breaking news
nilam cyclone
-
‘నీలం’ సాయం నేటికీ దూరం
సాక్షి, రాజమండ్రి :అమాయకులు, నిరక్షరాస్యులైన గిరిజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. కానీ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఎప్పుడో 2012లో సంభవించిన నీలం తుపాను పరిహారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో పంపిణీ కాక పోవడమే ఇందుకు నిదర్శనం. పైగా ఈ విషయం లో వ్యవసాయ అధికారులు చెబుతున్న మాటలు ఏజెన్సీ రైతుల సంక్షేమంపై యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయాన్ని చాటుతున్నాయి.ఏజెన్సీ (విలీన ప్రాంతం మినహా) ఏడు మండలాల్లో నీలం తుపాను పరిహారం చెల్లింపు అంశం వివాదాస్పదంగా మారింది. నాడు తుపాను బాధితులను గుర్తించినప్పుడు సేకరించిన పేర్లు, నమోదు చేసిన వివరాలు, ఇవాళ పరిహారం పంపిణీ సమయంలో అధికారులకు కనిపించడం లేదని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు. నష్టం అంచనా, రైతుల వివరాలను పరిశీలించి సరిగ్గా ఉన్నాయా లేవా అనేది నిర్ధారించుకోవలసిన బాధ్యత అధికారులదే. అప్పట్లో అన్నీ చేశామన్న అధికారులు ఇప్పుడు కొందరు లబ్ధిదారులు కనిపించడం లేదని, కొందరికి బ్యాంకుల్లో ఖాతాలు లేవని, తప్పుడు ఖాతాలని పరిహారం నిలిపివేయడ రైతులు మండిపడుతున్నారు. కొందరికే పరిహారం రంపచోడరం, దేవీపట్నం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి, వై.రామవ రం మండలాల్లో 2012లో నీలం తుపాను వల్ల 10,710 మంది రైతులు నష్టపోయారని స ర్వేలో తేలగా 2013లో ప్రభుత్వం రూ.3.31 కో ట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఇప్పటి కి రూ.2.50 కోట్లను 8,193 మందికి పంపిణీ చే శారు. మిగిలిన 2517 మందికి రూ.81 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే వారి వివరాలు లేవంటూ అధికారులు చెల్లించడం మానేశారు. తేలని లెక్కలు అధికారిక వివరాల ప్రకారం నీలం పరిహారం మంజూరైన రైతుల్లో 223 మంది వలస వెళ్లారు. అసలు ఆచూకీ లేనివారు 56 మంది కాగా అక్కౌంట్లు ప్రారంభించేందుకు శ్రద్ధ చూపనివారు 83 మంది ఉన్నారు. చనిపోయిన వారు 61మంది కాగా రెండుసార్లు నమోదైన వారు 35మంది. తప్పుడు అక్కౌంట్లు సమర్పించిన వారు 828మంది కాగా ట్రెజరీలో ఉన్న అక్కౌంట్లు 1048, కమిషనర్ కార్యాలయానికి వెళ్లినవి 183 అంటూ నివేదికలో పేర్కొంటున్నారు. నష్టపోయిన రైతుల వివరాల సేకరణలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ లెక్కలను బట్టే తెలుస్తోంది. సర్వే సమయంలో అసంపూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించి ఆనక దీనికి తమను బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బినామీ ఖాతాల్లోకి నిధులు నీలం తుపాను పరిహారం అసలు రైతుల ఖాతాల్లోకి కాకుండా బినామీల ఖాతాల్లోకి మళ్లించారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల గిరిజనుల పేరిట బినామీ బ్యాంకు అక్కౌంట్లు సృష్టించి వాటిలోకి పరిహారాన్ని దారి మళ్లించారని, ఇందులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వివిధ కారణాలతో పరిహారం చెల్లించలేదంటున్న అధికారులు ఆ మొత్తం రూ. 81 లక్షలకు చెబుతున్న లెక్కలు కూడా గందరగోళంగా ఉన్నాయని సమాచారం. లెక్కల్లో తేడాల వల్లనే ‘రిస్క్’ తీసుకోవడం ఇష్టం లేక ఉన్నవీ, లేనివీ పలు కారణాలను సాకుగా చూపుతూ పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టేశారని కూడా తెలుస్తోంది. -
‘నీలం’ పరిహారం ఇంకెంత దూరం?
సాక్షి, రాజమండ్రి :లోకపుటాకలి తీర్చే అన్నదాతంటే అందరికీ, అన్నింటికీ లోకువే. ప్రకృతి ప్రకోపించినా, ప్రభుత్వాలు అలసత్వం వహించినా, మార్కెట్ మాయాజాలం పేట్రేగినా తొలుత బాధితులయ్యేది రైతులే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విపత్తులు కబళించినప్పుడు..నిస్సహాయులైన రైతులు- గోరంత సాయం కోసం కొండంత ఆశతో ప్రభుత్వాల వైపు చూస్తారు. 2012 నవంబర్‌లో నీలం తుపాను ఖరీఫ్ పంటను తుడిచి పెట్టినప్పుడు.. జిల్లాలోని అన్నదాతలు అలాగే ప్రభుత్వంపై ఆశ పెట్టుకున్నారు. అయితే వారందరి కన్నీటిని తుడవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంచనాలు, నివేదికలు, కేంద్ర బృందాల పరిశీలనల అనంతరం ఎట్టకేలకు గత ఏడాది మేలో నీలం పరిహారం నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అక్టోబరు నాటికి నిధులు జిల్లా అధికారుల ఖాతాల్లోకి చేరాయి. అన్ని విభాగాల పరిశీలనల అనంతరం జిల్లాలో 3.90 లక్షల మంది రైతులను నీలం బాధితులుగా తేల్చిన ప్రభుత్వం వారికి పరిహారంగా పంపిణీ చేసేందుకు రూ.144 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబరు నాటికి పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనారంభించారు. ఈ ఏడాది జనవరి నాటికి 2.92 లక్షల మంది ఖాతాలకు పరిహారం జమైంది. అయితే అధికారుల అలసత్వం కారణంగా సుమారు 98 వేల మందికి నేటికీ పరిహారం సుదూరంగానే నిలిచింది. బ్యాంకు ఖాతాల్లో తేడాలు, రైతుల పేర్లలో దొర్లిన తప్పుల వంటివి సరిదిద్దడంలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ఉసూరుమనిపిస్తోంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం మారుతుండడంతో అసలు పరిహారం అందుతుందా, ఎన్నటికీ అందని మానిపండవుతుందా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవకతవకలు అనేకం.. నిబంధనల ప్రకారం పరిహారం సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. రైతుల ఖాతాల వివరాలను మండల వ్యవసాయ అధికారులు సేకరించి నివేదికలు పంపారు. అయితే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లు రైతులు పరిహారం పొందడంలో ప్రతిబంధకాలయ్యాయి. బ్యాంకులకు రైతుల ఖాతాల నంబర్లను సమర్పించే సమయంలో సున్నాలను ‘ఓ’ అనే ఇంగ్లీషు అక్షరాలుగా పేర్కొన్నారు. దాంతో ఆ ఖాతాలు చెల్లవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. ఖాతాల నంబర్ల ముందు రైతుల అసలు పేర్లను కాకుండా వ్యవహార నామాలనే పేర్కొనడం, ఇంటిపేరు లేకుండా కేవలం పేర్లనే ఉదహరించడం, తండ్రి పేర్లలో తేడాల వల్ల అలాంటి వారి ఖాతాలకు కూడా బ్యాంకులు సొమ్ములు జమ చేయలేదు. కొందరు రైతుల ఖాతాలు చాలాకాలం నుంచి లావాదేవీలు లేక నిలిచిపోయాయి. అలాంటి ఖాతాల స్థానంలో కొత్తవి తెరిచేలా రైతులను చైతన్యపరచడంలో అధికారులు అలసత్వం వహించారు. ఇలా అనేక కారణాల వల్ల.. పరిహారంగా విడుదలైన సొమ్ము రైతులకు పంపిణీ కాక బ్యాంకుల్లో నిరర్థక నిధులుగా ఉండిపోయింది. ఇక పలువురు రైతులు ఇచ్చిన ఖాతా నంబర్లు వేరే వారివి కావడంతో పరిహారం వేరే వారి ఖాతాలకు జమైంది. ఈ చిక్కును కూడా అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. జరిగిన పొరబాట్లను సహనంతో, సమన్వయంతో చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెడుతూనే ఆరునెలలు గడిపేశారు. వ్యవసాయాధికారులు ఖాతాల వివరాలు సవ్యంగా సమర్పించలేదని బ్యాంకు అధికారులు అంటుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల సిబ్బంది తాము పొరపాట్లను సవరించినా మార్పు చేసేందుకు సహకరించడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇస్తారా..? అవకతవకలకూ, ఆలస్యానికీ ఎవరి బాధ్యత ఎంతనేది అలా ఉంచితే సుమారు 98 వేల మంది అన్నదాతలకు అందాల్సిన రూ.తొమ్మిది కోట్ల పరిహారం ఆరు నెలలుగా బ్యాంకుల్లో మూలుగుతోంది. నిబంధనల ప్రకారం దీనిపై వడ్డీ కూడా జమ అవుతుంది. ఈ వడ్డీని అటు వ్యవసాయాధికారులు, ఇటు బ్యాంకు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. కాగా కొన్ని లోతట్టు గ్రామాల్లో రైతులకు అందాల్సిన పరిహారం నిధులను గుట్టుగా స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన జాప్యం ఎలాగూ జరిగింది. ఇప్పటికైనా అన్నదాతల అలనాటి భారీ నష్టానికి చిరుసాయాన్ని అందించడానికి ఉన్నతాధికారులు సంకల్పించాలి. -
43 మండలాల్లోనూ నష్టం
నీలం, అల్పపీడనం ప్రభావిత ప్రాంతాల గుర్తింపు రెవెన్యూ గ్రామాల వారీ వివరాలకు ఉత్తర్వులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో సంభవించిన పైలిన్ తుపాను, అల్పపీడనం, వరదలు కారణంగా నష్టపోయిన మండలాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 43 మండలాల్లోనూ నష్టం జరిగి నట్లు గుర్తించి, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పైలిన్, అల్పపీడనం జిల్లాను వణికించాయి. పైలిన్ తుపాను ప్రభావం జిల్లాపై లేకపోయినప్పటికీ ఆ వెంటనే వచ్చిన అల్పపీడనం భారీ నష్టాన్ని మిగిల్చింది. అనేక మండలాలు ముంపునకు గురయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒకదానివెంట మరొకటిగా వచ్చిపడిన విపత్తులతో చోటుచేసుకున్న నష్టం అంచనాలలో కొంత జాప్యం జరిగింది. ఎలాగైతేనేం జిల్లాలో 34 మండలాల్లో 52,088 మంది రైతులకు చెందిన 13,290.97 హెక్టార్లలో నష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. రూ.12.2 కోట్లు మేర ఇన్‌ఫుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదిక పంపారు. అలాగే అతివృష్టి కారణంగా కొన్ని చోట్ల రిజర్వాయర్లు, కాలువలు దెబ్బతిన్నాయి. వాటర్‌ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుం డా విశాఖ నగరంలో కూడా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖతో పాటు నీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, విద్యుత్, జీవీఎంసీ ఇలా అన్ని శాఖలకు సంబంధించి కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టం నివేదికలను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఈ నెల 6న ప్రభుత్వానికి పంపించారు. దానిని పరిశీలించిన ప్రభుత్వం 43 మండలాల్లోనూ నష్టం జరిగినట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల్లో రెవెన్యూ గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
వెన్ను విరిగిన రైతన్న
పదిహేను రోజుల్లోనే 50 మంది అన్నదాతల మృతి పురుగుల మందు తాగి కొందరు.. గుండె పగిలి మరికొందరు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి రైతుల విలవిల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన గడచిన రెండ్రోజుల్లో ఐదుగురి ఆత్మహత్య మట్టి బిడ్డల లోగిళ్లలో విషాద ఛాయలు సాక్షి నెట్వర్క్: ఎనిమిదెకరాల్లో పంటలు వేసినా ఆ రైతన్నను ఆదుకోలేకపోయాయి. పత్తి అప్పుల కత్తిగా మారింది. మొక్కజొన్న మొండిచేయి చూపింది. వర్షాలతో చేను చెరువైంది. రైతు గుండె బరువైంది. కిందటేడాది అప్పులు, తాజా పెట్టుబడి ఖర్చులు రూ.4 లక్షలకు చేరాయి. చేనులో పురుగులను చంపాల్సిన మందు ఆ రైతు గొంతులోకి దిగింది. అప్పటిదాకా కంటిపాపలా చూసుకున్న ఆ చేనులోనే ఆయన జీవితం కడతేరింది. - కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కీస కేశవరెడ్డి(50) దీన గాథ ఇది! మరో 15 రోజుల్లో పంట చేతికి వస్తుందని, ఈసారైనా అప్పులు తీరతాయని ఆ రైతు తన ఐదెకరాల వరి పొలంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అకాల వర్షాలు ఆ ఆశలను చిదిమేశాయి. రుణ అర్హత కార్డు లేకపోవడంతో ఆయనకు ప్రభుత్వ బ్యాంకులు అప్పులివ్వలేదు. దీంతో భూయజమాని వద్ద, ఇతర చోట్ల అప్పులు తెచ్చాడు. తనకు సాగు పనుల్లో చేదోడుగా ఉంటున్న సైకిల్‌ను కూడా అమ్మేసి ఎకరానికి రూ.20 వేల చొప్పున లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాడు. వర్షాలకు ఐదెకరాలు తుడిచిపెట్టుకుపోవడంతో అదే చేనులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఇల్లు కూడా లేకపోవడంతో ఈయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. - ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పాటిచెరువుకు చెందిన కౌలు రైతు సత్యనారాయణ(34) వ్యథ!! నీలం.. పై-లీన్.. అకాల వర్షాలు, వరదలు.. ఇలా ఏటా ఏదో ఓ విపత్తు అన్నదాత ఉసురు తీస్తోంది. చేతికొచ్చిన పంటలపై ప్రకృతి పడ గ విప్పుతోంది. రైతుల గుండెలో గుబులు రేపిన పై-లీన్ గండం గడిచిందో లేదో.. కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని వానలతో ఏకంగా 29 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిర్చి... ఒక్కటేమిటి అన్నీ నాశనమయ్యాయి. కొద్దిరోజులు ఆగితే రైతన్న ఇంటి ముంగిట ఉండాల్సిన పంటలవి. విపరీతంగా పెరిగిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు, సాగు ఖర్చులను ఓర్చుకొని సాగు చేసిన పంటలు నీటమునగడంతో రైతులు అల్లాడుతున్నారు. వర్షాలకు పోను కాస్తోకూస్తో మిగిలిన పంటలు కూడా పనికిరాకుండా పోయాయి. మెక్కజొన్న కోతలు పూర్తయ్యాయి. ఆరబోసిన మొక్కజొన్నల కంకులు పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చాయి. వరిపొలాల్లో ఇంకా చాలాచోట్ల నీరు నిలిచి ఉంది. పంట నేలవాలడం తో వరి కంకులకు మొలకలు వస్తున్నాయి. మరికొన్ని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన వచ్చిన పత్తి వానకు తడిసి రంగు మారింది. పంట బాగుంటేనే అరకొర ధరతో సరిపెడుతున్న అధికారులు.. ఇక ఈ తడిసిన పంటను కొనేందుకు అసలే ముందుకు రావడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. పంట నష్టాన్ని తట్టుకోలేక చేనులోనే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు కొందరైతే.. గుండెపగిలి మరణిస్తున్న వారు ఇంకొందరు. వెరసి రైతుల లోగిళ్లలో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. గత పక్షం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. గడచిన రెండ్రోజుల్లో ఐదుగురు తనువు చాలించారు. దీపావళి వెలుగులకు బదులు ఆ రైతుల కుటుంబాల్లో అమావాస్య చీకట్లు అలముకున్నాయి. కదిలిస్తే కన్నీళ్లే...: పంటలు కోల్పోయిన రైతులు ఎవరిని కదిపినా కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులన్నీ నీళ్లపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ పంట సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ‘‘నేను తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. వానతో పంట అంతా దెబ్బతింది. చాలా వరకు నీటిపాలైంది. మిగిలింది రంగు మారిపోయింది. ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోతున్నా’’ అని కృష్ణా జిల్లా నందిగామ మండలం రాఘవపురానికి చెందిన కోట రామయ్య చెప్పారు. ఇదే జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెంకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కూలీకి వెళ్లలేక రైతుగా బతుకుదామని రెండెకరాలు కౌలు చేస్తున్నాను. ఎకరాకు కౌలు 20 బస్తాలు ఇవ్వాలి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు వరకూ పెట్టుబడులు పెట్టాను. పైరు చిరు పొట్ట దశ, కంకులు దశకు చేరుకునే సరికి తెగుళ్లు వ్యాప్తి చెందటంతో ఖర్చులు ఎకరాకు రూ.3 వేలు వరకూ అదనంగా అయ్యాయి. పైరు తేరుకుంటుందని భావించా. ఇంతలోనే వర్షం వచ్చి పడింది. ఎకరాకు 5 నుంచి 9 బస్తాలు వరకూ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు’’ అని చెప్పారు. ‘‘నేను మూడెకరాల్లో పత్తి వేశా. రూ.50 వేల దాకా పెట్టుబడులు పెట్టాను. మొన్నటి వర్షాలతో పత్తి కాయలన్నీ మురిగిపోయాయి. ఆకుకు ఎర్రబొమ్మిడి తెగులు సోకింది. పంట బాగుంటే ఎకరానికి 15 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చేది. ఇప్పుడు 7 నుంచి 8 క్వింటాళ్ల లోపే వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ.8 వేల దాకా నష్టం వాటిల్లింది’’ అని కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన గంగిపెల్లి రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. విపత్తు నిధి ఏర్పాటు చేయాలి ప్రకృతి వైపరీత్యాలవల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకుని భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. వారికి తక్షణం ఆర్థికసాయం అందించి భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. బాధిత కుటుంబాలకు బియ్యం, దుస్తులు లాంటి తాత్కాలిక సాయం ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమవుతోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలవల్ల 16 జిల్లాల్లో 29 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. పెట్టుబడి రాయితీ అందించే ఏర్పాటు ఉంటే రైతులకు కాస్త ఊరట కలుగుతుంది. ఏడాది తరువాత గానీ వారికి పెట్టుబడి రాయితీ అందడంలేదు. - రామకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శికి చెందిన ఈయన పేరు షేక్ మౌలాలి(49). కౌలు రైతు. ఎకరా రూ.15 వేల చొప్పున కౌలుకు తీసుకుని మూడెకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలి వర్షాలతో పంట నీటిపాలైంది. దీంతో మౌలాలి మానసిక వేద నకు గురయ్యాడు. కిందటి నెల 28న గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. 9వ తరగతి చదువుతున్న కుమారుడు రహంతుల్లా చదువు సందిగ్ధంలో పడింది. రూ.2.50 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మౌలాలి భార్య కన్నీరుమున్నీరవుతోంది. ఈ రైతు పేరు. రెడ్డిమాసు లెవన్(51). నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చిన్నపురి. మూడెకరాల పొలానికి తోడు ఈసారి మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. డబ్బు చాలక మరో రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వరద వచ్చి పంటను ముంచెత్తింది. పంట పూర్తిగా నాశనమైంది. ఆశలన్నీ ఆవిరయ్యాయి. కిందటి మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. అనంతరం అక్కడ్నుంచే హైదరాబాద్‌లో పీజీ చదువుతున్న తన కొడుకు కిరణ్‌కు ఫోన్ చేశాడు. ఆందోళనతో కిరణ్ తన తల్లికి విషయాన్ని చేరవేశాడు. ఆమె వెళ్లేలోగా భర్త ఊపిరి ఆగిపోయింది. లెవన్ 12 ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి వరుసగా నష్టాలే వచ్చాయి. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ముశిపట్లకు చెందిన ఈ రైతు కేమిడి అవిలి మల్లయ్య (30)ది మరో దీనగాథ. ఈయన తనకున్న మూడెకరాలతోపాటు ఏడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. తన వద్ద ఉన్న రూ.2 లక్షలు, అప్పు తెచ్చిన రూ.4 లక్షలతో పెట్టుబడి పెట్టాడు. తొమ్మిది ఎకరాల్లో పత్తి, ఎకరంలో కంది వేశాడు. మొదటి దఫా పత్తి తీయడం మొదలుపెట్టగానే వర్షం ముంచుకొచ్చి పంట పనికిరాకుండా పోయింది. దీంతో అప్పు తీరే అవకాశం లేక గత నెల 27న పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య తండ్రి రాములు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయి కనిపించాడు. మల్లయ్య మృతితో భార్య చంద్రకళ, ఏడాదిన్నర బాబు మనోజ్, నాలుగేళ్ల చిన్నారి శివాని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు దిక్కులేని వారయ్యారు. ఈ మహిళా రైతు పేరు ఉప్పలమ్మ (60). వరంగల్ జిల్లా వర్దన్నపేట. భర్త బక్కయ్య, ఉప్పలమ్మ తమకున్న మూడెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. మరో రెండ్రోజుల్లో పత్తి తీద్దామనుకునే సరికి వర్షాలు కురిసి పంట నేల రాలింది. చెట్టుపై ఉన్న పత్తి మొలకొచ్చింది. దీంతో ఉప్పలమ్మ తీవ్ర ఆందోళనకు గురైంది. వీరు పంట కోసం రూ.92 వేలు ఖర్చు చేశారు. వాటిలో రూ.80 వేలు అధిక వడ్డీపై అప్పు తెచ్చారు. ఈ అప్పులను తలచుకొని ఆదివారం ఉప్పలమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అదే రోజు సాయంత్రం గుండెపోటుతో ఆమె మృతి చెందింది. ఈయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురానికి చెందిన కౌలు రైతు బల్లెం సుబ్బారావు(48). గతంలో సొంతంగా కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేశాడు. నష్టాల ఊబిలో కూరుకుపోయూడు. గత ఏడాది నీలం తుపానుకు పంట మునగడంతో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రూ.1.30 లక్షలు నీటిపాలయ్యాయి. ఈసారి రూ.లక్ష దాకా అప్పు తెచ్చి పంట సాగు చేశాడు. ఇటీవలి వర్షాలకు పంట నీటమునిగింది. నీట మునిగిన పంటను చూసి సుబ్బారావు దిగులు చెందాడు. అప్పులు ఎలా తీర్చాలన్న బెంగపట్టుకుంది. అదే వ్యథతో గుండెపోటుకు గురై శుక్రవారం మరణించాడు. సుబ్బారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఏడాదైనా అప్పుల బాధ నుంచి గట్టెక్కుదామని భావించిన ఈ అన్నదాత ఆశలు నెరవేరలేదు. ఈయన పేరు ర్యాపని మల్లయ్య(45). మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పోలేపల్లి. ఆరెకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి సాగుచేశాడు. ఇందుకు స్థానిక పీఏసీఎస్‌లో రూ.80 వేలు, ప్రైవేట్‌గా మరో రూ.40 వేలు అప్పు చేశాడు. గత వేసవిలో రూ.60 వేలు అప్పుచేసి మూడు బోరుబావులను తవ్వించగా ఒక్కదాంట్లోనే నీరు పడింది. రూ. లక్షన్నర నష్టపోయాడు. పంటల కోసం ఈ రెండేళ్లలో రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఈసారి పంటలు బాగా పండి అప్పులు తీరుతాయని భావించాడు. కానీ వర్షాలకు ఆరెకరాల్లో పంట నాశనమైంది. దీంతో కలతచెంది గత నెల 27న ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్‌కు చెందిన ఈ రైతు పేరు సత్యనారాయణగౌడ్ (35). ఈ ఏడాది తనకున్న ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఇందుకు రూ.3 వడ్డీ చొప్పున రూ.3 లక్షల అప్పు చేశాడు. గతేడాది పీఏసీఎస్‌లో రూ.30 వేల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుల నేపథ్యంలో పంటను కంటికిరెప్పలా చూసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పదెకరాల్లో పంట మొత్తం కొట్టుకుపోయింది. అప్పులు తీర్చే మార్గం తెలియక కుటుంబ సభ్యుల వద్ద కలతచెందాడు. కిందటి నెల 28న పొలాన్ని చూసేందుకు వెళ్లి అక్కడే పురుగుమందు తాగి తనువు చాలించాడు. సత్యనారాయణ మృతితో భార్య అలివేల, ఇద్దరు కొడుకులు దిక్కు లేనివారయ్యారు. -సాక్షి నెట్వర్క్