breaking news
New sectors
-
ఈసారి బూమ్‌లో కొత్త కంపెనీలకు చోటు!
ఇటీవల మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత రెండు వారాల్లోనే 12 శాతం లాభపడ్డాయి. దీంతో ఇకపై కొంతమేర కరెక్షన్కు చాన్స్ ఉన్నదంటున్నారు ఎన్విజన్ క్యాపిటల్ ఎండీ, సీఈవో నీలేష్ షా. భవిష్యత్‌లో మార్కెట్ల గమనం, పెట్టుబడి అవకాశాలు, విభిన్న రంగాలు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. క్యూ1, క్యూ2 వీక్ ఈ ఏడాది ద్వితీయార్థంకంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించకపోవచ్చని అత్యధిక శాతం కార్పొరేట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా మార్కెట్లు పుల్‌బ్యాక్ ర్యాలీలో సాగుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేస్తుండటంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12 శాతం లాభపడ్డాయి. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైతం పెట్టుబడులను కుమ్మరిస్తుండటంతో సెంటిమెంటు బలపడింది. మరోవైపు మిడ్, స్మాల్ క్యాప్స్ ఇటీవల జోరు చూపుతున్నాయి. ఈ ఏడాది(2020-21) తొలి రెండు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు నిరాశపరిచే వీలుంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక ఫలితాలు బలహీనపడనున్నాయి. దీంతో మార్కెట్లు ఇకపై మరింత ర్యాలీ చేయకపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడినుంచీ వెనకడుగువేసే అవకాశముంది. 7,500 చాన్స్ తక్కువే ఇటీవల ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లలో మళ్లీ భారీ కరెక్షన్కు చాన్స్ తక్కువే. వెరసి మార్చి కనిష్టం 7,500 పాయింట్ల స్థాయికి నిఫ్టీ పతనంకాకపోవచ్చు. అయితే కొన్ని రంగాలు ఊహించినదానికంటే అధికంగా దెబ్బతినవచ్చు. ఇదే విధంగా కొన్ని కంపెనీలు నిరుత్సాహకర పనితీరు చూపడంతో కొత్త కనిష్టాలను తాకే వీలుంది. నాయకత్వ పటిమ, పటిష్ట బిజినెస్‌లవైపు మార్కెట్లు దృష్టిసారిస్తాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను విసరనున్నాయి. భవిష్యత్‌లోనూ ఫైనాన్షియల్ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే.. తిరిగి లాక్‌డవున్ పరిస్థితులు తలెత్తవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్లను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. వచ్చే ఏడాదిలోనే ఈ ఏడాది పలు రంగాలలోని కంపెనీలు అంతంతమాత్ర పనితీరునే చూపవచ్చు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో పరిస్థితులు సర్దుకునే వీలుంది. ఏఏ రంగాల నుంచి డిమాండ్ పుట్టవచ్చు లేదా.. ఎలాంటి కంపెనీలు వృద్ధి సాధించవచ్చన్న అంచనాలు కీలకంగా మారనున్నాయి. కొన్ని కంపెనీలు కోవిడ్-19 పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతోపాటు.. పటిష్ట ఫలితాలవైపు సాగవచ్చు. ప్రధానంగా సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా రంగాలు వెలుగులో నిలిచే వీలుంది. ఇదే విధంగా కిచెన్- హోమ్ అప్లయెన్సెస్ విభాగాలకు సైతం డిమాండ్ కనిపించనుంది. ఈ బాటలో ఆరోగ్య పరిరక్షణ(హెల్త్, వెల్నెస్), వ్యక్తిగత సంరక్షణ విభాగాలు పటిష్ట పనితీరు ప్రదర్శించవచ్చని భావిస్తున్నాం. రానున్న రెండేళ్లలో టెక్నాలజీ కౌంటర్లు సైతం బౌన్స్‌బ్యాక్ సాధించవచ్చు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ద్వారా టెక్నాలజీ సర్వీసులకు డిమాండ్ పెరిగే వీలుంది. చిన్న షేర్లు గుడ్ ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేస్తున్నాయి. అయినప్పటికీ 2017-18 గరిష్టాలతో పోలిస్తే 50 శాతం తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే ఈ విభాగంలో నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కన్జూమర్ అప్లయెన్సెస్, హెల్త్, వెల్నెస్ తదితర రంగాలకు చెందిన కొన్ని కౌంటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమర్ధవంత