100 స్థానంలో 112
- దేశవ్యాప్తంగా కొత్త ఎమర్జెన్సీ నంబర్ ఖరారు చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా నూతన ఎమర్జెన్సీ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న 100 స్థానంలో 112ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జాతీయ అత్యవసర స్పందన వ్యవస్థ(ఎన్‌ఈఆర్‌ఎస్) విధివిధానాలను వివరిస్తూ కేంద్ర హోం శాఖ రాష్ట్రానికి లేఖ పంపించింది.
నూతన వ్యవస్థకు కావాల్సిన సదుపాయాలతో పాటు నిర్వహణ ఖర్చును కూడా తామే భరిస్తామని ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా ఎంవోయూ చేసుకోవాలని ముసాయిదా పత్రాన్ని పంపించింది. కాగా, కేంద్ర నిర్ణయంపై పోలీసు ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. నూతన వ్యవస్థకు సంబంధించి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణను చూస్తామనడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. నంబర్ మారడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎన్‌ఈఆర్‌ఎస్ ముఖ్య ఉద్దేశం..
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం ప్రతి నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలపై నేరాలు తీవ్రమవుతుం డటంతో వాటిని అదుపు చేయడానికి కేంద్రం జాతీయ స్థాయిలో ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి 112 నంబర్‌ను కేటాయించింది. ఈ నంబర్‌కు ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇదంతా నిమిషాల్లో జరిగేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. కాగా, ఎన్‌ఈఆర్‌ఎస్ పర్యవేక్షణ, పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 కమిటీలను ఏర్పాటు చేసింది. డీజీపీ ప్రతిపాదనల మేరకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టేట్ అపెక్స్ కమిటీ, డీజీపీ నేతృత్వంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా మిషన్ కమిటీలను ఏర్పాటు చేసింది.