breaking news
Neyveli Lignite Corporation Limited
-
తమిళనాడు: బాయిలర్ పేలి ఐదుగురు మృతి
చెన్నె : తమిళనాడులో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ఆధారిత థర్మల్ పవర్ప్లాంట్ నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్లోని రెండవ దశ బాయిలర్లో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎన్ఎల్సీ లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి పేలుడు సంభవించిన బాయిలర్ ఆపరేషన్ నిలిపివేసామని అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్లో పేలుడు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు మే నెలలో ప్లాంట్లోని బాయిలర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. -
నైవేలీ విద్యుత్ ప్లాంట్లో పేలిన బాయిలర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేశారు. -
నేటి నుంచి ఆమరణ దీక్షలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ) కార్మికులు శుక్రవారం నుంచి ఆమరణదీక్షలు ప్రారంభించనున్నారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోగా తొళిలార్ మున్నేట్ర సంఘం నేత తిరుమావళవన్ను బుధవారం ఉద్యోగం నుంచి తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఎల్సీలో 12 వేల మంది శాశ్వత ప్రాతిపదిక కార్మికులు, 13 వేల మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. శాశ్వత కార్మికులకు 2012 నుంచి సవరించిన వేత నం అమలులో ఎన్ఎల్సీ యాజమాన్యం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారంపై గత ఏడాది ఒకసారి సమ్మెకు పూనుకున్న ఉద్యోగులు, కార్మికులు అప్పట్లో ఇచ్చిన హామీతో విరమించారు. అయితే హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా యాజమాన్యం నెరవేర్చక పోవడంతో గతనెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. కొత్త వేతనాలను అమలుచేయాలని, ఒప్పంద కార్మికులను పర్మనెంటు చేయాలని తదితర ఐదు డిమాండ్లపై సాగుతున్న సమ్మె గురువారానికి 25వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలతో ఎన్ఎల్సీ యాజమాన్యం పలు విడతల జరిపిన చర్చలు విఫలమైనాయి. ఇదిలా ఉండగా, కార్మికుల సమ్మెకు గట్టి అండగా నిలిచారనే కక్షతో తొళిలార్ మున్నేట్ర సంఘం నేత తిరుమావళవన్ను ఉద్యోగం నుంచి బుధవారం తొలగించారు. అతని తొలగింపు ఉత్తర్వులను గోడలపై అతికించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సైతం విధులను బహిష్కరించి శాశ్వత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి హడావిడిగా సమావేశం నిర్వహించారు. ఎన్ఎల్సీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నెల్లై మెయిన్ బజార్ కామరాజర్ మైదానంలో ఆమరణదీక్షలు ప్రారంభించాలని తీర్మానించారు. అంతేగాక 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. కార్మికుల ఆమరణదీక్ష నిర్ణయంతో ఎన్ఎల్సీ పరిసరాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నెల్లై డీఎస్పీ నేతృత్వంలో సుమారు 500 మంది రేయింబవళ్లు కాపలాపెట్టారు. 975 మెగావాట్ల లోటు: సమ్మె తీవ్రత కారణంగా ఎన్ఎల్సీ విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోతోంది. ఎన్ ఎల్సీ మొత్తం సామర్థ్యం 2990 మెగావాట్లు కాగా బుధవారం 2068 మెగావాట్లు ఉత్పత్తి అయింది. గురువారం 2015 మెగావాట్లకు పడిపోయింది. గతనెల 28వ తేదీ నాటికి 831 మెగావాట్ల ఉత్పత్తి లోటు ఉండగా, గురువారం నాటికి లోటు 975 మెగావాట్లకు పెరిగింది.