నిర్వహణ, తక్కువ రుణ భారం, పటిష్ట బ్యాలన్స్‌షీట్స్, నగదు నిల్వలు కలిగిన కంపెనీలు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముంది. సరైన రంగాల నుంచి నాణ్యమైన కంపెనీలను ఎంచుకుంటే భారీ ప్రతిఫలాలను పొందవచ్చని ఆశిస్తున్నాం. ఎన్బీఎఫ్సీలు వద్దు మార్చి చివరి వారంలో మార్కెట్లు బాటమవుట్ అయినప్పటికీ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో ఎన్బీఎఫ్సీ విభాగాన్ని తప్పించుకోవడమే మేలు. కొన్ని కంపెనీలు బలమైన యాజమాన్యం, పెట్టుబడులను కలిగి ఉన్నప్పటికీ రుణ నాణ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యే వీలుంది. సమీపకాలంలో రుణ వసూళ్లు, మొండిబకాయిలు వంటి సవాళ్లకు ఆస్కారం ఉంది. మారటోరియం ప్రభావం భవిష్యత్‌లో కనిపించనుంది. ఫలితంగా ఎన్బీఎఫ్సీ రంగానికి ఈ ఏడాది సమస్యాత్మకంగా నిలిచే అవకాశముంది. -
కొత్త రంగాలతోనే ఉపాధి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త రంగాలపై దృష్టి సారించి నిరుద్యోగ సమస్యను అధిగమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పాలసీకి అనుబంధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, డేటా సెంటర్స్, ఓపెన్ డేటాపై 4 సెక్టొరల్ పాలసీలను కేటీఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సంస్థల నుంచి సూచనలు స్వీకరించి కొత్త పాలసీలు రూపొందించామన్నారు. అనేక ఐటీ కంపెనీలు నూతన సాంకేతికతను హైదరాబాద్‌కు పరిచయం చేస్తూ.. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఐటీలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయన్నారు. 5 ఐటీ దిగ్గజ కంపెనీలకుగానూ 4 కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. అనేక పెద్ద కంపెనీలు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని, ప్రస్తుతం ఆవిష్కరించిన పాలసీలను ఐటీ రంగం అభివృద్ధికి సోపానాలుగా వినియోగించుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటు నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్ల తయారీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సైబర్ సెక్యూరిటీ సవాలుగా మారిందని.. దీనిని ఎదుర్కొంటూ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఓపెన్ డేటా పాలసీ ద్వారా మిలియన్ల కొద్దీ పేజీల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందన్నారు. ఐటీ అనుబంధ పాలసీల ద్వారా రాష్ట్రంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. ఐటీ రంగానికి అనుబంధంగా పది సెక్టొరల్ పాలసీలకుగానూ.. ఇప్పటి వరకు ఎనిమిది పాలసీలను రూపొందించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. తొలి విడతలో ఆవిష్కరించిన 4 సెక్టొరల్ పాలసీల ద్వారా 29 సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉపాధి కల్పన దిశగా ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 250 మంది ప్రైవేటు భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సెక్టొరల్ పాలసీలు రూపొందించామని.. పాలసీలు ఆచరణలోకి వస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తాఫా, జెఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఐటీ సంస్థల ప్రతినిధులు బీవీఆర్ మోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కేఎస్విశ్వనాథ్, ఆనంద్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు సెక్టొరల్ పాలసీల ఆవిష్కరణ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో జయేశ్ రంజన్ ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. సిస్కో, ఫాక్ట్లీ, డీఎస్‌సీఐ, కంట్రో ల్ ఎస్, ఎస్సీఎస్సీ, నాస్కామ్, క్రాప్ డేటా టెక్నాలజీస్ తదితర సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. సిటీ డిజిటల్ ప్లాట్‌ఫాంలు, వీడియో ఆధారిత తరగతి గదులు, హైదరాబాద్‌కు చెందిన చారిత్రక కట్టడాల డిజిటలైజేషన్, జాయింట్ సైబర్ సెక్యూరిటీ చార్టర్ అభివృద్ధి, డేటా సెంటర్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్, మాల్వేర్ రీసెర్చ్ సెంటర్, క్రిప్టోగ్రఫీలపై ఆయా సంస్థలు రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ పాలసీ.. రక్తపాత రహిత యుద్ధాలుగా పరిగణిస్తున్న సైబర్ వార్స్ ప్రపంచానికి వెలకట్టలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలోని పెద్ద కంపెనీలూ సైబర్ దాడులకు గురవుతున్నా.. ఎదుర్కొనేందుకు శిక్షణ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన మానవ వనరులను తయారు చేయడంతో పాటు.. సైబర్ దాడులను ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ పాలసీ ద్వారా సైబర్ సెక్యూరిటీపై అవగాహన, సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు తయారు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. సైబర్ సెక్యూరిటీపై జరిగే పరిశోధనలను సంస్థలు, రాష్ట్రాలు పరస్పరం మార్పిడి చేసుకునేలా చూస్తారు. ఐటీ అనుబంధ పాలసీల ప్రత్యేకతలివే.. త్వరలో మరో రెండు అనుబంధ పాలసీల ఆవిష్కరణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ‘ఐటీ పాలసీ’ని ఆవిష్కరించింది. ఐటీ రంగానికున్న విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో అనుబంధ రంగానికి ఒక్కో సెక్టొరల్ పాలసీ రూపొందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో 4 ఐటీ అనుబంధ పాలసీలను ఆవిష్కరించగా.. గురువారం మరో నాలుగు పాలసీలను విడుదల చేసింది. ఐఓటీ, స్మార్ట్ టెక్నాలజీస్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన మరో రెండు అనుబంధ పాలసీలను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 4 పాలసీల్లోని ప్రత్యేకతలు ఇవీ.. - సాక్షి, హైదరాబాద్ ఓపెన్ డేటా పాలసీ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీ ద్వారా ప్రజలు, విధాన నిర్ణేతలు, సమాచార వినియోగదారులు, స్టార్టప్‌లు, ప్రైవేటు సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ విభాగాల వారీగా డేటా నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పాలసీ విడుదలైన ఆరు నెలల్లోగా ఆచరణకు అవసరమైన మార్గదర్శకాలను ఐటీ విభాగం రూపొందిస్తుంది. పాలసీ అమలు తీరును పర్యవేక్షించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. డేటా సెంటర్స్ పాలసీ.. భౌగోళికంగా రాష్ట్రానికున్న అనుకూలతల దృష్ట్యా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుంది. డేటా సెంటర్స్ క్యాంపస్‌లో ప్రైవేటు సంస్థలు తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మౌలిక సౌకర్యాలను క్యాంపస్‌లో ప్రభుత్వం కల్పిస్తుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు క్యాంపస్‌లో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు కనీసం 10 శాతం వ్యాపారానికి ప్రభుత్వం హామీ ఇస్తోంది. ప్రభుత్వం సొంతంగా స్టార్టప్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలిస్తుంది. డేటా అనెలిటిక్స్ పాలసీ.. సాంకేతికత ద్వారా ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకెళ్లేందుకు ఈ విధానం దోహదం చేయనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని టెక్నాలజీ బిజినెస్ సెంటర్లో డేటా అనలిటికల్ పార్కును ఏర్పాటు చేస్తారు. సమాచార విశ్లేషకులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు డేటా సెంటర్‌తో సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డేటా అనలిటికల్ సెంటర్లను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, డేటా మైనిం గ్ నిపుణులు తదితరులకు శిక్షణ ఇచ్చేం దుకు టాస్క్ ద్వారా.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెస్తారు. టీ హబ్‌కు అనుబంధంగా డేటా అనలిటిక్స్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు.