాను..’’ అంటూ, ‘‘ఎరుకతో జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఉంది’’ అని చెప్పింది మధుమతి. గతాన్ని విగతం చేస్తే వర్తమానం ఎంత అందంగా ఉంటుందో థెరపీలో తెలుసుకుంది. గైడ్‌గా తన సహనాన్ని పరీక్షించడానికే భర్తగా వచ్చిన సురేశ్‌తో సఖ్యతగా ఉండటానికి, అతడిని మార్చుకోవడానికే అంగీకరించింది. సఖ్యతతో దగ్గరైన మనసులు ‘‘మధూ... ’’ భర్త అరుపులకు కంగారుపడుతూ వచ్చింది మధుమతి. ‘‘ఈ కాఫీ ఏంటి? ఇంత చల్లగా...’’ విసుగ్గా అంటున్న సురేశ్‌కి అంతే ఘాటుగా సమాధానమిద్దానుకుంది. అంతలో నిభాయించుకొని అతనికి దగ్గరగా వచ్చి కాఫీని చూసింది. పైన మీగడ తెట్టు కట్టుకుపోయి చల్లగా ఉన్న కాఫీని చూసి ‘అయ్యో, సారీ.. సారీ.. ’’ అంటూ వెళ్లి వేడి వేడి కాఫీ తీసుకొచ్చి సురేశ్ చేతికి అందిస్తూ చిరునవ్వు నవ్వింది. ‘నీ నవ్వు బాగుంటుందోయ్!’ కాఫీ అందుకుంటూ సురేశ్ మెచ్చుకోలుగా చూశాడు. ఆ మెచ్చుకోలును చిరునవ్వుకు ఆనందపు హంగుగా అద్దుకుంది మధుమతి. చిన్న చిన్న విషయాల్లో సఖ్యత ఎలాంటి ఇల్లు రెంట్‌కు తీసుకుంటున్నాం. లేదా ఎలాంటి ఇల్లు కొంటున్నాం. ఎలాంటి వాహనం కొనబోతున్నాం. పిల్లలను ఎలాంటి స్కూల్లో చదివించాలి... ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో భార్యాభర్త మధ్య సఖ్యత కుదరకపోవచ్చు. ఎందుకంటే అక్కడ సఖ్యత కన్నా అభిప్రాయం ముఖ్యం అవుతుంది. కానీ, చిన్న చిన్న విషయాలలో సఖ్యత కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే, ‘నీకు ఆరెంజ్ కలర్ చీర భలేగా ఉంటుంది రా!’, ‘మీకు బ్లూ కలర్ షర్ట్ సూటవుతుందండి,’ ‘రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర బాగా వస్తుందండి’, ‘పొద్దునే వాకింగ్‌కి వస్తావా! భలే సరదాగా ఉంటుంది’ ... ఇలాంటి చిన్న చిన్న విషయాలల్లో సఖ్యత కుదుర్చుకుంటే బంధం బలపడుతుంది. పాఠాన్ని గుర్తిస్తే సఖ్యత చాలావరకు జంటలు పరిస్థితులు ఎలా ఉన్నా కలిసి ఉండాలనే కోరుకుంటారు. ఆ బంధం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠమేదో ఉన్నదని గుర్తిస్తే చాలు సఖ్యత పెరిగేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధంలో సమస్యలు సహజం. అవి తగ్గుముఖం పట్టేలా ఏం చేయవచ్చో అందుకు తగిన ప్రయత్నాలవైపు దృష్టిపెట్టాలి. భవిష్యత్తులో తమ బంధం ఎంత అందంగా మార్చుకోవచ్చో తెలుసుకుంటే ఇద్దరిలోనూ ఆశించిన మార్పులు వస్తాయి. జీవనప్రయాణం అర్థం అయితే బంధాన్ని పటిష్టం చేసుకుంటారు. గతాన్ని అర్థం చేసుకొని విగతం చేసుకుంటే వర్తమానం అందంగా రూపుకడుతుంది. – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్‌లైఫ్ థెరపిస్ట్, హైదరాబాద్ గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి